సినిమా రివ్యూ : బనారస్ 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ  తదితరులు
మాటలు : రఘు నిడువల్లి 
ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్!
నిర్మాత : తిలక్ రాజ్ బల్లాల్!
తెలుగులో విడుదల : 'నాంది' ఫేమ్ సతీష్ వర్మ 
రచన, దర్శకత్వం : జయతీర్థ 
విడుదల తేదీ: నవంబర్ 4, 2022


'కెజియఫ్', 'విక్రాంత్ రోణ', 'కాంతార' విజయాల తర్వాత కన్నడ పరిశ్రమ నుంచి సినిమా వస్తుందంటే... ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతోంది. ఆ సినిమాల తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కన్నడ సినిమా 'బనారస్' (Banaras Movie 2022). రాజకీయ నేపథ్యం గల జైద్ ఖాన్ (Zaid Khan) హీరో. దీనికి 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ సినిమా ఎలా ఉందంటే? (Banaras Review) 


కథ (Banaras Story) : ధని (సోనాల్ మాంటెరో) చాలా మంచి అమ్మాయి. ఓ సింగింగ్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఓ పందెంలో నెగ్గడం కోసం ఆమెకు సిద్ధార్థ్ (జైద్ ఖాన్) దగ్గర అవుతాడు. భవిష్యత్తులో మనిద్దరం భార్యాభర్తలం అని, తాను ఫ్యూచర్ నుంచి ప్రజెంట్‌కు వచ్చానని చెబుతాడు. సిద్ధార్థ్ చెప్పిందంతా నమ్మిన ధని... అతడిని తన రూమ్‌కు తీసుకు వెళుతుంది. ఆమె నిద్రిస్తున్న సమయంలో సిద్దార్థ్ సన్నిహితంగా ఫోటో దిగుతాడు. స్నేహితుడు చేసిన పని వల్ల ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధని క్యారెక్టర్ మీద కామెంట్స్, ట్రోల్స్ వస్తాయి. హైదరాబాద్ వదిలేసి 'బనారస్'లోని బాబాయ్ ఇంటికి వెళుతుంది ధని. తాను చేసింది తప్పని గ్రహించిన ఆమెకు సారీ చెప్పడానికి సిద్ధార్థ్ వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? టైమ్ ట్రావెల్ / టైమ్ లూప్‌లో సిద్ధార్థ్ ఎలా పడ్డాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  


విశ్లేషణ (Banaras Telugu Review) : సాధారణ ప్రేమకథగా మొదలైన 'బనారస్' అనూహ్యమైన మలుపులు తిరుగుతూ... ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ... చివరకు ఓ హ్యాపీ నోట్‌లో ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ చూపు తిప్పుకోనివ్వకుండా ఎంగేజ్ చేస్తుందని చెప్పలేం! మధ్య మధ్యలో లూప్ హోల్స్ ఉన్నాయి. అయితే... ఈ సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.


బనారస్ (కాశీ)లో కాకుండా బెంగళూరు, భీమవరంలో తీసినా సరే... కథలో వచ్చే మార్పు ఏమీ ఉండదు. అయితే... ఫిలాసఫీ చెప్పడానికి కాశీ నేపథ్యాన్ని దర్శకుడు ఎంపిక చేసుకున్నారు. తెరపై కొత్త ప్రపంచాన్ని చూపించడానికి కాశీని చక్కగా ఉపయోగించుకున్నారు. ఆయనకు సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి నుంచి ఫుల్ సపోర్ట్ లభించింది. విజువల్స్ బావున్నాయి. 'తొలి తొలి వలపే...' పాటను రొమాంటిక్‌గా చిత్రీకరించారు. కాశీ గంగలో చిత్రీకరించిన 'కన్ను తెరిచిన పాట... కన్నతల్లిది జోలపాట'లో విజువల్స్, కాసర్ల శ్యామ్ సాహిత్యం మనసును తాకుతాయి. 'కాంతార' తర్వాత మరోసారి మంచి పాటలతో బి అజనీష్ లోక్‌నాథ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిర్మాణ విలువలు బావున్నాయి. 


