జేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. ఈ నిర్ణయానికి బీజేపీ కార్యవర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.
జాతీయ కార్యవర్గంలో జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రతిపాదనను రాజ్ నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. దీనికి జాతీయ కార్యవర్గం సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని 2024 జూన్ వరకు పొడిగిస్తూ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. 2019 జూన్‌లో జేపీ నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టారు.
సంస్థ అంతా కలిసి పనిచేశారు.
దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి ప్రజాదరణ పెరగడంలో జేపీ నడ్డా కూడా దోహదపడ్డారని హోం మంత్రి అమిత్ షా అన్నారు. జేపీ నడ్డా నాయకత్వంలో సంస్థ మొత్తం కలిసి పనిచేసింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రజలకు సేవ చేయడంలో జెపి నడ్డా నాయకత్వాన్ని అమిత్ షా ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో పార్టీ అనేక రాష్ట్రాల ఎన్నికలలో విజయం సాధించిందని గుర్తు చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మహమ్మారి కోవిడ్‌ను యావత్ ప్రపంచం ఎదుర్కోవాల్సి వచ్చిందని అమిత్‌షా అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో,పెద్ద సంఖ్యలో గ్రామాలకు ఆహారాన్ని పంపిణీ చేయడం, రోగులను ఆసుపత్రులకు తరలించడం వంటి విషయాల్లో బిజెపి చీఫ్ తన బాధ్యతను చాలా అద్భతంగా నెరవేర్చారన్నారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో మరింత ఘన విజయం సాధిస్తామని ధీమా
ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా నాయకత్వంలో 2019 కంటే 2024 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అమిత్‌షా. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. రెండో రోజైన మంగళవారం జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
2024లో లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించారు. నడ్డా రెండోసారి పార్టీ పగ్గాలు చేపట్టనున్న మూడో అధ్యక్షుడు కానున్నారు. గతంలో రాజ్ నాథ్ సింగ్, ఎల్ కే అద్వానీ రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నడ్డా చేరారు.
మోదీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన జేపీ నడ్డాకు కూడా బీజేపీతో చాలా అనుబంధం ఉంది. నడ్డా అధ్యక్షుడయ్యే ముందు జమ్ముకశ్మీర్, యూపీ ఇన్చార్జి, జనరల్ సెక్రటరీగా పని చేశారు. నడ్డాను 2010లో నితిన్ గడ్కరీ పార్టీ కార్యదర్శిగా నియమించడంతో జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు.
జేపీ నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరాజయాన్ని చవిచూసింది. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి తర్వాత జేపీ నడ్డాను అధ్యక్షుడిగా సాగనంపుతారంటూ వార్తలు వచ్చాయి. 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా నియమితులయ్యారు. ఆ తర్వాత దాదాపు 14 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, 2 రాష్ట్రాల్లో పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది.
నడ్డా నాయకత్వంలో బీజేపీ బీహార్, యూపీలో మంచి పనితీరు కనబరిచింది. బిహార్లో బీజేపీ 74 సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించగా, యూపీలో బీజేపీ 250కి పైగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం 120 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
జాతీయ కార్యవర్గ సమావేశం తొలిరోజు జేపీ నడ్డా మాట్లాడుతూ రాబోయే 9 ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జీలను కోరారు. 2023లో ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. అంటే ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన సవాలు కూడా బీజేపీ ముందుంది. అదే సమయంలో నాలుగు రాష్ట్రాలైన తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్ గఢ్ లో గెలవడం కూడా సవాలుతో కూడుకున్నది.