Hepatitis Day 2025 : హెపటైటిస్ అనేది సైలెంట్ కిల్లర్. ప్రతి ఏడాది ఎందరో దీనిని బారిన పడి సరైన అవగాహన లేక మృత్యువాత పడుతున్నారు. అందుకే దీనిపై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. వైరల్‌గా సోకే ఈ హెపటైటిస్ గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంతో పాటు.. హెపటైటిస్ వ్యాధి సోకిన వారికి మద్దతు ఇవ్వడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ స్పెషల్ డే రోజున అసలు హెపటైటిస్ అంటే ఏమిటి? దానిని ఎలా నివారించవచ్చు.. ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి వంటి విషయాలు తెలుసుకుందాం.
హెపటైటిస్
కాలేయంలో వచ్చే వాపు లేదా మంటను హెపటైటిస్ అంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలోని రోగనిరోధక కణాలు కాలేయంపై దాడి చేసి.. వివిధ రకాల వైరస్ల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లు దీనికి కారణమవుతాయి. వీటితో పాటు ఆల్కహాల్, మందులు, డ్రగ్స్, టాక్సిన్స్ వల్ల కాలేయానికి నష్టం జరుగుతుంది. ఇవి కూడా హెపటైటిస్‌కు కారణమవుతాయి. హెపటైటిస్ ప్రధానంగా 5 రకాలు ఉంటుంది. హెపటైటిస్ A, B, C, D, E. ఒక్కో రకం వైరల్ హెపటైటిస్ కోసం ఒక్కో వైరస్ కారణమవుతుంది.
హెపటైటిస్ లక్షణాలు
హెపటైటిస్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అలసట, ఉబ్బరం, నొప్పి, మంట, బరువు తగ్గడం, ముదురు రంగు మూత్రం, మలం రంగులో మార్పులు, కామెర్లు, బలహీనత, కాలేయం సమస్యలు, ఆరోగ్యం దెబ్బతినడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెపటైటిస్ B, C ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. దీనివల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. కాలేయం వైఫల్యానికి దారి తీస్తుంది. దీర్ఘకాలిక పరిస్థితులలో ఇది ప్రాణాంతకం అవుతుంది.
హెపటైటిస్ నివారణ
నివారణ ఎల్లప్పుడూ చికిత్స కంటే మంచిది. కాబట్టి హెపటైటిస్ రాకుండా కొన్ని నివారణ చర్యలు తీసుకోవచ్చు. కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోకపోవడం, ముడి ఆహారాలను పూర్తిగా శుభ్రం చేయడం, తినడానికి ముందు ఉడికించడం, వర్షాకాలంలో బయట ఆహారం తినకుండా ఉండటం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, టీకాలు వేయించుకోవడం కూడా హెపటైటిస్ను నివారించడానికి హెల్ప్ అవుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అధికంగా మద్యం సేవించడం వల్ల కాలేయానికి నష్టం జరుగుతుంది. కాలేయంలో మంట కూడా వస్తుంది. కాబట్టి హెపటైటిస్ను నివారించడానికి మద్యాన్ని తగ్గించాలి. హెపటైటిస్ B, C నివారించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే.. శరీరంలో, ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. వ్యాధి సోకిందని నిర్ధారణ అయితే సాధారణ స్థితికి తీసుకురావడానికి, తక్కువ సమయంలో కోలుకోవడానికి హెల్ప్ అవుతుంది. తక్కువ కేలరీలతో ఉండే పోషకాహారం మంచి ఫలితాలు ఇస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నీటిని బాగా తాగాలి.
ఆహారం సులభంగా జీర్ణం కావాలి కాబట్టి తేలికపాటి వంటలు తింటే మంచిది. గ్రిల్లింగ్, బేకింగ్, ఆవిరి లేదా మరిగించే వంటలు తీసుకోవాలి. పోషకాహారం కాలేయం హోమియోస్టాసిస్ను నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాలేయ పనితీరు బలహీనపడటం తరచుగా వివిధ రకాల పోషకాహార లోపాలకు కారణమవుతుంది. పోషకాహారం కాలేయ పనితీరును రీసెట్ చేసి పూర్తి ఆరోగ్యానికి మద్ధతునిస్తుంది.