దర్శకుడు జయతీర్థ రాసుకున్న కథ కంటే కథనం... కథలో చెప్పిన ఫిలాసఫీ, మలుపులు ఆసక్తిగా ఉన్నాయి. టైమ్ ట్రావెల్ / లూప్ నేపథ్యంలో ఇంతకు ముందు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే... ఆ కాన్సెప్ట్‌కు ఆయన డిఫరెంట్ టచ్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే... సినిమా స్టార్టింగ్ అంత ఆసక్తికరంగా ఏమీ ఉండదు. టైమ్ ట్రావెల్ అని హీరో చెప్పినప్పటికీ, కాసేపటి తర్వాత ప్రేక్షకులు ఆ సంగతి మర్చిపోతారు. హీరో హీరోయిన్స్ ఫోటో వైరల్ కావడం, దానికి ముందు హీరో స్నేహితులతో కలిసి విదేశాలు వెళ్లడం రొటీన్ అనిపిస్తుంది. ఫోటో వైరల్ అయినప్పుడు... విదేశాల్లో హీరో వేసిన వేషాలు వైరల్ కాలేదా? అని డౌట్ వస్తుంది. ఎందుకంటే... అక్కడ ఒక డ్రగ్ కారణంగా కోతి వేషాలు వేస్తాడు. దర్శకుడు  అటువంటి లాజిక్స్ మిస్ అయ్యారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కూడా రొటీన్. అయితే... కథ కాశీకి షిఫ్ట్ అయిన తర్వాత విజువల్స్, పాటలతో మాయ చేశారు. 


సెకండాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి మరో ప్రపంచంలోకి తీసుకు వెళ్లారు. టైమ్ ట్రావెల్, టైమ్ లూప్ అంటూ సర్‌ప్రైజ్ చేశారు. సెకండాఫ్ స్టార్టింగ్ తర్వాత ఫస్టాఫ్ గుర్తుకు రాదు. ఫస్టాఫ్ చూసి వెళ్లిపోదామనుకున్న వాళ్ళకు ఇంటర్వెల్ ట్విస్ట్ బయటకు వెళ్లనివ్వదు. అయితే... ఎండింగ్ ఆ సర్‌ప్రైజ్ ఫాక్టర్  మీద నీళ్లు చల్లేలా ఉండటం మైనస్. సీన్స్ రిపీట్ చేసినట్టు ఉంటాయి. ట్విస్ట్ రివీల్ అయ్యాక చాలా మంది డిజప్పాయింట్ అవ్వొచ్చు. 


నటీనటులు ఎలా చేశారు? : హీరోగా జైద్ ఖాన్ తొలి చిత్రమిది. మొదటి సినిమాకు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పాలి. హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఎమోషన్స్‌ కూడా చక్కగా చూపించారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే 'తొలి తొలి వలపే...' పాటలో హీరోయిన్ సోనాల్ మాంటెరో గ్లామరస్‌గా కనిపించారు. మిగతా సినిమా అంతా గ్లామర్ కంటే నటనతో ఆకట్టుకుంటారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. జైద్, సోనాల్ జోడీ బావుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. హీరో తండ్రిగా కనిపించిన దేవరాజ్, హీరోయిన్ బాబాయ్ పాత్ర చేసిన అచ్యుత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయం ఉన్న నటులే. పతాక సన్నివేశాల్లో సుజయ్ శాస్త్రి నటన బావుంది. ఫిలాసఫీ చెప్పడం కోసం క్లైమాక్స్ సాగదీసినట్టు ఉంటుంది.  


Also Read : 'తగ్గేదే లే' రివ్యూ : 'దండుపాళ్యం' గ్యాంగ్ తగ్గారా? లేదంటే మళ్ళీ మొదలు పెట్టారా?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'బనారస్' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఒక్క టికెట్టుపై రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఫస్టాఫ్ క్యూట్ అండ్ రొటీన్ మ్యూజికల్ లవ్ స్టోరీ అయితే... సెకండాఫ్ థ్రిల్లింగ్ టైమ్ ట్రావెల్ / లూప్ ఎంటర్‌టైనర్. 'బనారస్'లో లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని పక్కన పెడితే... మంచి పాటలు, విజువల్స్, ఎమోషన్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఉన్నాయి. సెకండాఫ్‌లో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. టైమ్ పాస్ కోసం వీకెండ్ ఒకసారి థియేటర్లకు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు ఉండుంటే కథతో మరింత కనెక్ట్ అయ్యేవాళ్ళు. 


Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?