పాలు, పెరుగు లేకుండా అసలు ఉండలేరు కొంతమంది. పాల నుంచి పెరుగు దాని నుంచి మజ్జిగ వచ్చినప్పటికీ మూడింటి మధ్య తేడాలు చాలా ఉన్నాయి. అవి అందించే పోషకాలు కూడా భిన్నంగా ఉంటాయి. కానీ చాలా మంది మాత్రం పెరుగు కంటే మజ్జిగ తీసుకోమని సూచించడానికి కారణం ఏంటి అంటే.. ఈ మూడు శరీరంలో ప్రతి స్పందించే విధానంలోని మార్పులే అందుకు కారణమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వేడిని తాకినప్పుడు పులియబెడుతుంది. అది కడుపులోకి వచ్చినపుడు కూడా పొట్టలోని వేడి ఆమ్లాలు కారణంగా పులియబెట్టడం జరుగుతుంది. దాని వల్ల పేగులు వేడెక్కుతాయి. కానీ పెరుగు నుంచి వచ్చిన మజ్జిగ మాత్రం శరీరాన్ని చల్లబరుస్తుందని అంటారు. మజ్జిగ అన్ని రకాల శరీరాలకు, సీజన్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే పెరుగు కంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైనదని స్పష్టం చేశారు. పెరుగు కొవ్వు, బలాన్ని పెంచుతాయి. వాత అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగుని అందరూ తినలేరు.
ఎవరు తినకూడదు?
ఊబకాయం, కఫ రుగ్మతలు, రక్తస్రావం, వాపు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు పెరుగుకి దూరంగా ఉండాలి. అంతే కాదు రాత్రిపూట పెరుగు తినకూడదని ఆయుర్వేద శాస్త్రం నొక్కి చెప్తుంది. ఎందుకంటే ఇది జలుబు, దగ్గు, సైనస్ లు ప్రేరేపిస్తుంది. ఒకవేళ రాత్రిపూట పెరుగు తినకుండా ఉండలేరని అనుకుంటే అందులో చిటికెడు మిరియాలు లేదా మెంతులు వేసుకుని తినడం అలవాటు చేసుకోవాలి.
పెరుగుని వేడి చేయకూడదు. అందులొనీ మంచి బ్యాక్టీరియా నాశనం అవుతుంది. కొంతమంది పెరుగుని వేడి చేసి మజ్జిగ చారు వంటివి తయారు చేస్తారు. అయితే అది తరచూ తింటున్న వారి శరీరం మాత్రమే తట్టుకోగలదు.
చర్మ రుగ్మతలు, పిత్త అసమతుల్యత, తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు పెరుగు తినకపోవడం మంచిది.
అయితే పెరుగుకి బదులు దాని నుంచి వచ్చే మజ్జిగ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, పింక్ సాల్ట్, కొత్తిమీర వేసి తాగితే రుచి అద్భుతంగా ఉంటుంది.
మజ్జిగ ప్రయోజనాలు
ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వ్యాధులను నయం చేస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. వాపు, జీర్ణ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఆకలి లేకపోవడం, రక్తహీనత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
చలికాలంలో అయితే అజీర్ణం సమస్య రాకుండా నివారిస్తుంది. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల జీర్ణం కావడం సులభం. ఆకలిని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. అదే పెరుగు తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే మజ్జిగ చక్కని ఎంపిక
బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. బరువు పెరగాలంటే పెరుగు తగ్గాలంటే మజ్జిగ ఎంచుకోవాలి. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల శరీరానికి చల్లదనం ఇస్తుంది. వేడికి దూరంగా ఉంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి