Food Combinations to Avoid : ఫుడ్ లవర్స్, తినడాన్ని బాగా ఇష్టపడేవారు.. రకరకాల ఫుడ్ కాంబినేషన్స్​ని ట్రై చేస్తారు. కొన్ని సూపర్ సక్సెస్ అయితే.. మరికొన్ని అట్టర్​ఫ్లాప్ అవుతాయి. అలాగే కొన్ని పదార్థాలు కలిపి తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని కాంబినేషన్స్ మాత్రం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి. అలాంటి వాటిలో కలిపి తినకూడని ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి? వాటిని తింటే కలిగే నష్టాలు ఏంటి? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో తెలుసుకుందాం. 


చేపలు తిన్నాక.. 


చేపలు మంచి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అలాగే పాలు కూడా ఆరోగ్యానికి చాలామంచిది. కానీ చేపలు తిన్నాక పాలు తాగకూడదట. ఎందుకంటే చేపలు, పాలల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కాకపోతే విభిన్న లక్షణాలు కలిగి ఉంటాయి. చేపలు వేడినిస్తే.. పాలు చల్లదనాన్ని ఇస్తాయట. ఈ రెండూ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణ సమస్యలు వస్తాయి. శరీరంలో టాక్సిన్లు ఏర్పడతాయి. మరికొందరిలో అలెర్జీలు, చర్మసమస్యలు వస్తాయట. గట్ హెల్త్​పై ప్రభావం చూపి జీర్ణ సమస్యలను పెంచుతుందట. 


పండ్లు తిన్నాక.. 


పాలు, పండ్లు డెడ్లీ కాంబినేషన్ అనిపిస్తుంది. అందుకే వీటితో జ్యూస్​ లాంటివి చేసుకుంటారు. కానీ కొన్నిరకాల పండ్లు తిన్నప్పుడు పాలు అస్సలు తాగకూడదట. నారింజ, పైనాపిల్స్, కివీలు వంటి ఎసిడిక్, సిట్రస్ పండ్లు తిన్న సమయంలో పాలు తాగొద్దట. దీనివల్ల ఫుడ్ జీర్ణం కాకుండా ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా గ్యాస్, ఉబ్బరం, కడుపులో అసౌకర్యం ఏర్పడుతుంది. జీర్ణక్రియను నెమ్మదించేలా చేసి.. పోషకాల శోషణను అడ్డుకుంటుందని నిపుణులు చెప్తున్నారు.


గుడ్లతో.. 


చాలామంది చికెన్, మటన్, రొయ్యలు వాటిలో గుడ్లు వేసుకుంటారు. చికెన్ బిర్యానీలో కూడా గుడ్డు తింటూ ఉంటారు. అయితే నిపుణుల ప్రకారం.. మీట్ తినేప్పుడు గుడ్డు తినకపోవడమే మంచిదట. ఎందుకంటే మీట్, గుడ్లలో ప్రోటీన్​ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్​ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కడుపు ఉబ్బరం, అలసట, జీర్ణ సమస్యలు పెరుగుతాయి. అలాగే తిన్నది అరగడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. పోషకాలను శరీరానికి అందకుండా చేసి.. తీసుకున్న ఆహారాన్ని టాక్సిన్లుగా మారుస్తుందట. 


భోజనం తిన్నాక.. 


మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసేప్పుడు కాంబినేషన్​గా ఫ్రూట్స్ తీసుకోకూడదట. దానికంటే వెజిటెబుల్స్ ఉడికించుకొని తినడం మంచి ఆప్షన్​గా చెప్తున్నారు. అలాగే పండ్లు వేగంగా జీర్ణమవుతాయి కానీ.. భోజనంతో కలిపి తింటే.. లేట్​గా జీర్ణమవుతాయి. దీనివల్ల కడుపులోనే పులిసిపోయే.. గ్యాస్, ఉబ్బరం, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాగే పండ్లలోని పోషకాలు కూడా శరీరానికి అందవని చెప్తున్నారు నిపుణులు. 


కూల్ డ్రింక్స్​తో 


కొందరు స్నాక్స్​ని, కూల్​ డ్రింక్స్​తో కలిపి తీసుకుంటారు. అయితే చీజ్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినేప్పుడు కూల్ డ్రింక్స్ తాగకపోవడమే మంచిదట. చీజ్​లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. చల్లని, కార్బోనేటెడ్ పానీయాలతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియపై నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల కొవ్వులు టాక్సిన్లుగా మారతాయి. కడుపు ఉబ్బరం, అసౌకర్యం ఏర్పడుతుంది. 


బంగాళదుంపలను చికెన్​తో వద్దు..


ఆలులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని చికెన్​ లేదా మటన్​తో కలిపి తీసుకోకూడదట. అంటే ప్రోటీన్​ ఎక్కువగా ఉండే ఫుడ్​తో కలిపి తినకూడదట. బంగాళదుంపలకు ఆల్కలీన్.. ప్రోటీన్లకు ఆమ్లాలు ఉండాలి. కాబట్టి వీటిని కలిపి తింటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతారు. ఇది మొత్తం జీవక్రియను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్​ను కలిపి తినేవారు ఓసారి ఆలోచించుకోవాలి అంటున్నారు. 



ఈ ఫుడ్ కాంబినేషన్సే కాకుండా చేపలు, పెరుగు కలిపి తినొద్దని చెప్తున్నారు. తెలియకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్​లు పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముంది కాబట్టి.. మీరు ఈ ఫుడ్స్ తినేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఏ ఫుడ్స్ అలెర్జీనిస్తాయో వాటికి దూరంగా ఉండాలి అంటున్నారు. డైటీషియన్​తో మీరు మీ ఫుడ్ చార్ట్​ని ప్రిపేర్ చేయించుకుని హెల్తీగా తినొచ్చు. 


Also Read : మహిళల్లో పొట్ట పెరగడానికి కారణాలివే.. ఫ్లాట్ బెల్లీ కోసం ఈ డ్రింక్స్ తాగేయండి