మోమోస్.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. ఆవిరితో ఉడికించిన, నూనెలో వేయించిన.. ఏ విధంగా తిన్నా రుచిగా ఉంటుంది. రోడ్డు సైడ్ దొరికే ఫుడ్ లో ఇది ఎక్కువ ప్రజాదరణ పొందిన ఆహారం. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ స్ట్రీట్స్, రోడ్ సైడ్ బండ్ల మీద ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తాయి. వెజ్, నాన్ వెజ్ అనే తేడా లేకుండా మోమోస్ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీటికి జతగా ఇచ్చే స్పైసీ సాస్ డిప్ కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే మోమోస్ అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవి శరీరానికి దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తాయి.


మోమోస్ తినడం వల్ల కలిగే ప్రమాదాలు


మోమోస్ చూడగానే వాటిని తినడం గురించే ఆలోచిస్తారు. కానీ దాన్ని తయారు చేసే పద్ధతి గురించి పెద్దగా పట్టించుకోరు. రోడ్ సైడ్ చేసే మోమోస్ వంటి తినుబండరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


శుద్ధి చేసిన పిండి హానికరం


శుద్ధి చేసిన పిండితోనే అనేక వంటకాలు చేస్తారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం శుద్ధి చేసిన పిండితో ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలని పెంచుతుంది. జీవక్రియ పని చేయకపోవడానికి కూడా కారణమవుతుంది. అంతే కాదు శుద్ధి చేసిన పిండిలో పోషకాలు క్షీణిస్తాయి.


మోమోస్ కోసం మైదా పిండిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇందులో అధిక స్టార్చ్ కంటెంట్ లో ఫైబర్ ఉండాది. తిన్నప్పుడు రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. శుద్ధి చేసిన పిండిలో హైపర్గ్లైసీమిక్, హైపర్‌ ఇన్సులినిమిక్ ప్రభావాలు రక్తంలోని చక్కెరలో తీవ్రమైన మార్పులకి కారణం అవుతుంది. ఇది కాలక్రమేణా మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.


శుద్ధి చేసిన పిండిలో డైటరీ ఫైబర్, విటమిన్లు బి, ఈ, ఐరన్, మెగ్నీషియం, వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయి. అంతే కాదు బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఊబకాయం, రక్తపోటు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.


మోమోస్ లో పెట్టె కూరగాయలు అపరిశుభ్రంగా ఉండటం


రోడ్ సైడ్ చేసే మోమోస్ తినడానికి ఎక్కువగా అందరూ ఇష్టపడతారు. కానీ మోమోస్ లో పెట్టె కూరగాయలు, మాంసం వంటివి అపరిశుభ్రంగా ఉండవచ్చు. ఒక్కోసారి కూరగాయలు, మాంసం నాణ్యమైనవి వాడరు. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ కి గురయ్యే అవకాశం అధికంగా ఉంది. అనేక నివేదికల ప్రకారం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, పొత్తికడుపు ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రో ఎంటెరిటిస్, వాంతులు, తిమ్మిరి వంటి అనేక ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే E.coli బ్యాక్టీరియా వాటిలో ఉంటుంది. అవి తినడం వల్ల రోగాల బారిన పడతారు.


అందులో వాడే క్యాబేజీ, క్యారెట్ వంటి కూరగాయలు శుభ్రంగా కడగకపోతే ఫ్లూ, విరోచనాలు వంటి వాటికి కారణమవుతాయి. క్యాబేజీని సరిగ్గా ఉడికించకపోతే అందులోని టేప్‌వార్మ్ మెదడుకి చేరి అక్కడ పెరిగి ప్రాణాపాయ స్థితికి కారణంఅవుతుంది.


మోమోస్ సాస్ డిప్ కూడా ప్రమాదమే


మోమోస్ తో పాటు ఇచ్చే ఎర్ర మిరపకాయల సాస్, చట్నీ వంటివి కూడా ప్రమాదకరమే. కల్తీ పొడి, నాణ్యత లేని మిరపకాయలతో వాటిని తయారు చేస్తారు. వాటి వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది.


ఊబకాయం కూడా


మోమోస్ లో మోనో సోడియం గ్లుటామెట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఉబకాయనికి దారి తీయడమే కాకుండా నాడీ సంబంధిత రుగ్మతలు, చెమటలు పట్టడం, ఛాతీ నొప్పి, వికారం, దడ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: తలనొప్పిగా ఉన్నప్పుడు తినకూడని ఆహారాలు ఇవి, తింటే నొప్పి పెరిగిపోతుంది