Myths and Facts about Psoriasis : సోరియాసిస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, బాధితులకు మద్ధుతు ఇవ్వడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సోరియాసిస్ డే (World Psoriasis Day) జరుపుతున్నారు. ఇది ఎందుకు అవసరం అంటే.. చాలామందికి సోరియాసిస్ గురించి ఎన్నో అపోహలు ఉంటాయి. ఆ సమయంలో వారు నిజాలు తెలియక బాధితులకు సరైన మద్ధతు ఇవ్వరు. దానిని దూరం చేసి.. సోరియాసిస్ గురించి నిజాలు తెలపడమే సోరియాసిస్ డే లక్ష్యం.
సోరియాసిస్ (Psoriasis)
సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక చర్మ వ్యాధి. ఇది సోకిన చోట చర్మ కణాలు చాలా వేగంగా పెరుగుతాయి. దీని వల్ల చర్మం పై భాగంలో ఎరుపు, పొడి మచ్చలు లేదా పొరలు ఏర్పడతాయి.
సోరియాసిస్ కారణాలు (Causes of Psoriasis)
సోరియాసిస్ రావడానికి జన్యుపరమైన కారణాలు ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి లేకపోవడం, ఒత్తిడి, చల్లటి వాతావరణం, స్కిన్ ఇన్‌ఫెక్షన్లు, మద్యం, స్మోకింగ్, కొన్ని రకాల మెడిసన్స్ కూడా సోరియాసిస్‌కు కారణమవుతున్నాయి.
సోరియాసిస్ లక్షణాలు (Symptoms)
చర్మంపై భాగంలో పొడి, పొరల మచ్చలు ఏర్పడతాయి. ఎరుపు రంగు ప్యాచ్‌లు లేదా దద్దుర్లు వస్తాయి. చర్మం గట్టిపడుతుంది. తలపై (Scalp), మోచేతులు, మోకాళ్లు, వెన్ను ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
సోరియాసిస్పై ఉన్న అపోహాలు ఇవే.. (Myths and Facts about Psoriasis)
- సోరియాసిస్ అంటువ్యాధి అని చాలామంది అనుకుంటారు. బాధితులను దూరంగా ఉంచుతారు. ఇది అసలు వాస్తవం కాదు. సోరియాసిస్ ఇతరులకు సోకదు.
- సోరియాసిస్ కేవలం చర్మంపై వచ్చే వ్యాధి మాత్రమేనని అనుకుంటారు. కానీ కాదు.. ఇది ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చే సమస్య. కీళ్ల నొప్పులు, అలసట కూడా కలిగిస్తుంది.
- సోరియాసిస్‌కు చికిత్స లేదు అనుకుంటారు. ఇది కొంతవరకు నిజమే అయినా.. కొన్ని చికిత్సలు ఉన్నాయి. సోరియాసిస్ పూర్తిగా నయం కాకపోయినా.. చికిత్స ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు. మందులు, క్రీములు, లైఫ్‌స్టైల్ మార్పులు బాగా హెల్ప్ అవుతాయి.
- సోరియాసిస్ ఉంటే రోజూ స్నానం చేయకూడదనేది వాస్తవం కాదు. రోజూ సాఫ్ట్ బాత్ చేయాలి. దీనివల్ల చర్మం తేమగా ఉంటుంది. దద్దుర్లు తగ్గుతాయి.
సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్‌లో అసమతుల్యత వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్య అని గుర్తించాలి. బాధితులకు దూరంగా ఉండడం మంచి విషయంకాదు. అలాగే సమస్యను దాచుకోవడం కాదు.. దానిపై ఇతరులకు అవగాహన పెంచాల్సి ఉంది. సమస్యను పూర్తిగా నయం చేయలేకపోవచ్చు కానీ.. చిన్ని చిన్ని జాగ్రత్తలు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేస్తే సోరియాసిస్ నియంత్రణలో ఉంటుంది.