2024 Elections India:


ముస్లింలకు దగ్గరవ్వాలి: ప్రధాని 


2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది బీజేపీ. స్వయంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా రంగంలోకి దిగి రాష్ట్రాల వారీగా పార్టీ బలాన్ని సమీక్షించుకుంటున్నారు. తరచూ సమావేశమవుతున్నారు. కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు పిలుపు నిస్తున్నారు. అయితే...బీజేపీ అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్రను చెరిపేసుకోడానికి అధిష్ఠానం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మైనార్టీల వ్యతిరేక పార్టీ అనే అపవాదు తొలగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే...ముస్లింలతో సహా అన్ని మైనార్టీలకు దగ్గరయ్యే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు కార్యకర్తలకు కీలక ఆదేశాలిచ్చారు. అందరూ మైనార్టీలతో సంప్రదింపులు జరిపి వాళ్ల కష్టనష్టాలేంటో తెలుసుకోవాలని చెప్పారు. బీజేపీకి ఓటు వేస్తారా లేదా అన్నది పక్కన పెట్టి ఈ పని చేయాలని సూచించారు. ఇటీవలే ఢిల్లీలో జాతీయ స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోడీ బీజేపీ ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉందో...ఆ ప్రాంతాలపై దృష్టి సారించాలని నేతలకు సూచించారు. "పస్మండ ముస్లింలు, బోహ్రా తెగకు చెందిన వాళ్లతో పాటు కీలక ముస్లిం నేతలతో చర్చించాలని ప్రధాని మాకు చెప్పారు" అని ఓ కార్యకర్త వెల్లడించారు. యూనివర్సిటీలు, చర్చ్‌లకు వెళ్లాలని ప్రధాని సూచించినట్టు తెలుస్తోంది.


ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్‌లో భాగంగా అన్ని రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, సంస్కృతి, భాషలకు గౌరవం ఇవ్వాలని అన్నారు. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని చెప్పినట్టు కార్యకర్తలు వెల్లడించారు. దేశంలో పార్టీని మరింత విస్తృతం చేసి అన్ని విషయాల్లోనూ లీడర్‌గా నిలవాలని ప్రధాని ఆకాంక్షించారు. సినిమాలపై అనవసరపు వివాదాలు చేయొద్దనీ సూచించినట్టు సమాచారం. పఠాన్‌ మూవీలోని ఓ పాటపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో..మోడీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 


ఎన్నికలకు రెడీ..


ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉంది. ఇటు బీజేపీ కూడా తమ విజయ పరంపరను కొనసాగించేందుకు గట్టిగానే కృషి చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి పార్టీలో మరింత జోష్ పెంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఎడమొఖం పెడమొఖంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా మళ్లీ కలుస్తున్నాయి. ఎలాగైనా బీజేపీని ఢీకొట్టి తమ బలం నిరూపించుకోవాలని చూస్తున్నాయి. ప్రధానిరేసులో ఉన్నారన్న నితీష్ కుమార్ కూడా మిషన్ 2024కి రెడీ అవుతున్నారు. పలుమార్లు ఢిల్లీలో పర్యటించారు. జాతీయస్థాయి నేతల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ TRSని BRSగా మార్చేశారు. ప్రాంతీయపార్టీగా పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని ఆయన సిద్ధమయ్యారు.  యాక్షన్ ప్లాన్‌ కూడా అమలు చేస్తున్నారు. 


Also Read: JP Nadda News:బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు