Colds In Summer | వర్షాకాలంలో వానలో తడిస్తే జలుబు వస్తుంది. చలికాలంలో చలి తీవ్రత వల్ల కూడా జలుబు వస్తుందని తెలుసు. కానీ, వేసవిలో కూడా జలుబు, తుమ్ములు రావడం ఏమిటీ? చోద్యం కాకపోతే? అని అనుకుంటాం. బహుశా వేసవిలో శరీరానికి వేడి చేయడం వల్ల జలుబు చేస్తోంది కాబోలని చాలామంది అనుకుంటారు. లేదా ఏసీ గదిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల వచ్చింది కాబోలని భావిస్తాం. వాస్తవం ఏమిటంటే.. జలుబు, దగ్గు, తుమ్ములకు సీజన్లతో పనిలేదు. ఏ సీజన్‌లోనైనా ‘‘నేనున్నా’’ అని అని పలకరిచేది జలుబు ఒక్కటే. అంతేకాదు.. ఇది ఒక్కోసారి జ్వరంలోకి కూడా దించేస్తుంది. కానీ, వేడిగా వేసవిలో జలుబు ఎందుకు వస్తుందనే సందేహం గురించి మరింత క్లియర్‌గా తెలుసుకోవాలని ఉందా? అయితే, చూసేయండి. 


వేసవిలో ఏర్పడే జలుబును ‘హేఫీవర్’ అంటారు. వేసవిలో వేడి వాతావరణం వల్ల చల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. దాని వల్ల కూడా జలుబు వచ్చి ఉండవచ్చని భావిస్తారు. అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ, జలువు రావడానికి మాత్రం ‘కోల్డ్ వైరస్’ ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది చల్లని వాతావరణం లేదా చల్లని పదార్థాల వల్ల రాదని, ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వైరస్ వల్లే వస్తుందని చెబుతున్నారు.  


వేసవిలో ఏర్పడేది సాధారణ జలుబేనా?: జలుబు ఏర్పడటానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా అనేక రకాల వైరస్‌లు సున్నితంగా ఉండే మన శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. జలుబుకు కారణమైన వైరస్‌లు వేసవిలో కూడా జీవించగలవు. ముఖ్యంగా చల్లగా ఉండే ఆఫీసులో, ఇళ్లలో ఇవి తిష్ట వేస్తాయి. ఇంట్లో లేదా ఆఫీసులో మీరు ప్రయాణం చేసే ప్రజా రవాణా వ్యవస్థలో ఏ ఒక్కరికీ ఈ వైరస్ ఉన్న వెంటనే వ్యాపిస్తుంది. అయితే, ఇప్పుడు కోవిడ్-19 ఉనికిలో ఉంది కాబట్టి, జలుబును సాధారణంగా భావించలేం. కాబట్టి, తప్పకుండా కోవిడ్ టెస్టు చేయించుకోవాలి.


Also Read: గుండె నొప్పిని మీ కాళ్లు ముందే హెచ్చరిస్తాయి, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!


ఇక చలికాలం వైరస్‌లు బయట ప్రాంతాల్లో కూడా జీవించగలవు. అందుకే, ఆ కాలంలో జలుబు ఎక్కువగా ఉనికిలో ఉంటుంది. అయితే, వేసవిలో ‘ఎంటరో‌వైరస్’ అనే కోల్డ్ వైరస్ వేసవిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. మీకు జలుబుతోపాటు ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు ఏర్పడుతున్నట్లయితే.. తప్పకుండా అది ‘ఫ్లూ’ లక్షణాలని తెలుసుకోవాలి. వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలి. 


Also Read: రెండు అంగాలతో బాలుడు, వైద్యులు పెద్దదే ఎందుకు తొలగించారు?


వేసవిలో వచ్చే జలుబును ఎలా నివారించాలి?: వేసవిలో మీకు బాగా జలుబు చేసినట్లయితే నీరు బాగా తాగండి. గొంతు నొప్పిగా ఉన్నట్లయితే ఉప్పు నీటిని పుక్కిలించండి. ముక్కు మూసుకుపోతున్నట్లయితే డికంగెస్టెంట్ డ్రాప్స్ లేదా స్ప్రేలను వాడండి. కానీ, వాటిని అతిగా ఉపయోగించడం అంత మంచిది కాదు. వీలైతే వైద్యుడి సూచనతో పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ లేదా ఆస్పిరిన్ తీసుకోండి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ కథనంలో యథావిధిగా అందించాం. ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. చికిత్స కోసం మీరు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.