సినిమా రివ్యూ : అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఆలీ, నరేష్ విజయకృష్ణ, పవిత్రా లోకేష్, మౌర్యాని, సింగర్ మనో, భద్రం, సప్తగిరి, సనా తదితరులు
కథ : అజీష్ పి. థామస్
పాటలు : భాస్కరభట్ల రవికుమార్
ఛాయాగ్రహణం : ఎస్. మురళీరెడ్డి
సంగీతం: రాకేష్ పళిడం
నిర్మాతలు : అలీ బాబ, కొణతాల మోహన్, శ్రీచరణ్ .ఆర్
దర్శకత్వం : కిరణ్ శ్రీపురం
విడుదల తేదీ: అక్టోబర్ 28, 2022
ఓటీటీ వేదిక : ఆహా
హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను కొన్నేళ్లుగా నవ్విస్తున్న ఆలీ (Ali Actor) లో కథానాయకుడూ ఉన్నారు. కొంత విరామం తర్వాత మళ్ళీ హీరోగా ఆయన సినిమా చేశారు. మలయాళ హిట్ 'వికృతి'ని 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' (Andaru Bagundali Andulo Nenundali Movie) పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. దీని నిర్మాతల్లో ఆలీ ఒకరు. ఇందులో నరేష్, పవిత్రా లోకేష్ (Naresh Pavithra Lokesh) భార్యాభర్తలుగా నటించారు. ఆహా ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూడండి (Andaru Bagundali Andulo Nenundali Review).
కథ (Andaru Bagundali Andulo Nenundali Story) : శ్రీనివాసరావు (నరేష్) మూగ వ్యక్తి. భార్య (పవిత్రా లోకేష్), పిల్లలతో సంతోషంగా జీవిస్తుంటాడు. కుమారుడు అస్వస్థతకు గురి కావడంతో రెండు రోజులు నిద్రలేకుండా ఆస్పత్రిలో ఉంటాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు మెట్రోలో నిద్రపోతాడు. అప్పుడు ఫోటో తీసిన మహ్మద్ సమీర్ (ఆలీ) 'తప్ప తాగి మెట్రోలో నిద్రపోతున్న వ్యక్తి' అని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది వైరల్ అవుతుంది. దాంతో సమాజం శ్రీనివాసరావు, అతని కుటుంబాన్ని వెలివేసినంత పని చేస్తుంది. అవమానాలు, ఛీత్కారాలతో చాలా కుటుంబ సభ్యులు అందరూ మానసిక క్షోభ అనుభవిస్తారు. మరో నెలలో శ్రీనివాసరావుకు పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం రావాల్సి ఉండగా... అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. ఈ సమస్యకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు శ్రీనివాసరావు ఫ్యామిలీ కంప్లైంట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తాను పోస్ట్ చేసిన ఫోటో వల్ల జరిగిన పరిణామాలు తెలుసుకున్న సమీర్ ఏం చేశాడు? మధ్యలో దిల్ రుబా (మౌర్యాని)తో అతని ప్రేమ, పెళ్లి కథ ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Andaru Bagundali Andulo Nenundali Review) : సోషల్ మీడియా మన జీవితాల్లో ఓ భాగం అయిపోయింది. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతున్నారు. ట్రోల్స్, మీమ్స్ చూడటం చాలా మందికి కాలక్షేపంగా మారింది. అయితే... వాటి వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి? కొంత మంది జీవితాలు ఎలా తల్లకిందులు అవుతున్నాయి? సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే సమాచారంలో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనేది తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి రావడం ఎంత వరకు సబబు? అనేది 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'లో చక్కగా చూపించారు.
'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' కథలో కామన్ ఆడియన్ రిలేట్ అయ్యే అంశాలు ఎక్కువ. ఇందులో పాత్రధారులను రెగ్యులర్ లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు చూసినట్టు ఉంటుంది. మలయాళంలో 'వికృతి' మంచి విజయం సాధించింది. ఆ కథను తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరంగా చెప్పేటప్పుడు దర్శకుడు శ్రీపురం కిరణ్ సరైన స్క్రిప్ట్ వర్క్ చేయలేదు. మలయాళం సినిమాల్లో డిటైలింగ్ ఎక్కువ ఉంటుంది. కథనం నెమ్మదిగా సాగుతుంది. తెలుగుకు వచ్చే సరికి ప్రేక్షకులు రేసీ స్క్రీన్ ప్లే, మోర్ మోడీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకుంటారు. 'భీమ్లా నాయక్', 'గాడ్ ఫాదర్' సినిమాల్లో మార్పులు, చేర్పులు చేసింది అందుకే! ఈ విషయంలో 'అందరు బాగుండాలి అందులో నేనుండాలి' టీమ్ సరైన వర్క్ చేయలేదు.
ఆలీ నుంచి తెలుగు ప్రేక్షకులు ఆశించే కామెడీని అందించడంలో దర్శకుడు శ్రీపురం కిరణ్ ఫెయిల్ అయ్యారు. ఆలీ, భద్రం కాంబినేషన్ సీన్స్‌లో తప్ప వేరే సన్నివేశాల్లో కామెడీ జనరేట్ చేయలేకపోయారు. ఎమోషనల్ సీన్స్ ఓకే. ఓల్డ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌లో సినిమా సాగింది. అది న్యూ ఏజ్ ఆడియన్స్‌కు ఎంత కనెక్ట్ అవుతుందనేది సందేహమే.
నటీనటులు ఎలా చేశారు? : నటుడిగా ఆలీ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను ఈతరం ప్రేక్షకులు ఎక్కువ కామెడీ రోల్స్‌లో చూశారు. ఇందులో కామెడీ కాకుండా ఇతర ఎమోషన్స్ కూడా ఆలీ చక్కగా పండించగలరని తెలుసుకుంటారు. ఎమోషనల్స్ సీన్స్‌లో ఆలీ అనుభవం కనిపించింది. భద్రంతో సన్నివేశాల్లో కామెడీ టైమింగ్ బావుంది. నరేష్ మూగవానిగా మంచి నటన కనబరిచారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఎప్పటిలా చక్కటి భావోద్వేగాలు పండించారు. నరేష్, పవిత్రా లోకేష్ మధ్య సీన్స్ సహజంగా ఉన్నాయి. మౌర్యాని పాత్ర పరిధి మేరకు నటించారు. మనో, సనా, సప్తగిరి తదితరులు సన్నివేశాలకు అనుగుణంగా నటించారు.
Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'తో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు ఆలీ. ఆయన సెన్సిబుల్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే, ఆయన నుంచి ఆశించే వినోదం పూర్తిస్థాయిలో లేదు. కానీ, స్టోరీ కాన్సెప్ట్ బావుంది. కథనం నిదానంగా సాగింది. సోషల్ మీడియా విషయంలో ప్రజలు ఆలోచించే విధంగా కథాంశం ఉంది. ఆలీ, నరేష్, పవిత్రా లోకేష్ నటన ఆకట్టుకుంటుంది. వీకెండ్ ఖాళీగా ఉంటే కమెడియన్ ఆలీని కాకుండా యాక్టర్ ఆలీ కోసం చూడండి.
Also Read : 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్ ఎలా చేశారు?