మూడంతస్థుల భవనం. ఎవరైనా ఆ ఇంటిని చూస్తే డే కేర్ సెంటర్ అనుకుంటారు. నిజానికి అది సాధారణ కుటుంబం ఉంటున్న ఇల్లే. కాకపోతే పిల్లలే 23 మంది ఉంటారు. వారిని చూసుకోవడానికి  16 మంది ఆయాలు. అందుకే చాలా మంది ఆ ఇంటిని డేకేర్ సెంటర్‌గా పొరబడుతుంటారు. ఆ ఇంట్లో  24 ఏళ్ల క్రిస్టినా, తన భర్తా పిల్లలతో నివసిస్తోంది. అమెరికాలోని జార్జియాలో ఉంటున్నారు వీళ్లు. క్రిస్టినాది రష్యా. కాకపోతే ఎప్పుడో వచ్చి అమెరికాలో సెటిలైంది. ఆ దేశానికే చెందిన గాలిప్‌ని పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టం. 
వారి పిల్లల్లో 22 మంది వయసు రెండేళ్లు లేదా అంతకన్నా తక్కువే. వారంత క్రిస్టినా పిల్లలే. అంత మంది పిల్లలు ఎలా పుట్టారా? ఆమె ఎలా కన్నాదా? అని ఆలోచిస్తున్నారా? వారిలో 21 మంది సరోగసీ ద్వారా పుట్టిన వారే. ఒకరిని మాత్రం క్రిస్టినానే ప్రసవించింది. మరొకరు గాలిప్ మొదటి భార్యకు పుట్టినవారు. కేవలం సరోగసీ కోసమే భారీ మొత్తంలో ఖర్చు చేశారు. 


వైరల్‌గా మారి...
అమెరికాలో వీరి సూపర్ బిగ్ ఫ్యామిలీ ఫోటోలు ట్విట్టర్లో వైరల్‌‌గా మారాయి. 23 మంది పిల్లలను చూసుకునేందుకు 16 మంది ఆయాలను పనిలో పెట్టుకుంది క్రిస్టినా. తనకు, తన భర్తకు పిల్లలంటే చాలా ఇష్టమని అందుకే ఇలా పిల్లల్ని కన్నట్టు చెప్పింది. తనకు వందమంది కన్నా ఎక్కువ పిల్లలు కావాలని, ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబాన్ని ఏర్పరచాలనేది తన కోరికనే చెబుతోంది. తాను అందరి అమ్మల్లానే ఉంటానని, నిత్యం పిల్లల పనుల్లో మునిగి తేలుతుంటానని చెబుతోంది క్రిస్టినా. పిల్లల కోసం ఎక్కువ సార్లు షాపింగ్ కూడా చేయాల్సి వస్తోందని చెబుతోంది. 



ఇంకా పిల్లల్ని కంటా...
తాము ఇక సరోగసీ జోలికి పోమని, త్వరలోనే తాను గర్భవతి కావాలంటుకుంటున్నట్టు చెబుతోంది క్రిస్టినా. కాకపోతే ఇంత మంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం చాలా కష్టమని వాయిదా వేసినట్టు చెప్పింది. ముందుగా తన పిల్లలతో బాండింగ్ పెంచుకుంటానని తెలిపింది. వారానికి 20 పెద్ద డైపర్ ప్యాకెట్లు, 53 డబ్బాల పాల పొడి  అవసరం అవుతున్నాయని క్రిస్టినా పిల్లలకు. 


నెటిజన్ల ట్రోలింగ్..
నెటిజన్లు మాత్రం వీరి కుటుంబాన్ని చూసి విమర్శిస్తున్నారు. ‘మీ ఇష్టం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు’ అని ఒకరు కామెంట్ చేస్తే,‘పిల్లల్ని కనడం ఫన్ కాదు, ఇలా ఎందుకు చేస్తారు కొందరు’ అని మరొకరు విమర్శించారు. క్రిస్టినా మాత్రం ‘ఇది మా జీవితం, మా ఇష్టం’ అని తెగేసి చెబుతోంది.