కళ్లు రెప్పలు వేయడం(బ్లింక్ చేయడం) సహజమే. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. రెప్పలు వేయడం వల్ల కళ్లకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ, మీరు మరో విషయం కూడా తెలుసుకోవాలి. కళ్ల రెప్పలు వాటికవే కొట్టుకుంటాయి కదా అని వాటిని అలా వదిలేయొద్దు. ఎందుకంటే.. ఒక్కోసారి మీరు రెప్పవేయడం మరిచిపోతుంటారు. ఔనండి, మీరు టీవీ చూస్తున్నప్పుడో, ఆఫీసు ఫైల్స్ చూస్తున్నప్పుడో, మొబైల్ ఫోన్‌ను స్వైప్ చేసినప్పుడో మీరు రెప్పవేయరు. వాటిని అలా చూస్తూనే ఉండిపోతారు. దాని వల్ల మీ కళ్లు అలసిపోతాయి. కళ్లు క్లీన్ కావు.. పొడిబారిపోతాయి కూడా. కళ్లు రెప్పవేయకపోవడం వల్ల ఇంకా చాలా సమస్యలున్నాయి. అవేంటో చూడండి.
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రమం తప్పకుండా రెప్పలు వేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కళ్లు త్వరగా వృద్ధాప్యానికి గురికాకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. వయస్సు పెరిగేకొద్ది కళ్ల వ్యాధులు కూడా పెరుగుతాయి. గ్లాకోమా, కంటి శుక్లం వంటి సమస్యలు ఏర్పడతాయి. కంటి రెప్పలను వేయడం వల్ల చిన్న చిన్న మలినాల నుంచి రక్షణ లభిస్తుంది. కుళ్లను హైడ్రేటెడ్‌గా ఉంచాలంటే తప్పకుండా రెప్ప వేయాలి. అంటే మీరు గ్యాప్ ఇవ్వకుండా రెప్పలు వేస్తూనే ఉండాలి.
పొడి కళ్లు, కంటి అలసట, అస్పష్టమైన దృష్టిని నివారించడానికి కంటి రెప్పలు వేయడం తప్పనిసరి. వీలైతే రెప్పల వ్యాయామం చేయాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ఇందుకు మీరు రెండు కళ్లను రెండు సెకన్లపాటు మూయండి, మళ్లీ తెరవండి. ఇలా రోజులో కొన్నిసార్లు చేస్తుంటే తప్పకుండా మీ కళ్లు రిలాక్స్‌గా ఉంటాయి. దృష్టి సమస్యలు కూడా రావు. అంతేగాక మీరు ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టీవీలను అలా చూస్తుండిపోకుండా.. స్క్రీన్ బ్రేక్ తీసుకోవాలి.
20-20-20 రూల్ పాటించండి: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే 20-20-20 నియమాలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని 20 సెకన్ల పాటు చూడాలి. దీని వల్ల మీ కళ్లకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. అతి వెలుతురు నుంచి కళ్లను కాపాడేందుకు ‘పోలరైజ్డ్ సన్ గ్లాసెస్’ ధరించాలి. యవ్వనంలో ఉన్నప్పుడే ఇలాంటి గ్లాసెస్ ధరించడం ద్వారా కళ్ల ఆయుష్సును పెంచవచ్చు. ఎందుకంటే.. బాల్యంలోనే కళ్లు అతి నీలలోహిత(UV) కిరణాలకు గురికావడం వల్ల వయస్సు పెరిగిన తర్వాత వేగంగా కంటి సమస్యలు వస్తాయి.
Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు
Also read: పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ ఆహారాలు తరచూ తినిపించండి