ఎక్కువశాతం మందిని వేధిస్తున్న సమస్య తలనొప్పి. గంటల తరబడి టీవీ లేదా ఫోన్ చూసినా, నిద్ర తగ్గినప్పుడు, డీహైడ్రేషన్, ఒత్తిడి, హ్యాంగోవర్, ఆందోళన, కంటి చూపు సమస్యల వల్ల తలనొప్పి అధికంగా వస్తుంది. కొన్ని సార్లు వాతావరణ మార్పులు, ఘాటుగా ఉండే వాసనలు, మిరుమిట్లు గొలిపే లైట్లు, పీరియడ్స్ సమయంలో తలనొప్పి సర్వసాధారణంగా వస్తుంది. అలా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారాలు లేదా పానీయాలు తీసుకుంటే నొప్పి తగ్గడం సంగతి పక్కన పెడితే ఉన్నది ఇంకాస్త ఎక్కువ అవుతుంది. అవి ఆరోగ్యాన్ని ఇచ్చినా కూడా తలనొప్పి టైమ్ లో తింటే మాత్రం ఆ బాధ మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ ఉన్న వాళ్లు వీటిని దూరం పెట్టాలి.


తలనొప్పిని ఎక్కువ చేసే ఆహారాలు


రెడ్ వైన్: ద్రాక్ష పండ్లు పులియబెట్టి చేసే వైన్ ఆరోగ్యానికి మంచిదని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యకరమైన పానీయం అని అంటారు. కానీ అతిగా తాగితే మాత్రం తలనొప్పి పెంచేస్తుంది. దీనిలో కూడా కొంత శాతం ఆల్కహాల్ ఉంటుంది. అందుకే తీసుకునే కెపాసిటీని బట్టి తలనొప్పిని కలిగిస్తుంది.


ఛీజ్: పాల ఉత్పత్తి ఛీజ్ కూడా తలనొప్పి పెంచుతుంది. ఇందులో ఉండే టైరమైన్ రక్తనాళాలు కుంచించుకుపోయి తలనొప్పికి దారి తీస్తాయి.


చాక్లెట్: పీరియడ్స్ లో ఉన్నప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కలిగడానికి చాలా మంది చాక్లెట్లు తింటారు. కానీ తల నొప్పిగా ఉన్నప్పుడు వాటిని తినకపోవడమే మంచిది. 4-5 ముక్కలు లేదా చాక్లెట్ మొత్తం తినడం వల్ల అందులోని కెఫిన్, టైరమైన్ నొప్పిని తీవ్రతరం చేస్తాయి.


పాలు: పాలు పోషకాలు నిండిన ఆహారం. నిద్ర పోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. కానీ తలనొప్పిగా ఉన్నప్పుడు మాత్రం పాలు తీసుకోకూడదు. ఇందులోని లాక్టోస్ నొప్పి తీవ్రతని ఎక్కువ చేస్తుంది.


సిట్రస్ ఫ్రూట్స్: విటమిన్ సి సమృద్ధిగా దొరికే సిట్రస్ ఫ్రూట్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటిలో అక్టోపమైన్ అనే పదార్థం ఉంటుంది. తలనొప్పి సమయంలో నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష పండ్లు వంటివి తిన్నా నొప్పి అధికం అవుతుంది.


కృత్రిమ స్వీటేనర్లు: మధుమేహుల కోసం తయారు చేసే కృత్రిమ స్వీటేనర్లు కూడా మంచిది కాదు. ఇది డోపమైన్ స్థాయిలని తగ్గిస్తుంది. తలనొప్పిని ప్రేరేపిస్తుంది.


కూరగాయలు: క్యాబేజీ, వంకాయ, చేపలు, మాంసం, వేరుశెనగ కూడా తలనొప్పి సమయంలో తప్పకుండా నివారించాల్సిన ఆహారాలు.


ఎనర్జీ డ్రింకులు: ఎనర్జీ డ్రింకులు తాత్కాలికంగా శక్తిని ఇస్తాయి. కానీ వీటి వల్ల డీహైడ్రేషన్, నిద్రలేకపోవడం, అలసట వంటివి వేధిస్తాయి. ఇవన్నీ కూడా తలనొప్పిని మరింతగా పెంచేవే. అంతే కాదు వీటిలో కూడా కెఫీన్, చక్కెర అధికంగా ఉంటాయి.


కాఫీ: తలనొప్పి అనిపించడగానే స్ట్రాంగ్ గా కాఫీ చేసుకుని తాగుతారు. కానీ అది తలనొప్పి తగ్గించడం కాదు పెంచుతుంది. కెఫిన్ అధికంగా ఉండే కాఫీ నిద్రలేమి సమస్యని పెంచుతుంది. ఫలితంగా తలనొప్పి పెరిగిపోతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: పెరుగు భోజనానికి ముందు తింటే మంచిదా? లేక తరువాత తింటే మంచిదా?