తెలంగాణ చరిత్రలో డిసెంబరు 9కి ఎంతో ప్రాధాన్యం ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ తేదీకి గతంలో ఉన్న ప్రాముఖ్యాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని గమ్యం వైపు మలుపు తిప్పిన తేదీ డిసెంబరు 9, 2009 అని గర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆమరణ దీక్షకు పూనుకొన్న నేత కేసీఆర్ ఉక్కు సంకల్పానికి డిసెంబరు 9 నాడే అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.


రోజుల తరబడి ఆమరణ దీక్ష చేసిన కేసీఆర్‌కు ఆయన భార్య శోభ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న ఫోటోను ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. 


‘‘స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్కజేయకుండా ఆమరణ దీక్షకు పూనుకున్న ఉద్యమ నేత కేసీఆర్ గారి ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసిన రోజు. తెలంగాణ ఉద్యమాన్ని గమ్యం వైపు మలుపు తిప్పి 60 యేండ్ల ఆకాంక్షలకు సరికొత్త ఊపిరినిచ్చిన చారిత్రాత్మక మైలురాయి!’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.






డిసెంబరు 9వ తేదీ అయిన నిన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన సంగతి తెలిసిందే. భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు తెలంగాణ భవన్ లో సంబరాల మధ్య జరిగాయి. నేడు (డిసెంబరు 9) మ‌ధ్యాహ్నం 1.20 గంట‌ల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ భార‌త రాష్ట్ర స‌మితిగా పేరు మార్పు ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. ఆ పత్రాలను ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ సంబంధిత అంగీకార పత్రాలపై సంతకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.


తెలంగాణ భవన్ లో జరిగిన ఈ వేడుకలకు కర్ణాటక నేత, జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి, న‌టుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. కేసీఆర్‌కు అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధ‌రించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


రాబోయేది రైతు ప్రభుత్వమే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. త్వర‌లోనే పార్టీ పాల‌సీలు రూపొందిస్తామ‌న్నారు. రైతుపాల‌సీ, జ‌ల‌ విధానం రూపొందిస్తాం అని పేర్కొన్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హిస్తాం. కుమార‌స్వామి క‌ర్ణాట‌క సీఎం కావాల‌న్నారు. నాలుగైదు నెల‌ల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యం ప్రారంభ‌మ‌వుతుంద‌ని అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని పేర్కొన్నారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ విధాన ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.


ముందుగా కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోటీ !


వచ్చే ఏప్రిల్ లోపు.. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ కూడా  పోటీ చేస్తోంది. జేడీఎస్.. బీఆర్ఎస్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకుంది. ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి కూడా జేడీఎస్ నేతకుమారస్వామి హాజరయ్యారు. బీఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ కర్ణాటక అని.. అక్కడ కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు ఇస్తామన్నారు కేసీఆర్. అయితే మద్దతు ఇస్తారా.. కొన్ని సీట్లలో పోటీ చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.