అందరికీ మల్టీ విటమిన్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక్క మల్టీ విటమిన్ తీసుకుంటే మీకుండే జీర్ణక్రియ, హార్మోన్ల అసమతుల్యత, ఇతర వైద్యపరమైన సమస్యలు ఉంటే అన్నీ తొలగిపోవు. సప్లిమెంట్లు తప్పనిసరిగా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం వంటి ఇతర చర్యలతో కలిపి తీసుకోవాలి. ఏదైనా సప్లిమెంట్లు తీసుకునే ముందు వాటి అవసరం నిజంగా మీకు ఉందో లేదో వైద్యులు పరీక్షించి నిర్థారించిన తర్వాత ఉపయోగించాలి. ఒకవేళ మల్టీ విటమిన్లు తీసుకోవాల్సిన అవసరమే వస్తే తప్పనిసరిగా రక్తపరీక్షలు చేస్తారని న్యూట్రీషనిస్ట్ చెప్పుకొచ్చారు. డైట్లో సప్లిమెంట్లు అవసరమని తెలిస్తే వాటిని ఖాళీ కడుపుతో మాత్రం తీసుకోకూడదనే విషయం తప్పనిసరిగా తీసుకోవాలి. అలా చేయడం వల్ల పేగు మార్గాన్ని ఇబ్బంది పెట్టినట్టే.


ఖాళీ కడుపుతో ఎందుకు తీసుకోకూడదు?


విటమిన్లు రెండు రకాలు. ఒకటి కొవ్వులో కరిగేవి, నీటిలో కరిగేవి. విటమిన్లు బి, సి వంటివి నీటిలో కరిగేవి. ఇవి ఖాళీ కడుపుతో తీసుకోవడం సురక్షితమే. ఎక్కువ మోతాదు తీసుకుంటే మాత్రం కొంతమంది వ్యక్తుల్లో జీర్ణ సమస్యలు వస్తాయి. ఇక కొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఇ, కె వంటివి కొన్ని ఆహారపు కొవ్వుతో తీసుకున్నప్పుడు బాగా గ్రహించబడతాయి. వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే భోజనంతో కలిపి తీసుకోమని సలహా ఇస్తారు. లేదంటే కడుపు నొప్పి, వీరేచనాలకు దారి తీస్తుంది. ఐరన్ ఖాళీ కడుపుతో తీసుకుంటే బాగా శోషించబడినప్పటికీ ఇతర సమస్యలు తలెత్తుతాయి. అలా తీసుకుంటే వికారం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి జీర్ణాశయాంతర దుష్ప్రభావాలు ఏర్పడతాయి. ఇక కాల్షియం సప్లిమెంట్లని ఐరన్ సప్లిమెంట్ల నుంచి వేరుగా తీసుకోవాలి. ఎందుకంటే అవి ఒకదానికొకటి శోషణకు ఆటంకం కలిగిస్తాయి.


మల్టీ విటమిన్ల సరైన మోతాదు ఎంత?


వయస్సు, లింగం, ఆరోగ్య పరిస్థితి, పోషకాల అవసరాలు వంటి అనేక అంశాలపై మల్టీ విటమిన్లు తీసుకోవడం ఆధారపడి ఉంటుంది. వాటిని తీసుకునే ముందు తప్పనిసరిగా ఆరోగ్య సంరక్షణ నిపుణుల్ని సంప్రదించాలి. ముఖ్యంగా ఇతర అనారోగ్య సమస్యల నివారణ కోసం మందులు ఉపయోగిస్తున్న వాళ్ళు మల్టీ విటమిన్లు తీసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే దుష్ప్రభావాలు వస్తాయి. శరీరంలో ఒక నిర్ధిష్ట విటమిన్ అధికంగా ఉంటే అది అవయవాలకు చాలా హానికరం. నీటిలో కరిగే వాటిని మూత్రం ద్వారా బయటకి పంపవచ్చు. కానీ కొవ్వులో కరిగేవి శరీరం నుంచి బయటకి వచ్చే మార్గం ఉండదు. అందుకే ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేని వారైతే భోజనం తర్వాత ఒక్క మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: వానాకాలంలో డైట్ ఫాలో అయితే రోగాల భయమే ఉండదు


Join Us on Telegram:https://t.me/abpdesamofficial