Final Moments: ప్రతి మనిషికి చావు అనేది ఒక భయానక స్వప్నం. చావుతో జీవితం ముగిసిపోతుంది. శరీరాన్ని.. ఆప్తులను విడిచిపోవాలి. ఇలాంటి భయంకరమైన చేదు నిజాన్ని ఒక వ్యక్తి ఎలా జీర్ణం చేసుకుంటాడు.. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మరణం ఏ రూపంలోనై రావచ్చు. కొందరు జబ్బు చేసి చనిపోతూ ఉంటారు.. మరి కొందరు ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటారు. పుట్టిన ప్రతి జీవికి మరణం అనేది తప్పదు. కానీ మరణం నుంచి తప్పించుకోవాలని మాత్రం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. అందుకే తమని తాము ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తారు. అయితే మరణించే సమయంలో ఒక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది. అతడు మానసికంగా ఎలా సంసిద్ధుడు అవుతాడు అనే అంశాలపై పరిశోధకులు కీలక విషయాలను తెలుసుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఓ ప్రముఖ పాలియేటివ్ కేర్ ఫిజిషియన్ చెప్పిన వివరాలివి.
పాలియేటివ్ కేర్ అనేది ప్రత్యేకమైన వైద్య సంరక్షణ. ఇది నొప్పి, తీవ్రమైన అనారోగ్య లక్షణాల నుంచి ఉపశమనం అందించే విభాగం. ఈ టీమ్‌కు చెందిన వైద్యులు మరణాన్ని సమీపిస్తున్న రోగి మానసిక స్థితిని తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఒక రోగి తాను చనిపోయే ముందు తనకు అత్యంత ప్రియమైన వ్యక్తితో గడపాలని భావిస్తాడని పరిశోధనలో తేలింది. అలాగే కొందరు ఒక వ్యక్తి తన చేతిలో మోసపోయిన మరో వ్యక్తికి క్షమాపణలు చెప్పాలని కూడా భావిస్తారట. ఇలా ఒక్కో రోగి.. ఒక్కో విధంగా ఆలోచిస్తారట.
సాధారణంగా వృద్ధులు చనిపోయే ముందు తమ జీవితంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటారు. తమ ఆప్తులను కళ్లారా చూసుకోవాలి అని కూడా భావిస్తూ ఉంటారు. అయితే దీంతోపాటు వారు తమ సన్నిహితులతో చెప్పాలనుకున్న సంఘటనలను, బాధ్యతలను అప్పగించాలని ఆలోచిస్తారు. చనిపోయే ముందు నిర్లిప్తతతో.. తమ భావాలను ఇతరులతో ఎలా పంచుకోవాలో తెలియక సతమతం అయ్యే వారు కూడా ఉంటారు. అయితే ఏది ఏమైనప్పటికీ మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనేది సాధారణంగా ఎవరికి తెలియని పరిస్థితి. అయితే చాలామంది తాము మరణించే వేళ కొద్ది క్షణాల ముందు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు వారి మెదడు కూడా అచేతనం అయ్యే అవకాశం ఉంది. తద్వారా వారికి మరణానికి సంబంధించిన సమాచారం తెలిసి ఉండకపోవచ్చు అని పరిశోధనలో తేలింది.
మరి కొంతమంది చనిపోయే ముందు తమకు ఇష్టమైనటువంటి పక్షులు, జంతువులను తలుచుకుంటారని కూడా ఈ పరిశోధనలో తేలింది. 12 నెలల లోపు చనిపోయే అవకాశం ఉన్న వ్యక్తులపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు తెలిశాయి.
Also Read : ఒక్కో జ్ఞాపకం ఒక్కో బ్రెయిన్ సెల్‌ని కరాబ్ చేస్తుందట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.