మీరు ‘పెళ్లయిన కొత్తలో’ సినిమా చూశారా? అందులో పెళ్లికాని వేణు మాధవ్‌ను ఒక స్టేజ్‌పై నిలుచోబెట్టి మెడలో ఒక ట్యాగ్ వేసి వెల కడతారు. కొంతమంది అమ్మాయిలు వచ్చి అక్కడ వారు భర్తను సెలక్ట్ చేసుకుంటారు. కానీ, వేణు మాధవ్‌ను మాత్రం ఎవరూ సెలక్ట్ చేసుకోరు. దీంతో వేణు మాధవ్ మెడలో ‘ఫ్రీ’ బోర్డ్ వేస్తాడు వేణు మాధవ్. ఈ సీన్ సినిమాలో చూసేందుకు భలే ఫన్నీగా ఉంటుంది. కానీ, నిజజీవితంలో అలా జరిగే ఛాన్సే ఉండకపోవచ్చు. పూర్వం స్వయంవరం పేరుతో అబ్బాయిలను ఎంపిక చేసుకొనేవారు. అమ్మాయి తనకు నచ్చిన వరుడి మెడలో పూలమాల వేసి భర్తగా స్వీకరించేది. ప్రస్తుతం పెళ్లి చూపుల ట్రెండ్ మాత్రమే నడుస్తోంది. అబ్బాయిలే స్వయంగా అమ్మాయి ఇంటికి వెళ్తున్నారు. అన్నీ మాట్లాడుకుని పెళ్లి ఖాయం చేసుకుంటున్నారు. 


అయితే, బీహార్‌లోని మధుబని జిల్లాలో అమ్మాయిలే స్వయంగా మార్కెట్‌కు వెళ్లి తమకు నచ్చిన భర్తను ఎంపిక చేసుకుంటారు. ఈ మార్కెట్ ప్రతి రోజు ఉండదు. ప్రత్యేకమైన రోజుల్లోనే ఉంటుంది. సౌరత్ మేళా లేదా సభాగచ్చి పేరుతో ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తారు. 9 రోజుల వరకు జరిగే ఈ మేళలో వేలాది మంది పెళ్లికాని ప్రసాద్‌లు వస్తారు. రావి చెట్టుకింద నిలుచుని తమను ఎవరు కొనుగోలు చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.  


అయితే, ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు. సుమారు 700 సంత్సరాల నుంచి అమల్లో ఉంది. కర్నాట్ రాజవంశానికి చెందిన రాజా హరి సింగ్ ఏడు శతాబ్దాల క్రితం ఈ మేళాను ప్రారంభించారని సమాచారం. ప్రతి వరుడికి వారి విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం ఆధారంగా ధరను నిర్ణయిస్తారు. మైథిలీ వర్గానికి చెందిన మహిళలు ఎక్కువగా ఈ మేళాలో పాల్గొని భర్తను కొనుగోలు చేస్తారు. వస్తువుల షాపింగ్ తరహాలోనే అక్కడ కూడా ఆఫర్స్ ఉంటాయి. కొంతమంది మహిళలు అక్కడి అబ్బాయిల బర్త్, స్కూల్ సర్టిఫికెట్లు కూడా పరిశీలిస్తారు. దీంతో ఆ మార్కెట్‌కు వెళ్లే అబ్బాయిలు తప్పకుందా అన్ని ఆధారాలు దగ్గర ఉంచుకోవాలి. అమ్మాయికి అబ్బాయి నచ్చిన తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులు చర్చించుకుని పెళ్లి ఖాయం చేస్తారు.  


ఈ మార్కెట్లో ఎక్కువగా ఇంజినీర్లు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోందట. అలాగే తక్కువ వయస్సు ఉన్న యువకులు త్వరగా అమ్ముడవుతున్నారట. వరుడిని కొనుగోలు చేయడమంటే.. వరకట్నం ఇస్తున్నట్లే లెక్క. కానీ, కట్నాలు లేకుండా ఉండేందుకే ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. ఒకప్పుడు కేవలం వరుడిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకొనేవారు. కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది. వరుడికి డబ్బులిచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. 


పేరుకు మాత్రమే ఇది వరుడి మార్కెట్. అమ్మాయిలకు అబ్బాయిలను ఎంపిక చేసుకొనే విషయంలో వారి కుటుంబ సభ్యుల పెత్తనమే ఎక్కువగా ఉంటుంది. బాగా సెటిలైన్ అబ్బాయిలను చూసుకుని బేరాలడి మరీ పెళ్లి సెటిల్ చేసేసుకుంటారు. ఈ మార్కెట్ గురించి ఇటీవల బాగా ప్రచారం లభించిన నేపథ్యంలో చాలామంది కుర్రాళ్లు వందలాది కిలోమీటర్లు ప్రయాణించి మేళాలో తమ లక్ పరీక్షించుకోడానికి వస్తున్నారు. కొందరు మాత్రం అక్కడ అమ్మాయిలు ఎలా ఉంటారో చూద్దామని సరదాగా వస్తున్నారట. 


Also read: మీరు ఎంత తిన్నా బరువు పెరగని ఆహారాలు ఇవన్నీ,భయపడకుండా నచ్చినంత తినండి


Also read: యుక్త వయసును వృథా చేస్తే అంధకారమే, ఇలాంటి పనులు చేస్తే త్వరగా ముసలివాళ్లయిపోతారు