పెద్ద సంఖ్యలో మహిళలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో UTIలు వచ్చే ప్రమాదం ఎక్కువ. మరీ ముఖ్యంగా ఇది గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. శరీర నిర్మాణం కారణంగా ఇది సంభవిస్తుంది. స్త్రీ మూత్రనాళం మలద్వారానికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల మూత్ర నాళంలోకి బ్యాక్టీరియా త్వరగా ప్రవేశించి ఇన్ఫెక్షన్స్ కు కారణమవుతుంది. ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకుంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూత్ర విసర్జనలో అవరోధాలు, మూత్రంలో రాళ్ళు, మూత్రపిండాల వ్యాధులు, డయాబెటిస్ మెల్లిటస్, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మందులు తీసుకున్నప్పటికీ ఈ సమస్య అదుపులోకి రాకపోతే సంక్లిష్టమైన UTI గా వైద్యులు పరిగణిస్తారు. హాస్పిటల్ చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
కాంప్లికేటెడ్ UTI వల్ల అవయవాలు వైఫల్యానికి దారితీసే ప్రాణాంతక పరిస్థితి అవకాశాలను పెంచుతుంది. హైడ్రోనెఫ్రోసిస్, కోలోవెసికల్ ఫిస్టులా, గర్భధారణ సమస్యలు, మూత్రపిండాల మార్పిడి తర్వాత కనిపించే ఇన్ఫెక్షన్లు, వెన్నుపాము గాయపడిన రోగుల్లో ఈ కాంప్లికేటెడ్ UTI కనిపిస్తుంది.
లక్షణాలు
⦿ జ్వరం
⦿ నిరంతరం మూత్ర విసర్జన చేయాలనే కోరిక
⦿ మూత్రంలో రక్తం
⦿ వాంతులు
⦿ పొత్తి కడుపు నొప్పి
ఈ లక్షణాలు కనిపిస్తే అసలు విస్మరించొద్దు. సొంతంగా ఔషధాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే వైద్యులను కలిసి రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకుని తగిన రీతిలో చికిత్స తీసుకోవాలి.
చికిత్స ఎలా?
వైద్యులను సప్రదించిన తర్వాత మందులు తీసుకుని వాటిని ఉపయోగించాలి. ఔషధాలు తీసుకున్నప్పటికీ పరిస్థితిలో ఎటువంటి పురోగతి కనిపించకపోతే దాని వెనుక పరిస్థితి తీవ్రమని అర్థం చేసుకోవాలి. మూత్ర విసర్జన లేదా ఇన్ఫెక్షన్ సోకిన మూత్రపిండాన్ని పరిశీలించడానికి వైద్యులు కొన్ని పరీక్షలు సూచిస్తారు. ఇన్ఫెక్షన్ దశ, రోగి పరిస్థితిని బట్టి యాంటీ బయాటిక్స్ సిఫార్సు చేస్తారు. సకాలంలో చికిత్స తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటితో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఎక్కువ ఘాడత కలిగిన రసాయన ఉత్పత్తులు ఉపయోగించకూడదు. వదులుగా ఉండే కాటన్ లోదుస్తులు, బట్టలు ధరించడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఇన్ఫెక్షన్ నుంచి బయటపడే మార్గాలు
హైడ్రేట్ గా ఉండాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకి పోతాయి. అలాగే విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి వ్యతిరేకంగా పోరాడంలో సహాయపడుతుంది. నారింజ, బ్రకోలి, చిల్లీ పెప్పర్, జామ కాయ వంటి ఆహారాల్లో ఉండే విటమిన్ సి మూత్రంలోని pH స్థాయిని తగ్గిస్తుంది. దీంతో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. ప్రొబయోటిక్స్ తీసుకోవడం పెంచాలి. పెరుగు, కిమ్చీ, ఊరగాయాలు, కెఫీర్ వంటి వాటిలో ఉండే మంచి బ్యాక్టీరియా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ నుంచి బయట పడేందుకు సహాయపడుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ప్రొబయోటిక్స్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ ని త్వరగా తగ్గించేందుకు దోహదపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: అమ్మాయిలూ ఇది విన్నారా? టాయిలెట్ సీట్ కంటే మీ మేకప్ బ్రష్ మీదే బ్యాక్టీరియా ఎక్కువట!