ఆర్జేడీ (RJD) వ్యవస్థాపక అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఇటీవల తన కొడుకు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav)ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తేజ్ ప్రతాప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న స్థానం నుంచి కాకుండా వైశాలి జిల్లాలోని మహువా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లాలోని హసన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
నా ప్రత్యర్థులకు మింగుడుపడకపోవచ్చు..శనివారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘అవును, ఈసారి, నేను మహువా అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఈ నిర్ణయం నా ప్రత్యర్థులకు మింగుడుపడకపోవచ్చు’’ అని అన్నారు. ‘‘నాకు ప్రజల మద్దతు ఉంది.. ప్రజలకు చేరువయ్యేందుకు నేను ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వేదిక‘టీం తేజ్ ప్రతాప్ యాదవ్’తో పెద్ద సంఖ్యలో ప్రజలు కనెక్ట్ అయ్యారు’’అని ఆయన అన్నారు.
అలా చేసేవారికే నా మద్దతుఅసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవిని నిలుపుకోరని తేజస్వి వ్యాఖ్యానించారు. ‘‘చాచా’ (నితీష్) ఈసారి సీఎం కాలేరు. ఈ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారు యువత, ఉపాధి, విద్య మరియు ఆరోగ్యం గురించి మాట్లాడితే.. తేజ్ ప్రతాప్ యాదవ్ వారికి అండగా నిలుస్తారు’’ అని ఆయన అన్నారు.
మహిళతో రిలేషన్షిప్ కారణంగా బహిష్కరణతేజ్ ప్రతాప్ యాదవ్‌ను మే 25న ఆయన తండ్రి లాలూ ప్రసాద్ పార్టీ నుండి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించిన విషయం తెలిసిందే. అనుష్క అనే మహిళతో రిలేషన్లో ఉన్నానని సోషల్ మీడియాలో తేజ్ ఒప్పుకున్న తర్వాతి రోజే ఆయనను ఆర్జేడీ నుంచి బహిష్కరించారు. అయితే తేజ్ ఆ పోస్ట్‌ను ఫేస్‌బుక్ నుంచి తొలగించారు. తనకు ఏ మహిళతోనూ సంబంధం లేదని, తన పేజీ హ్యాక్ అయ్యిందని పేర్కొన్నాడు. ఫేస్‌బుక్ పోస్ట్‌ను తొలగించాడు.
మా మధ్య చీలిక తీసుకురావడానికి కుట్రపార్టీ నుంచి బహిష్కరణకు గురైన కొన్ని రోజుల తర్వాత తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. తనకు మరియు తన తమ్ముడు తేజస్వి యాదవ్ మధ్య చీలిక తీసుకురావడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తన X హ్యాండిల్‌లో రెండు పోస్ట్‌లు చేశారు. ఈ నిర్ణయం చొరబాటుదారులకు అవకాశం ఇస్తుందని పేర్కొన్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యే, కొద్దికాలం మంత్రితేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ పోటీ చేయనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే తేజ్ ప్రతాప్ యాదవ్‌ను బహిష్కరించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి దంపతులకు జన్మించిన ఈ ఇద్దరు సోదరులు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ 2015 అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ రంగప్రవేశం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వల్పకాలం పాటు రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశారు.