ఎర్రగా బీట్ రూట్ ని పోలి ఉండే కూరగాయ టర్నిప్. ఇది శీతాకాలపు కూరగాయ అనే విషయం చాలా మందికి తెలియదు. రుచికి బంగాళాదుంప, కనిపించడంలో ముల్లంగి, బీట్ రూట్ లా కనిపిస్తుంది. భారతదేశంలో దీన్ని 'షల్గం' అని కూడా పిలుస్తారు. తెలుపు, ఊదారంగుల్లో ఇది లభిస్తుంది. నిజానికి టర్నిప్ కూరగాయ చాలా పురాతనమైనది. ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. క్రూసిఫెరస్ కుటుంబానికి చెందిన ఈ కూరగాయ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.


పేగు సమస్యలు తగ్గిస్తుంది


ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పెద్ద పేగులో ఒత్తడి, వాపుని తగ్గిస్తుంది. అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల పేగులకు మంచి చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకి ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తుంది. మలబద్ధకం సమస్యని నివారిస్తుంది.


అదుపులో రక్తపోటు


బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఫార్మకాలజీ 2013 లో చేసిన అధ్యయనం ప్రకారం టర్నిప్ లో రక్తనాళాలని ఆరోగ్యంగా ఉంచే డైటరీ నైట్రేట్ లు పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం నుంచి సోడియం విడుదల చేస్తుంది. దాని వల్ల రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. ధమనులు వ్యాకోచించేలా చేస్తుంది.


యాంటీ డయాబెటిక్ లక్షణాలు


నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం టర్నిప్ లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలని నియంత్రిస్తుంది. మధుమేహ రొగులు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.


క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది


కొన్ని అధ్యయనాల ప్రకారం టర్నిప్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో క్యాన్సర్ కి వ్యతిరేకంగా పని చేసే సమ్మేళనాలు ఉంటాయి. యాంటీ క్యాన్సర్ ప్రభావం కలిగిన ఈ కూరగాయ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 23 శాతం తక్కువగా ఉన్నట్టు పలు అధ్యయనాలు వెల్లడించాయి.


బరువు తగ్గడంలో సహాయపడుతుంది


అధిక మొత్తంలో ఫైబర్, తక్కువ కేలరీలు కలిగి ఉండటం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. దీని వల్ల అతిగా తినడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ ఉండటం వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తుంది.


రోగనిరోధక శక్తి ఇస్తుంది


విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. ఇందులోని గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారిస్తుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులని అడ్డుకుంటుంది.


టర్నిప్ ఇలా తినొచ్చు


⦿ముక్కలుగా కోసి బంగాళాదుంప మాదిరిగా ఉడికించుకుని కూర చేసుకుని తినొచ్చు


⦿టర్నిప్ ను సలాడ్ లేదా సూప్ కి ఉపయోగించుకోవచ్చు


⦿చిరుతిండిగా కూడ తినొచ్చు. టర్నిప్ ముక్కలు కాల్చి ఉప్పు, మిరియాల పొడి నిమ్మరసం జోడించుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ గా మంచి ఎంపిక.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.