పాములను చూడగానే ఒళ్లు జలదరిస్తుంది కదూ. కేవలం పాము మాత్రమే కాదు.. పాము చర్మం (కుబుసం) కూడా భయపెడుతుంది. ఎక్కడైనా కుబుసం కనిపించిందంటే.. పాము కూడా ఆ చుట్టుపక్కలే ఎక్కడో తిరుగుతున్నది అని అర్థం. ఆస్ట్రేలియాలోని బెలిందా కానే అనే మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తన గార్డెన్‌లో పాము విడిచిన కుబుసం చూసి ఆమె షాకైంది. పాము తన ఇంట్లో తిష్ట వేసిందనే భయంతో ఆమె గార్డెన్ మొత్తం జల్లెడ పట్టింది. కొంపదీసి ఇంట్లోకి గాని చొరబడిందా అనే ఆందోళనతో స్నేక్ రెస్క్యూ టీమ్ సాయం కూడా కోరింది. కానీ, పాము కనిపించలేదు. దీంతో ఆ పాము తన గార్డెన్‌లో కుబుసం వదిలేసి వెళ్లిపోయి ఉంటుందని భావించి ఊపిరి పీల్చుకుంది. 


సాధారణంగా పాము కుబుసం వదిలినప్పుడు.. అక్కడక్కడ ముక్కలైపోతూ ఉంటుంది. కానీ, ఈ పాము కుబుసం మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు. పాము ముఖం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కుబుసం పొడవు సుమారు ఆరు అడుగులు పైనే ఉంటుందని అంచనా. మొదట్లో బెలిందాకు కేవలం పాము తోక భాగం కనిపించలేదు. గార్డెన్‌లో పాము కోసం వెతుకుతున్న సందర్భంలో అస్థిపంజరాన్ని తలపించే తోక భాగం కనిపించింది. బెలిందా ఈ పాము కుబుసం చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యాయి. పాములపై అవగాహన నిపుణులు స్పందిస్తూ.. అది ట్రీ స్నేక్ అని తెలిపారు. ఈ తరహా పాములకు విషం ఉండదని, దీనిపై ఆందోళన చెందవద్దని బెలిందాకు సూచించారు. బెలిందా పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను ఇక్కడ చూడండి.


కుబుసం వీడటం అనేది.. పాముల్లో నిత్యం జరిగే ప్రక్రియ. ఏడాదిలో రెండు సార్లు అవి పాత చర్మాన్ని వదిలేస్తాయి. పాము చర్మం కింద మరో కొత్త చర్మం పొలుసులుగా తయారవుతుంది. దాని వల్ల పైన చర్మం వదులుగా మారుతుంది. లోపలి చర్మం పూర్తిగా ఏర్పడిన తర్వాత పాము పాత చర్మాన్ని కుబుసంలా వదిలేస్తాయి. కుబుసం విడిచే ముందు పాము నోటి వద్ద పాత చర్మంపై చీలిక కూడా ఏర్పడుతుంది. పాములకు దానంతట అదే చర్మాన్ని విసర్జించడం కష్టం. దీంతో అవి కొమ్మలు లేదా రాళ్లను రుద్దుకుంటూ పాతచర్మాన్ని వదిలేస్తాయి.
Also Read: కూల్ డ్రింక్స్ తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందా?


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి