Best Places for Flying Kites : చలికాలంలో వచ్చే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతిని పురస్కరించుకుని చిన్నా, పెద్దా కలిసి ఆకాశంలోకి పతంగులను ఎగురవేస్తారు. అయితే ఈ గాలిపటాన్ని ఎగురవేయాలంటే ఎలాంటి ప్రదేశాలు ఎంచుకోవాలి, ఏయే ప్రాంతాల్లో ఎగురవేయకూడదు అన్న విషయాలు చాలా మందిని గందరగోళానికి గురి చేస్తూ ఉంటాయి. అవి తెలియక తమ పతంగులను కోల్పోవాల్సి ఉంటుంది లేదా దాన్ని ఎగురవేసే వ్యక్తి ప్రమాదానికి కూడా గురి కావచ్చు. ఈ సందర్భంగా గాలిపటాలను ఏ ప్రాంతాలను ఎంచుకోవాలి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గాలిపటం ఎగరడానికి స్థిరమైన గాలి ఉండాలి. బీచ్‌లు, పార్కులు, పొలాలు వంటి పుష్కలంగా ఉండే ఖాళీ ప్రదేశాలు గాలిపటాలను ఎగురవేసేందుకు ఉత్తమ ప్రదేశాలుగా చెప్పవచ్చు. చెట్లు, విద్యుత్ లైన్లు, విమానాశ్రయాల దగ్గర గాలిపటాలు ఎగురవేయకూడదు. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనవి.
గాలిపటం ఎగురవేయడానికి కొన్ని చిట్కాలు:
గాలిని చెక్ చేయండి:
చెట్లు, కొండలు, భవనాలు లేదా పొదలు వంటి అడ్డంకులు లేకుండా పెద్ద, చదునైన ప్రాంతం కోసం చూడండి. అధికంగా వీచే గాలి.. అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. ఇది మీ గాలిపటం ఎగరడాన్ని కష్టతరం చేస్తుంది.
మీ పరిసరాలను చెక్ చేయండి:
మీ గాలిపటం మీ చుట్టూ ఉన్న ఎవరికీ లేదా దేనికీ హాని కలిగించదని నిర్ధారించుకున్నాకే ఎగురవేయండి.
విద్యుత్ లైన్లు లేదా కార్ల దగ్గర ఎగురవేయొద్దు:
మీ గాలిపటం విద్యుత్ లైన్లలో చిక్కుకుపోతే, దాన్ని అక్కడే వదిలేయండి. వీలైతే ఆయా ప్రదేశాల్లో ఉన్న విద్యుత్ అధికారులను సంప్రదించండి. అంతేకానీ దాన్ని తీసుకునేందుకు రిస్క్ చేయకండి. దీని వల్ల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో, రోడ్లపై :
గాలిపటాలు ఎగురవేయాలంటే ఆ ప్రాంతం విశాలంగా ఉండాలి. ఇరుకుగా ఉండకూడదు. కావున రద్దీగా ఉండే రోడ్లపై పతంగులను ఎగురవేయకూడదు.
గాలిపటాలు ఎగురవేస్తే వచ్చే లాభాలివే
గాలిపటాలు ఎగురవేయడానికి ప్రత్యేక సమయంటూ లేకపోయినప్పటికీ మన దేశంలో మాత్రం సంక్రాంతి పండుగ సమయంలో ఎగురవేస్తారు. ఈ పండుగ చలికాలంలో వస్తుంది. ఈ కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ ల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. కావున పతంగులను బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేయడం వల్ల మన శరీరంపై సూర్య కిరణాలు పడి, విటమిన్ డి అందుతుంది. దీని వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయి. అంతే కాకుండా ఈ సీజన్ లో గాలి ఒకే దిశగా సాగడం వల్ల గాలిపటాలు ఎగరేయడానికి సులువుగా ఉంటుందని కూడా చెబుతారు.