ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా తమిళ వెర్షన్ రిలీజ్ విషయంలో కొన్ని అడ్డంకులు వచ్చినట్లు తెలుస్తోంది. 


దర్శకుడు లింగుస్వామి ఇదివరకు డైరెక్ట్ చేసిన, నిర్మించిన తమిళ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా రిలీజ్ అని తెలుసుకున్న ఫైనాన్షియర్లు, బయ్యర్లు లింగుస్వామిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకే ఇప్పటివరకు తమిళంలో 'ది వారియర్' సినిమా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఈ సమస్యలన్నీ పరిష్కరించి సినిమాను చెప్పిన టైంకి రిలీజ్ చేయడానికి లింగుస్వామి ప్రయత్నిస్తున్నారు. 


రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో సినిమాకి ఏ మేరకు ఓపెనింగ్స్ వస్తాయో డౌటే. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.