Health Benefits of Eggs in Kids and Adults : ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని (World Egg Day) ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ శుక్రవారం రోజున జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఈ స్పెషల్ డే ఈ ఏడాది అక్టోబర్ 10, 2025న వచ్చింది. గుడ్డు ప్రాముఖ్యతను, దానిలోని పోషకాలను గుర్తించి.. ఆరోగ్య ప్రయోజనాలకోసం అందరూ దీనిని తీసుకోవాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. 1996లో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ దీనిని స్టార్ట్ చేసింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ శుక్రవారం (History of World Egg Day) ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని జరుపుతున్నారు.

Continues below advertisement

గుడ్డు మీద చాలా డిబెట్స్ ఉంటాయి. కొందరు ఎగ్ వెజ్ అని.. చాలామంది నాన్​ వెజ్ అని వాదిస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితో గుడ్డులోని పోషకాలు (Nutritional Benefits of Eggs) అన్ని ఇన్ని కాదు. చిన్నదే అయినా వాటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. పర్​ఫెక్ట్ న్యూట్రియంట్ ఫుడ్​గా చెప్పే గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. విటమిన్ A, D, E, B12 ఉన్నాయి. ఐరన్, సెలీనియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. అందుకే వీటిని కచ్చితంగా డైట్​లో చేర్చుకోమంటారు నిపుణులు. అయితే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఏ మోతాదులో తీసుకుంటే మంచిదో చూసేద్దాం. 

పిల్లలు రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చంటే.. (Eggs for Kids)

నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయసు నుంచి అంటే.. 1 నుంచి 3 ఏళ్ల పిల్లలకు రోజుకు గుడ్డులో సగం పెడితే సరిపోతుంది. ఎందుకంటే గుడ్డు మంచిదే అయినా జీర్ణమయ్యేందుకు సమయం పడుతుంది కాబట్టి పిల్లలకు తక్కువగా ఇవ్వాలి. వయసు పెరిగే కొద్ది మోతాదు పెంచుకోవచ్చు. ఏజ్ బట్టి చెప్పాలంటే.. 4 నుంచి 8 ఏళ్ల పిల్లలు రోజుకు 1 పూర్తి గుడ్డు తినొచ్చు. 9 నుంచి 13 ఏళ్ల పిల్లలకు రోజుకు 1 లేదా 2 గుడ్లు ఇవ్వవచ్చు. 

Continues below advertisement

పిల్లలు గుడ్లు తింటే కలిగే లాభాలివే.. 

పిల్లలకు గుడ్డు పెడితే వారిలో బ్రెయిన్ అభివృద్ధి, ఎముకల బలం, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. దీనిలోని ప్రోటీన్ పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా మెదడును అభివృద్ధి చేస్తుంది. 

పెద్దవారు రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు.. (Eggs for Adults)

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యంగా ఉన్న పెద్దవాళ్లు రోజుకు 1 లేదా 2 గుడ్లు తినవచ్చు. శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుకునేవారు లేదా జిమ్ చేసే వారు రోజుకు 2 నుంచి 3 గుడ్లు తీసుకోవచ్చు. డయాబెటిస్ లేదా అధిక కొలెస్ట్రాల్​తో ఇబ్బంది పడేవారు గుడ్డు తీసుకునేందుకు డాక్టర్ల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే వారానికి 4 నుంచి 5 గుడ్లు మాత్రమే తినాలి. 

పెద్దలు గుడ్లు తింటే కలిగే లాభాలివే.. 

వయసు పెరిగే కొద్ది కండర బలం తగ్గుతుంది. కాబట్టి పెద్దలు బలమైన కండరాల కోసం గుడ్డు తినవచ్చు. దీనిలో అధిక ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీర కండరాలను దృఢంగా చేస్తుంది. మెదడు పనితీరుకు మంచిది. దీనిలోని విటమిన్ డి ఇమ్యూనిటీని పెంచుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేసే ల్యూటిన్, జీక్సాన్థిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బరువును కంట్రోల్ చేయాలనుకునేవారు కూడా ఎగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కడుపు నిండిన ఫీల్ ఇవ్వడం వల్ల తక్కువ తింటారు. 

గుడ్డు ఆరోగ్యానికి మేలు చేసే పర్ఫెక్ట్ ఫుడ్. అయితే వయసు, ఆరోగ్య పరిస్థితి బట్టి మోతాదు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.