సినిమా రివ్యూ : ప్రేమ విమానం
రేటింగ్ : 2.5
నటీనటులు : అనసూయ భరద్వాజ్, సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, 'వెన్నెల' కిశోర్, అభయ్ బేతిగంటి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, కల్పలత తదితరులు
ఛాయాగ్రహణం : జగదీశ్ చీకటి
సంగీతం : అనూప్ రూబెన్స్
నిర్మాత : అభిషేక్ నామా
దర్శకత్వం : సంతోష్ కట్టా
విడుదల తేదీ : అక్టోబర్ 12, 2023
ఓటీటీ వేదిక : జీ 5
సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), శాన్వీ మేఘన జంటగా... నిర్మాత అభిషేక్ నామా వారసులు దేవాన్ష్, అనిరుధ్, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ప్రేమ విమానం' (Prema Vimanam Movie). జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Prema Vimanam Story) : చిన్న పిల్లాడు లచ్చు... లక్ష్మణ్ (అనిరుధ్ నామా)కు విమానంలో ప్రయాణించాలని కోరిక. అతడికి అన్న రాము (దేవాన్ష్ నామా) కూడా తోడు అవుతాడు. వాళ్ళది వ్యవసాయ కుటుంబం. పిల్లల ముచ్చట కాదనలేక తండ్రి (రవి వర్మ) సరే అంటాడు. అయితే... అప్పులు తీర్చకలేక ఉరి వేసుకుని మరణిస్తాడు.
మణి (సంగీత్ శోభన్) తండ్రి (గోపరాజు రమణ)ది పల్లెటూరిలో చిన్న కిరాణా కొట్టు. పట్నం పోయి ఉద్యోగం చేయమని తండ్రి చెబితే 'నో' అంటాడు. ఊరి సర్పంచ్ కుమార్తె అభిత (శాన్వీ మేఘన)తో ప్రేమలో ఉండటమే అందుకు కారణం. పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరని ఇద్దరూ లేచిపోతారు. దుబాయ్ వెళ్ళడానికి హైదరాబాద్ వచ్చిన మణి, అభితలకు లచ్చు, రాము ఎలా కలిశారు? తల్లి శాంతమ్మ (అనసూయ) అప్పు తీర్చడం కోసం దాచిన డబ్బు తీసుకొచ్చిన లచ్చు, రాము దగ్గర ఆ డబ్బు ఎవరు కొట్టేశారు? లోకంలో మనుషులు ఎలా ఉన్నారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Prema Vimanam Review) : 'ప్రేమ విమానం' గురించి చెప్పే ముందు 'విమానం'ను గుర్తు చేసుకోవడం అవసరం. రెండు సినిమాలను కంపేర్ చేయడం తగదు కానీ... రెండిటిలోనూ అనసూయ ఉన్నారు. పైగా, రెండూ జీ 5 సినిమాలే! 'విమానం' థియేటర్లలో విడుదలైన తర్వాత 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే... ఆ సినిమా నిర్మాణంలో జీ స్టూడియోస్ భాగస్వామి. 'ప్రేమ విమానం' నేరుగా 'జీ 5' ఓటీటీలో విడుదలైంది.
'విమానం', 'ప్రేమ విమానం'... రెండు టైటిళ్లలో విమానం ఉండటమే కాదు, రెండు కథల్లో కీలకమైన అంశం, కథకు పునాది వేసిన పాయింట్ ఒక్కటే! విమానంలో ప్రయాణించాలని చిన్న పిల్లాడి బలమైన కోరిక. ఆ పిల్లాడి చుట్టూ ఉన్న పాత్రలు, కొన్ని సన్నివేశాలు వేరు కావచ్చు. కానీ, బేసిక్ థీమ్ ఒక్కటే అయినప్పుడు కొన్ని కంపేరిజన్స్ వస్తాయి. సినిమా ప్రారంభంలో 'విమానం', 'ప్రేమ విమానం' మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. అయితే... రెండు సినిమాలను సంగీత్ శోభన్, శాన్వీ మేఘన మధ్య ప్రేమ కథ వేరు చేసింది.
'విమానం' చూసినోళ్ళకు 'ప్రేమ విమానం'లో 'వెన్నెల' కిశోర్ (Vennela Kishore)ను రాము, లచ్చు వేసే ప్రశ్నలు నవ్వించవు. కొత్తగా అనిపించవు. అయితే... సంగీత్ శోభన్, శాన్వీ మేఘనల ప్రేమ పల్లెటూరి స్వచ్ఛత కనిపించింది. మధ్యలో వినోదం కూడా పంచింది. 'విమానం'లో అనసూయ వేశ్యగా కనిపిస్తే... 'ప్రేమ విమానం'లో భర్త మరణం తర్వాత పొలాన్ని, ఇద్దరు పిల్లల్ని కాపాడుకోవడం కోసం తపన పడే తల్లిగా కనిపించారు.
'ప్రేమ విమానం'లో పతాక సన్నివేశాలు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. చివరి అరగంటలో వచ్చే ట్విస్టులు బావున్నాయి. అంతకు ముందు వచ్చే ట్విస్టులు ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. అనూప్ రూబెన్స్ పాటలు కథతో పాటు ప్రయాణించాయి. నేపథ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
నటీనటులు ఎలా చేశారంటే : సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, ఆయన నటనకు ఫ్యాన్స్ ఉన్నారు. 'జీ 5'లోనే విడుదలైన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్, ఈ మధ్య థియేటర్లలో విడుదలైన 'మ్యాడ్' సినిమాతో నవ్వించారు. 'ప్రేమ విమానం'లో ప్రేమికుడిగా కూడా ఆకట్టుకుంటారు. అతని జోడీగా శాన్వీ మేఘన నటనలోనూ, అందంలోనూ మెప్పించారు.
గ్లామర్ పక్కన పెట్టి... నటిగా అనసూయ మెరిశారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. బాల నటుడు దేవాన్ష్, అనిరుధ్... ఇద్దరూ బాగా చేశారు. ముఖ్యంగా అనిరుధ్ టైమింగ్ బావుంది. 'వెన్నెల' కిశోర్ సీన్స్ నవ్వించలేదు. హీరో స్నేహితుడిగా అభయ్ బేతిగంటి, తల్లి తండ్రులుగా సురభి ప్రభావతి, గోపరాజు రమణ... హీరోయిన్ తల్లి తండ్రులుగా కల్పలత, సుప్రీత్ పాత్రల పరిధి మేరకు చేశారు.
Also Read : 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ : స్వాతి బోల్డ్ సీన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
చివరగా చెప్పేది ఏంటంటే : 'ప్రేమ విమానం'లో స్టార్టింగ్ జర్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రేమ మొదలైన తర్వాత పర్వాలేదనిపిస్తుంది. విశ్రాంతి తర్వాత చిన్నగా ఉత్కంఠ పెంచుతూ... కథలో లీనం చేస్తూ వెళుతుంది. ఆసక్తి మొదలయ్యే సమయానికి వెంటనే శుభం కార్డు పడుతుంది. కథ పరంగా కొత్తదనం లేదు. కానీ, చివరి అరగంట బావుంది. నటీనటులు అందరూ చక్కగా చేశారు.
Also Read :'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial