సాంప్రదాయ భారతీయ వంటల్లో ఉప్పు, పసుపు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఏదైనా నాన్ వెజ్ వంటకం చేసే ముందు ఆ మాంసాన్ని ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టడం చేస్తారు. ఇక చేపలు అయితే కొంతమంది వాటి వాసన పోగొట్టేందుకు ఉప్పు, పసుపు వేసి కడుగుతారు. అలాగే వాటిని వంట చేసే ముందు ఉప్పు, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు వేసి మారినేట్ చేస్తారు. ఇది పురాతన వంట సంప్రదాయం. ఇలా చెయ్యడానికి ఒక కారణం కూడా ఉంది.


పురాతన కాలం నుంచి భారతీయ వంటలలో సువాసన ఇచ్చే పదార్థంగా పసుపుని ఉపయోగిస్తారు. ఇది వంటలకి ప్రత్యేకమైన రుచి ఇవ్వడమే కాదు మారినేట్ చేయడం వల్ల చేపలు ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. ఉప్పు వాటి తాజాదనాన్ని చెడిపోకుండా కాపాడుతుంది.


పచ్చి చేపలని మెరినేట్ చేయడానికి పసుపు ఉపయోగించడానికి కారణం అందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు. జెర్మ్స్, ఇన్ఫెక్షన్స్ ని రాకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఉప్పు, పసుపు కలయిక వల్ల చేపలు తాజాగా ఉంటాయి. సూక్ష్మజీవుల సంతానోత్పత్తి అవకాశాలని తొలగిస్తుంది. చేపల్ని ఇలా మెరినేట్ చేసి పెట్టడం వల్ల చెడువాసన ఉండవు. ఇవి చేపలకి మంచి ఆకృతి కూడా ఇస్తాయి.


చేపల వల్ల ప్రయోజనాలు


చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీర నొప్పులని తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు శీతాకాలంలో చేపలు తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణగా ఉంటాయి. జలుబు, దగ్గు వంటివి దరి చేరకుండా అడ్డుకుంటాయి. చర్మాన్ని సంరక్షించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారిపోతుంది. ఒమేగా ఆమ్లాలు ఆ సమస్యని దూరం చేస్తాయి.


గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేపలు తినాలి. గుండె పోటు రాకుండా నివారిస్తుంది. మానసిక ఆందోళనతో బాధపడే వారికి చేపలు అధ్బుతమైన ఔషధం. యాంగ్జయిటీ, డిప్రెషన్ సమస్యలు ఉన్నవాళ్ళు చేపల్ని వారానికి రెండు మూడు సార్లు తింటే మంచిది. కంటి చూపుని మెరుగుపరచడంలోని కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉండాలంటే చేపలు తినాలి. చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉండదు కాబట్టి చేపల ద్వారా విటమిన్ డి పొందవచ్చు. ఈ విటమిన్ వల్ల శరీరం కాల్షియాన్ని శోషించుకునేలా చేస్తుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు ధృడంగా మారతాయి. రోగనిరోధక శక్తి పెరిగేందుకు సీఫుడ్ సహకరిస్తుంది. అందుకే తరచూ చేపలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఈ సింపుల్ వ్యాయామాలతో బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది