మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడం ఎప్పుడు ముఖ్యమే. కఠినమైన జీవినశైలి అనుసరిస్తున్నా కూడా ఒక్కోసారి గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులు చెప్పే దాని ప్రకారం రాత్రిపూట రక్తంలో చక్కెర సాధారణంగా తగ్గిపోతుంది. దీని వల్ల హైపోగ్లైసిమియా పరిస్థితి ఏర్పడుతుంది. టైప్ 1, టైప్ 2 బాధితులు సాధారణంగా ఈ పరిస్థితికి గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.


రాత్రిపూట చక్కెర తగ్గిపోవడానికి కారణం ఏంటి?


అనేక కారణాలు గ్లూకోజ్ స్థాయిలలో అసమతుల్యతాకు దారి తీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి పట్టించుకోకుండా వదిలేస్తే ఆరోగ్యానికి చాలా హానికరం. తీవ్రమైన సందర్భాల్లో మూర్చలు లేదా మరణానికి కారణం కూడా కావచ్చు. నిద్రపోయేటప్పుడు చక్కెర లెవల్స్ పడిపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.


డిన్నర్ స్కిప్ చేయొద్దు


మధుమేహులు తమ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ గా ఉంచుకునే విషయంలో ఖచ్చితమైన రొటీన్ ని పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోవడానికి కారణం రాత్రిపూట డిన్నర్ స్కిప్ చేయడం లేదా తేలిక పాటి భోజనం చేయడం సాధారణ కారణాలలో ఒకటి. అందుకే తప్పనిసరిగా డిన్నర్ చేయాలి. అన్ని ఆహార పదార్థాలు సమపాళ్ళలో ఉండే విధంగా తీసుకోవాలి.


రాత్రిపూట వ్యాయామాలు నివారించాలి


ఉదయం సమయం దొరకదని ఎక్కువగా రాత్రిపూట వ్యాయామాలు చేస్తారు. కానీ నిద్రపోయే ముందు కఠినమైన వ్యాయామం చేయకూడదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీని వల్ల రాత్రిపూట రక్తంలో గ్లూకోజ్ పడిపోతుంది.


ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయాలి


నైట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హైపోగ్లైసీమియా పెరుగుతుంది. అందుకే తప్పకుండా నివారించాలి. ఒకవేళ ప్రత్యేక సందర్భాల్లో తీసుకోవాల్సి వస్తే మితంగా మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం మధుమేహం ఉన్న స్త్రీలు రోజుకి ఒక డ్రింక్ మాత్రమే తీసుకోవాలి. పురుషులు అయితే రెండు డ్రింక్స్ తీసుకోవచ్చు.


నిద్రపోయే ముందు చెకప్


రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం అల్పాహారం ముందు, భోజనం చేసిన రెండు గంటల తర్వాత చెక్ చేసుకోవచ్చు. నిద్రవేళ చక్కెర స్థాయి 80-10mg/dl మధ్య ఉండాలి. కనీసం 1-2 వారాల పాటు నిద్రపోయే ముందు పరీక్షించుకోవాలి.


హైపోగ్లైసిమియా సంకేతాలు


ఈ పరిస్థితి ఎదుర్కొంటుంటే మీకు వణుకు, చెమటలు పట్టడం, గందరగోళ పరిస్థితి, ప్రవర్తనలో మార్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. వెంటనే ఇలా ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉంటే రాత్రివేళ నిద్రపట్టడం కూడా కష్టమవుతుంది. అందుకే ఇటువంటి పరిస్థితి వచ్చిందని అనుమానం వస్తే వెంటనే వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: 'నాన్నకు ప్రేమ'తో.. ఫాదర్స్ డే రోజు మీ నాన్నని ఇలా సర్ ప్రైజ్ చేయండి