వండోయ్, మీకో విషయం తెలుసా? మహిళలు ఉదయం, పురుషులు సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం మంచిదట. ఇదేం లాజిక్కు? వ్యాయమం చేయడానికి ఏ సమయమైతే ఏమిటనేగా మీ సందేహం? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. 


లావును తగ్గించుకోడానికి, పొట్టను అందంగా మార్చుకోవాలని భావించే మహిళలు ఉదయం వేళల్లో వ్యాయమం చేయడమే ఉత్తమం అని ఓ అధ్యయనం పేర్కొంది. అలాగే పురుషులు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వ్యాయామం చేయడం మంచిదని తెలిపింది. మహిళలు రోజు ప్రారంభంలో.. అంటే ఉదయం వేళల్లో వ్యాయమం చేయడం వల్ల రక్తపోటులో ఎక్కువ తగ్గుదలను చూడవచ్చని అధ్యయనం చెప్పింది.  


పురుషులు సాయంత్రం వ్యాయమం చేయడం ద్వారా రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చని తెలిపింది. రాత్రి వ్యాయమం వల్ల కొవ్వును కరిగించే సామర్థ్యం కూడా పెరుగుతుందట. కాబట్టి పురుషులు బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు కాకుండా, రాత్రి భోజనం(డిన్నర్)కు ముందే వ్యాయమం చేస్తే అలసట ఉండదని అధ్యయనం వెల్లడించింది.


అధ్యయనంలో భాగంగా వారానికి నాలుగు సార్లు వర్కవుట్ చేసిన 27 మంది మహిళలు, 20 మంది పురుషులను పరిశీలించగా ఈ విషయాలు బయటపడ్డాయి. వారిలో సగం మంది ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య, మిగిలిన వారు సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల మధ్య వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా ఉదయం వ్యాయమం చేసిన మహిళలు, రాత్రి వర్కవుట్ చేసిన పురుషుల్లో సత్ఫలితాలను కనుగొన్నారు. 


న్యూయార్క్‌లోని స్కిడ్‌మోర్ కళాశాలకు చెందిన డాక్టర్ పాల్ ఆర్సిరో ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘‘ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల మహిళలకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. రోజంతా యాక్టీవ్‌గా కూడా ఉంటారు. పొట్ట కొవ్వు, రక్తపోటును తగ్గించుకోవాలని చూసేవారు ఉదయాన్నే వ్యాయమం చేయడం ఉత్తమం’’ అని తెలిపారు. 


25 నుండి 55 సంవత్సరాల వయస్సు స్త్రీలు ఉదయం వ్యాయమం చేయడం వల్ల తమ శరీరం నుంచి సగటున 10 శాతం కొవ్వును కోల్పోయినట్లు అధ్యయనంలో తెలుసుకున్నారు. అయితే, సాయంత్రం వ్యాయామం చేసే మహిళల్లో పొత్తికడుపు కొవ్వు కేవలం 3 శాతమే తగ్గినట్లు పేర్కొన్నారు. ఉదయం వేళల్లో వ్యాయామం చేసే మహిళల రక్తపోటులో ఎక్కువ తరుగుదలను చూశారు. 


ఉదయం వేళల్లో వివిధ పనుల్లో నిమగ్నమయ్యే మహిళలు.. రాత్రి వేళ వ్యాయమం చేస్తున్నప్పుడు ఎక్కువ అలసిపోతున్నట్లు తెలుసుకున్నారు. ఎక్కువ కొవ్వును కరిగించే తగిన వ్యాయమాన్ని చేయలేకపోయారు. అయితే రాత్రిపూట వ్యాయామం చేసే పురుషుల్లో మంచి ఫలితాలు కనిపించాయి. అధ్యయనంలో పాల్గొన్న మహిళలు, పురుషులను 12 వారాలపాటు వారానికి నాలుగు వ్యాయామ సెషన్‌లు చేయాలని కోరారు. ఇందులో భాగంగా ఒక సెషన్ రెసిస్టెన్స్ ట్రైనింగ్, యోగా లేదా పైలేట్స్ వంటి స్ట్రెచింగ్ సెషన్, స్ప్రింట్ ట్రైనింగ్ సెషన్‌లు ఇచ్చారు. 35 నిమిషాల పాటు ఈత కొట్టడం లేదా ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం వంటి వ్యాయామాలను చేయించారు. ఓర్పును పరీక్షించడానికి సైక్లింగ్ లేదా రోయింగ్, ఏరోబిక్ వ్యాయామాలను సైతం చేయించారు. 


అధ్యయనంలో ఉన్న వ్యక్తులందరికీ 12 వారాల పాటు స్థిరమైన ఆహారాన్ని ఇచ్చారు. కాబట్టి వారు తీసుకున్న ఆహారం ఫలితాలపై ప్రభావం చూపలేదని అధ్యయనంలో పేర్కొన్నారు. వ్యాయామ ఫలితాలు లింగాన్ని బట్టి మారుతుంటాయి. మహిళల్లో హార్మోన్లు, సిర్కాడియన్ రిథమ్‌లు కూడా పాత్రను పోషిస్తాయి. కాబట్టి, మహిళలు ఉదయం వేళల్లో వ్యాయమం చేయడమే ఉత్తమం అని అధ్యయనం సూచిస్తోంది. రాత్రి వేళల్లో వ్యాయామం చేయడం ద్వారా పురుషుల్లో ఎక్కువ కొవ్వు కరుగుతుందని, వేగంగా బరువు తగ్గుతారని పేర్కొంది. చూశారుగా, దీన్ని బట్టి మీ వ్యాయామాన్ని ప్లాన్ చేసుకోండి. 


Also Read: రసగుల్లాల కోసం వందలాది రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు, ఏందయ్యా ఇది?


Also Read: సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌‌కు మధ్య తేడాను ఈ లక్షణాలతో గుర్తించండి