operation sindoor Discussion in Lok Sabha and Rajya Sabha | న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడితో పాటు భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌'పై లోక్‌సభలో సోమవారం నాడు ప్రత్యేక చర్చ జరగనుంది. జాతీయ భద్రత, విదేశాంగ విధానాలు అంశాలపై చర్చలో భాగంగా  లోక్ సభలో సోమవారం మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 మధ్య చర్చ ప్రారంభం కానుంది.  వార్తా సంస్థ PTI ప్రకారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ 16 గంటల పాటు జరిగే చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.

అవసరమైతే చర్చలో ప్రధాని మోదీ సైతం

పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలపై మూడు రోజుల పాటు చర్చ కొనసాగే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటనలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, సుప్రియా సులే  సహా ప్రతిపక్షాలకి చెందిన ఇతర నాయకులు సభలో ప్రశ్నలు లేవనెత్తనున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపింది తానేనని, ఇరు దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ పేర్కొనడం సైతం రెండు సభలలో హాట్ టాపిక్ కానుంది. 

కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ

పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చలకు జూలై 30 వరకు సభలో హాజరు కావాలని కాంగ్రెస్ తన లోక్‌సభ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, సుప్రియా సులే  సహా ప్రతిపక్షాలకి చెందిన ఇతర నాయకులు సభలో మాట్లాడతారు. లోక్‌సభలో చర్చ కోసం ప్రతిపక్షాలు ఆదివారం వ్యూహరచన చేశాయి. పార్లమెంట్‌లో ఉదయం 10 గంటలకు ఇండియా బ్లాక్ ఫ్లోర్ లీడర్ల సమావేశం కానున్నారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు ప్రతిపక్షం ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి  సన్నాహాలు చేస్తుంది. 

లోక్‌సభలో ప్రతిపక్షాల నుండి మాట్లాడే సభ్యులు అంచనా: రాహుల్ గాంధీ (మంగళవారం మాట్లాడతారు), గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ, దీపేందర్ హుడా, కేసీ వేణుగోపాల్, రాజా బ్రార్ లేదా పంజాబ్ కు చెందిన ఓ కాంగ్రెస్ ఎంపీ చర్చలో పాల్గొని ప్రశ్నించనున్నారు. కాంగ్రెస్ స్పీకర్లలో శశి థరూర్ పేరు ఇంకా చేర్చలేదని సమాచారం. సమాజ్‌వాదీ పార్టీ ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్, రాజీవ్ రాయ్. తృణముల్ కాంగ్రెస్ (TMC) నుండి: అభిషేక్ బెనర్జీ, డిఎంకె నుంచి కనిమొళి, ఎన్సిపి (ఎస్పీ) నుంచి సుప్రియా సులే, శివసేన (యుబిటి) నుంచి అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, ఆర్జెడి నుంచి అభయ్ కుష్వాహా, మిసా భారతి చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.ఎన్టీఏ నుంచి నుంచి శ్రీకాంత్ షిండే (శివసేన), జేడీయూ నుంచి రాజీవ్ రంజన్ (లాలన్ సింగ్),  టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, హరీష్ బాలయోగి తదితరులు చర్చలో పాల్గొంటారని సమాచారం.

రాజ్యసభలో మంగళవారం పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చ ప్రారంభమవుతుంది. రెండు సభలలో దాదాపు 16 గంటల పాటు చర్చ జరగుంది. 

 

పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి వారం

పార్లమెంటు మొదటి వారంలో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేశారు. రాజ్యసభలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అభిశంసన నోటీసును ప్రస్తావించిన కొద్ది గంటలకే ఆయన రాజీనామా చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలని ప్రతిపక్షం వర్షాకాల సమావేశాల మొదటి రోజున డిమాండ్ చేసింది, అందుకు ప్రభుత్వం అంగీకరించింది. బిహార్‌లో ఓటర్ల జాబితాలను ప్రత్యేకంగా సవరించడంపై ప్రతిపక్షం పార్లమెంటులోని రెండు సభల కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఓటర్ల జాబితాల సవరణ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో అధికార ఎన్డీఏ కూటమికి దోహదం చేస్తుందని ప్రతిపక్షం ఆరోపించింది. 

ఆపరేషన్ సిందూర్‌‌కు భారత్ శ్రీకారం

పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని బైసరన్ లోయలో పహల్గాంలో జరిపిన కాల్పుల్లో ఓ నేపాలీ సహా 26 మంది పౌరులు చనిపోయారు. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దాని ఫలితంగా 2 దేశాల మధ్య నాలుగు రోజుల పాటు ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య పరస్పరం అంగీకారంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే తాను మధ్యవర్తిత్వం చేశానని, ఇది తన క్రెడిట్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రస్తావించారు.