Data Centers and Water Scarcity: మీరు eపేపర్ చదువుతున్నా, లేదంటే మీ ఫోన్‌లో ఏదైనా చూస్తున్నా, మీరు బ్రౌజ్ చేస్తున్న ఇంటర్నెట్, చూస్తున్న యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్‌లో వచ్చిన వేల మెసేజ్‌లు వీటన్నిటికీ చెల్లించాల్సిన అసలు ఖరీదు ఎంతో తెలుసా? ఇప్పటి వరకు అనుకున్నది కరెంటు బిల్లు గురించి, లేదంటే మొబైల్ డేటా గురించి మాత్రమే కాదు అంతకు మించి. నీళ్లు ఖర్చు అవుతున్నాయి. 

Continues below advertisement


డేటా సెంటర్ల దాహం: ఎంతంటే షాక్ అవుతారు!


టెక్ దిగ్గజాల డేటా సెంటర్లు అంటే మన సమాచారాన్ని భద్రపరిచే భారీ కేంద్రాలకు భారీగా నీళ్లు అవసరం అవుతాయి. డేటా సెంటర్‌లు అంటే కేవలం పెద్ద కంప్యూటర్ పెట్టెలు కావు. అవి పెద్దపెద్ద కర్మాగారాలు. ఈ కేంద్రాలు పనిచేయడానికి, సర్వర్లు వేడెక్కకుండా ఉండడానికి నీరు కావాలి. ఆ నీటిని ఎవాపరేటివ్ కూలింగ్ అనే పద్ధతిలో ఆవిరి చేస్తారు. నీరు ఆవిరి అయ్యిందంటే, అది శాశ్వతంగా వాతావరణంలో కలిసిపోయినట్టే. 


మెగా కంపెనీల లెక్కలు


ఒక 100MW డేటా సెంటర్ రోజుకు ఏకంగా 20 లక్షల లీటర్ల నీరు అవసరం. ఇది మన ఇంట్లో ట్యాప్ ఆన్ చేస్తే వచ్చే నీటితో పోల్చదగిన చిన్న లెక్క కాదు. ఒక 15MW మధ్యస్థ డేటా సెంటర్ వినియోగించే నీరు, ఒక ప్రాంతంలోని మూడు పెద్ద ఆసుపత్రులు వాడుకునే నీటితో సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలు వాడే నీటి లెక్కలు చూద్దాం. ఈ కంపెనీలు మీరు వాడే ప్రతి యాప్‌, వెబ్‌సైట్‌కు సర్వీస్ ఇస్తాయి.



  • • గూగుల్ (Google): గూగుల్ 6.4 బిలియన్ గ్యాలన్లు అంటే 24.2 బిలియన్ లీటర్లు వాడింది, దీనిలో 95% డేటా సెంటర్ల కూలింగ్‌కు మాత్రమే వినియోగించింది. 

  • • మెటా (Meta/Facebook): మెటా (ఫేస్‌బుక్) మొత్తం 3.1 బిలియన్ లీటర్లు వాడింది. ఇందులో డేటా సెంటర్లకు 2.9 బిలియన్ ఉపయోగించింది. 

  • • మైక్రోసాఫ్ట్ (Microsoft): 2022 నుంచి 2023 మధ్య వీరి నీటి వినియోగం ఏకంగా 34% పెరిగింది. 2021-2022లో 34% అంటే 1.7 బిలియన్ గ్యాలన్లు వాడితే, 2022-2023లో 17-20% పెరుగుదల కనిపించింది. 


టెక్ దిగ్గజాలు ఈ సెంటర్లను సాధారణంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనే, అంటే వాటర్-స్ట్రెస్డ్ ఏరియాస్ లోనే ఎక్కువగా పెడుతున్నాయి. ఎందుకంటే, అక్కడ విద్యుత్ ఖర్చు తక్కువ, లేదా పన్ను మినహాయింపులు బాగుంటాయి. నీరు గురించి తర్వాత చూసుకోవచ్చులే అనే ధోరణి కంపెనీల్లో ఉంది. దీనిపై స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన న్యూషా అజామి ఏమన్నారంటే... "టెక్ కంపెనీలకు నీరు అనేది ఒక ఆఫ్టర్‌థాట్. 'ఎవరో ఒకరు ఆ సమస్యను తర్వాత పరిష్కరిస్తారులే' అనేది వారి ప్రధాన ఆలోచన". అన్నారు. 



  1. ఒరెగాన్ పరిస్థితి: అమెరికాలోని ది డాలెస్ అనే చిన్న పట్టణంలో గూగుల్ డేటా సెంటర్ ఉంది. ఆ సెంటర్ ఒక్కటే పట్టణంలో మొత్తం నీటి వినియోగంలో ఏకంగా 29% వాటాను లాగేసుకుంటోంది. అంటే, స్థానిక జనాభా అందరూ కలిసి వాడే నీటిలో మూడింట ఒక వంతు కేవలం సర్వర్‌ల చల్లదనం కోసం వాడుతోంది. 

  2. ఐయోవాలో 5 రోజుల నీరు మాయం: గూగుల్ కౌన్సిల్ బ్లఫ్స్ డేటా సెంటర్ వార్షికంగా దాదాపు 14 బిలియన్ లీటర్లు వాడుతుంది. ఈ నీరు మొత్తం ఐయోవా రాష్ట్రంలోని అన్ని గృహాలకు ఐదు రోజుల పాటు సరిపోయే నీటితో సమానం. 

  3. జార్జియాలో ఎండిన బావులు: న్యూటన్‌కౌంటీ, జార్జియాలో మెటా ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత, స్థానికంగా ఉన్న బెవర్లీ అండ్‌ జెఫ్ మోరిస్ కుటుంబం లాంటి వారికే నీటి కొరత ఏర్పడింది. స్థానిక బావులు అడుగంటిపోయాయి. వాళ్లు తాగే నీళ్ల కోసం పక్క ఊళ్లకు వెళ్లాల్సి వచ్చింది. స్థానిక వాటర్ కమిషన్ 2030 నాటికి ఆ కౌంటీలో తీవ్రమైన నీటి కొరత ఎదురవుతుందని హెచ్చరించింది.


ఎక్కడైతే నీటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో, అక్కడ డేటా సెంటర్‌ల పెరుగుదల వల్ల సంవత్సరానికి ఏకంగా 17% వరకు నీటి ఒత్తిడి పెరుగుతుంది అని Ceres నివేదిక చెబుతోంది. జార్జియాలో ఈ డేటా సెంటర్‌ల వల్ల వచ్చే రెండేళ్లలో నివాసితులకు నీటి ధరలు 33% వరకు పెరుగుతాయని అంచనా.


AI ప్రభావం: నీటి కొరత మరింత పెరుగుతోంది  


ChatGPT లాంటి AI టూల్‌లో క్వెరీకి 500 మి.లీ. నీరు ఖర్చు అవుతుంది. ఇది 20-50 ప్రాంప్ట్‌ల కాన్వర్సేషన్‌కు సరిపోతుంది. మనం రోజుకు ఎన్నిసార్లు గూగుల్ సెర్చ్ చేస్తాం, ఎన్నిసార్లు AI టూల్స్ వాడతాం? అంతేకాదు, ఈ కొత్త AI డేటా సెంటర్‌లు సాంప్రదాయ సెంటర్ల కంటే ఏకంగా 10 నుంచి 50 రెట్లు ఎక్కువ నీటిని తాగేస్తాయి. అంచనాల ప్రకారం, 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా AI కారణంగా 6.4 ట్రిలియన్ లీటర్లు అవసరమవుతుంది. 


కంపెనీలు ఏం చెబుతున్నాయి? 


ఈ సమస్యపై నిరసనలు, అంతర్జాతీయ వివాదాలు పెరుగుతుండటంతో టెక్ కంపెనీలు కూడా తమ ప్రయత్నాలు చెబుతున్నాయి.


• అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు 2030 నాటికి తాము వాడే నీటి కంటే ఎక్కువ నీటిని స్థానిక కమ్యూనిటీలకు పునరుద్ధరిస్తామని చెబుతున్నాయి. 


• మైక్రోసాఫ్ట్, ఎవాపరేటివ్ కూలింగ్ వాడే సెంటర్లలో 95% వరకు నీటి వినియోగాన్ని తగ్గిస్తామని వాగ్దానం చేసింది.


• గూగుల్ క్లోజ్డ్-లూప్ సిస్టమ్స్ అండ్‌ వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులు వాడతామని చెబుతోంది.


పరిష్కారం లేదా? 


నీటిని తక్కువగా ఉపయోగించే లిక్విడ్ కూలింగ్ వంటి సాంకేతికతను ప్రోత్సహించాలి. దీని ద్వారా 50-70% వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడమని కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది.  


మీరు మీ డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయే ప్రతిసారీ, మీ సోషల్ మీడియా ఫీడ్ స్క్రోల్ చేసే ప్రతిసారీ, మీరు అడిగే ప్రతి AI ప్రశ్నకు వెనుక కోట్లు లీటర్ల నీటి వినియోగం జరుగుతోందని గుర్తుంచుకోండి. లేదంటే, మనకు ఇంటర్నెట్ ఉంటుంది కానీ, మనం తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు.