World Tuna Day 2024: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా మే 2న టూనా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఐక్యరాజ్య సమితి. టూనా చేపలు రోజు రోజుకు క్షీణిస్తున్న నేపథ్యంలో వాటిని అరించిపోకుండా కాపాడటమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని జరుపుతుంది. టూనా అనేది అత్యంత పోషక విలువలు కలిగిన చేప. అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు ముఖ్యమైన ఆహార వనరుగా కొనసాగుతోంది. అందుకే, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా టూనా డే నిర్వహిస్తున్నారు.  


ప్రపంచ టూనా దినోత్సవం ప్రత్యేకత ఏంటంటే?


నిజానికి టూనా దినోత్సం అనేది స్థిరమైన ఫిషరీస్ మేనేజ్‌మెంట్ కు సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నది.  టూనా పరిశ్రమ ఎదుర్కొంటున్నసమస్య గురించి అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 2, 2024న ప్రపంచ టూనా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రతి ఏటా ఒక థీమ్ తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది ఇంకా ఏ థీమ్ తో నిర్వహిస్తారు అనే విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఇంకా వెల్లడించలేదు.


ప్రపంచ టూనా దినోత్సవం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే?


ఐక్యరాజ్య సమితి 2017 నుంచి ప్రపంచ టూనా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. క్షీణిస్తున్న టూనా చేపల గురించి అవగాహన కల్పించడంతో పాటు టూనా చేపల పెంపకం, సంరక్షణ, నిర్వహణను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. టూనా చేపలు అనేక దేశాలకు ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు ఆధారంగా నిలుస్తున్నాయి. అయితే, టూనా చేపల క్షీణత అనేది ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే, సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడటంతో టూనా కీలక పాత్ర పోషిస్తుంది. టూనా సముద్రపు ఆహారపు గొలుసులో కీలక భూమిక కలిగి ఉన్నాయి. అంతేకాదు, కొన్ని సముద్రపు జీవులను పర్యావరణ సమతుల్యతలో ఉంచడానికి సాయపడుతాయి.


టూనా చేపలతో ఆరోగ్యానికి ఎంతో మేలు


టూనా చేపలు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ B12తో పాటు ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారంగా భావిస్తారు. ఇంత విలువైన టూనా చేపలు గత కొద్ది కాలంగా గణనీయంగా తగ్గిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 97 శాతం కంటే ఎక్కువగా అంతరించిపోయాయి. టూనా చేపల జనాభాలో క్షీణత తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే, ఇది అనేక దేశాల ఆహార భద్రత, ఆర్థిక అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నది.    


టూనా చేపల గురించి ఆసక్తికర విషయాలు


1. టూనా చేపలు వేడి రక్తాన్ని కలిగి ఉంటాయి. అవి తమ శరీర ఉష్ణోగ్రతను పరిసరాలకు అనుగుణంగా నియంత్రించగలవు.


2. టూనా చేపలు గరిష్టంగా 6 అడుగుల పొడవు, 500 పౌండ్ల( సుమారు 225 కేజీల)బరువు ఉంటుంది.


3. టూనా చేపలు గంటకు 40 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ఈదుతాయి.   


4. టూనా చేపల ద్వారా ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల రూపాయల విలువైన వ్యాపారం జరుగుతోంది.


Read Also: మరణానికి ముందు మనిషిలో కలిగే ఆలోచనలు ఏమిటీ? మానసిక స్థితి ఎలా ఉంటుంది?