పచ్చి పాలు కాచిన వెంటనే దాని మీద మందపాటి పొర ఏర్పడుతుంది. అదే మీగడ. ఎంతో టేస్టీగా ఉండే మీగడ తినేందుకు చిన్నపిల్లలు చాలా ఇష్టం చూపిస్తారు. అసలు మీగడ ఎందుకు ఏర్పడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? బీటా లాక్టోగ్లోబులిన్ వంటి ప్రోటీన్ల డీనాటరేషన్ వల్ల మీగడ ఏర్పడుతుంది. పాలు ఉష్ణోగ్రత, కంటైనర్ ఆకారం, అందులోని పాల పరిమాణం సహా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పాలను ఉడకబెట్టినప్పుడు అందులోని ప్రోటీన్లు డీనాట్ అవుతాయి. పాల కొవ్వు గడ్డకట్టి దాని మీద జిగట వంటి పొర ఏర్పడుతుంది. ఈ మీగడని అనేక విధాలుగా ఉపయోగించుకుంటారు. కొంతమంది పాల మీగడ ఫ్రిజ్ లో పెట్టుకుని దానితో నెయ్యి చేసుకుంటారు.
భారత్ లో ఇలా..
పశ్చిమ బెంగాల్ లో పాల మీగడని సోర్ అంటారు. సర్పురియా, సర్భజ్ అనే రెండు తీపి పదార్థాలు దీనితోనే తయారు చేస్తారు. కర్ణాటకలో దీన్ని 'కేనే', తమిళంలో 'ఆడై', హిందీలో 'మలై', మలయాళంలో 'పాద' అని పిలుస్తారు. మలై అంటే నిజానికి క్రీమ్ అని అర్థం.
చైనాలో..
పాల మీద మీగడని చైనాలో అధిక పోషక విలువలు కలిగినదిగా పరిగణిస్తారు. వివిధ డెజర్ట్, రుచికరమైన పదార్థాలు తయారు చేస్తారు. అనేక వంటల్లో రుచి కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలా దేశాలలో మీగడని భధ్రపర్చి అమ్ముతారు. మరికొన్ని ప్రాంతాల్లో దాన్ని ఎండబెట్టి పొడిగా తయారు చేసి దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అనేక ప్రాంతాల్లో దీన్ని పాక్షికంగా పులియబెట్టి అమ్ముతారు. తీపి, చేదు, చప్పని రుచిలో అందుబాటులో ఉంటుంది.
మీగడ తినేందుకు మాత్రమే కాదు అందాన్ని పెంచుకునేందుకు కూడా దోహదపడుతుంది. మొహం మీద పేరుకుపోయిన టాన్ ని తొలగించుకునేందుకు మీగడ ఫేస్ ప్యాక్ గా అప్లై చేసుకోవచ్చు. 10 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత దాన్ని సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఫేస్ ప్యాక్ గా వేసుకునే ముందు అందులో కాస్త రోజ్ వాటర్, శనగ పిండి కలుపుకుని రాసుకోవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా మార్చి మెరుపుని అందిస్తుంది. చర్మం మీద పేరుకుపోయిన మృత కణాలు తొలగించడంలో సహాయపడుతుంది. నల్లగా ఉండే మెడ, మోచేతులు, మోకాళ్ళ మీద మీగడ రాసుకుని బాగా స్క్రబ్ చేసుకుంటే నలుపు తగ్గుతుంది.
నెయ్యిగాను చేసుకోవచ్చు..
ప్రతిరోజూ మీగడ తీసి గిన్నెలో పెట్టుకుని దాన్ని బ్లెండ్ చేసుకుంటే ఫ్రెష్ వెన్న వస్తుంది. బయట దొరికే బటర్ కంటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని శుభ్రంగా నీటితో కడిగి బాగా కాస్తే ఘుమఘుమలాడే నెయ్యి రెడీ అయిపోతుంది. ఇది మాత్రమే కాదు ఈ బటర్ నాన్ వెజ్ కూరల్లో వేసుకుంటే గ్రేవీగా ఉంటుంది. మంచి రుచి అందిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: రోజూ మెట్లు ఎక్కండి - ఈ 9 ప్రమాదకర క్యాన్సర్లు మీ దరిచేరవు