మీరు కారులో ప్రయాణిస్తున్నారా? అయితే, తప్పకుండా మూత్రం పోసుకుని కూర్చోవాలి. లేకపోతే అది మరణానికి దారితీయొచ్చట. అదెలా అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవల్సిందే. 


‘టిక్‌టాక్’లో @medexplained2you అకౌంట్‌తో హెల్త్ టిప్స్ చెబుతున్న ఓ డాక్టర్ చెప్పిన సూచనలు విని.. అంతా షాకవుతున్నారు. మూత్రం పోసుకోకుండా కార్లో ప్రయాణిస్తే అంత డేంజరా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  అయితే, ఆయన చెప్పిన విషయంలో కూడా వాస్తవం లేకపోలేదు. మనం దీన్ని ఈజీగా తీసుకున్నా.. అసలు విషయం తెలిసిన తర్వాత తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. 


డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘మీరు కారులో సుదీర్ఘ ప్రయాణానికి ప్లాన్ చేసినప్పుడు తప్పకుండా మూత్ర విసర్జన చేయాలి. ఆ తర్వాతే కారులో కూర్చోవాలి. మార్గ మధ్యలో కానిద్దాంలే అని వాయిదా వేయొద్దు. అలాగే ప్రయాణం మధ్యంలో టాయిలెట్ వచ్చినా..  కారు ఆపి పని కానిచ్చేయడం బెటర్. ఎందుకంటే.. మూత్రం లేదా మలాన్ని ఉగ్గబెట్టుకుని ఆపకోవడం వల్ల మూత్రాశయం ఉబ్బుతుంది. ఆ సమయంలో మీరు కారు ప్రమాదంలో చిక్కుకుంటే.. మీరు చనిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంట్రాపెరిటోనియల్ అనే పొత్తికడుపు గోడలో చీలిక ఏర్పడుతుంది. అది పగిలితే బాధితుడు వెంటనే చనిపోతాడు. మూత్రాశయం ఖాళీగా ఉన్నట్లయితే.. అది చిట్లిపోయే అవకాశం తక్కువ’’ అని తెలిపారు.


పెల్విక్ ఫ్లోర్ నిపుణులు కూడా గతంలో మూత్రాన్ని ఉగ్గబెట్టుకుని ఉంచుకోవడంపై హెచ్చరించారు. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుని ఉంచడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ (UTI) ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, రెండు రకాలుగా దీని నుంచి ముప్పు ఉంది. నిత్యం సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యం బస్సుల్లో ప్రయాణించేవారు కూడా మూత్రం విసర్జన తర్వాతే ప్రయాణం చేయడం బెటర్. రైళ్ల తరహాలో బస్సులో టాయిలెట్స్ ఉండవు కాబట్టి.. దీన్ని ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి.


UTIలు ప్రాణాంతక సెప్సిస్‌కు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీ మూత్రం వచ్చిన వెంటనే పోసుకోకుండా బలవంతంగా ఆపుకోవడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడుతుందని, దాని వల్ల పెల్విక్ ఫ్లోర్ కూడా దెబ్బతింటుందని తెలుపుతున్నారు. బిగపెట్టుకుని ఉండటం వల్ల మూత్రాశయంలోని కండరాలు మనకు అవసరమైనప్పుడు సంకోచించే సామర్థ్యాన్ని కోల్పోతాయట. ఫలితంగా మనం మూత్రం పోసుకోడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. చివరికి అది మీరు మూత్రాన్ని ఆపుకోలేని పరిస్థితికి దారి తీస్తుందట. అంటే, మూత్రం వచ్చినా మీరు దాన్ని బలవంతంగా ఆపలేరు. అప్పుడు డైపర్లు వేసుకోవల్సి వస్తుంది.  


UTI లక్షణాలు ఇలా ఉంటాయి


⦿ మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు రక్తం పడుతుంది.
⦿ అకస్మాత్తుగా మూత్రం వచ్చేస్తుంది. 
⦿ తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది.
⦿ మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా ఉంటుంది. లేదా మంటగా ఉంటుంది.
⦿ కడుపులో చిన్నగా నొప్పి ఏర్పడుతుంది.
⦿ నుడుం వద్ద లేదా పక్కటెముకల కింద నొప్పి ఏర్పడుతుంది.
⦿ మూత్రం చిక్కగా ఉంటుంది. 
⦿ మూత్రం నుంచి ముక్కు పగిలే వాసన వస్తుంది.
⦿  రాత్రి సమయంలో సాధారణం కంటే ఎక్కువగా మూత్రానికి వెళ్తారు. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: అబ్బాయిలూ ఈ పనులు చేస్తున్నారా? మీ మగతనం మటాషే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial