నేడు యాదగిరి గుట్టకు నలుగురు సీఎంలు
బీఆర్‌ఎస్‌ ఆవిర్భావసభ నేడు ఖమ్మంలో జరగనుంది. సభకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌తోపాటు కేరళ ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు, విజయన్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ హాజరుకానున్నారు. ఖమ్మం పర్యటన కంటే ముందు పంజాబ్ సీఎం లతో పాటు కెసిఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. 11.30 గంటలకు గుట్టలో టెంపుల్‌ సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డితోపాటు అధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం వెంట గుట్టపైకి చేరుకుంటారు. కొండపైకి నలుగురు సీఎంలతోపాటు, మాజీ సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగ తం పలుకుతారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారికి అర్చకులు వేదమత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం చేయనున్నారు. ఆ తర్వాత వారికి తీర్థప్రసాదాలు అందించనున్నారు. ఈ సందర్భంగా గుట్ట పునర్నిర్మాణంపై కేసీఆర్‌ వివరించనున్నారు. అనంతరం 12.30 గంటలకు తిరిగి హెలీకాప్టర్లలో ఖమ్మం బయల్దేరి వెళ్లనున్నారు.


నేటి నుంచి కంటి వెలుగు, ఖమ్మంలో ప్రారంభించనున్న కేసీఆర్‌
అంధత్వ రహిత తెలంగాణకోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత నేడు ఖమ్మం వేదికగా ప్రారంభం కానున్నది. ఖమ్మం కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా ఢిల్లీ, పంజాబ్‌, కేరళ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, పినరై  విజయ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా హాజరుకానున్నారు. ఇందుకోసం ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంటి వెలుగు క్యాంపును ఏర్పాటు చేశారు.తొలిరోజు మొత్తం 50 మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. ఇందులో తొలి ఆరుగురికి కంటి పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్‌, ఐదుగురు ముఖ్య అతిథులతో కలిసి కంటి అద్దాలు అందజేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు కొనసాగుతాయి. నేటి నుంచి నిర్దేశిత గ్రామాలు, పట్టణాల్లో క్యాంపులు ప్రారంభం అవుతాయి. అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు, మందులు అందజేస్తారు.


వన్డే క్రికెట్ మ్యాచ్ దృష్ట్యా పోలీసుల ట్రాఫిక్‌ ఆంక్షలు
నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు.నేడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.
సోమాజిగూడ నుంచి రాజీవ్ గాంధీ స్టేడియం వరకు సాగే రహదారిలో ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్‌బీహెచ్‌ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఉప్పల్ ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు పైన పేర్కొన్న మార్గంలో ప్రయాణించకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.


బడ్జెట్‌ సమావేశాలు షురూ, నేటి నుంచి ప్రి-బడ్జెట్‌.. త్వరలో సీఎం కేసీఆర్‌ సమావేశం
బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదించి ఆర్ధిక యేడాది బడ్జెట్‌ కూర్పు వేగవంతం చేసేలా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 13 వరకు అన్ని శాఖలనుంచి ప్రతిపాదనలు స్వీకరించిన ఆర్ధిక శాఖ ఇక శాఖల వారీగా ప్రి బడ్జెట్‌ సమావేశాలకు షెడ్యూల్‌ వెల్లడించింది. నేటి నుంచి వరుసగా శాఖల వారీగా బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. నేటి ఉదయం 11 గంటలనుంచి 11.30 వరకు పంచాయతీరాజ్‌, 11.30గంటలనుంచి 12 వరకు మున్సిపల్‌ శాఖ., 12.నుంచి 12.30 వరకు పశుసంవర్ధక శాఖ, 12.30నుంచి ఒంటిగంట వరకు రవాణ, ఆర్‌ అండ్‌ బీ, ఒంటిగంట నుంచి 1.30గంటల వరకు రెవెన్యూ, దేవాదాయ శాఖలు ఇలా సాయంత్రం 5.30గంటలనుంచి 6 గంటల వరకు ఫైనాన్స్‌ ప్లానింగ్‌ శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమావేశాలు జరగనున్నాయి.


నేడు బడులు పునఃప్రారంభం
సంక్రాంతి సెలవులు ముగియడం రాష్ట్రంలోని బడులు నేటి నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయి. ఈ నెల నుంచి 17 వరకు బడులకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు సెలవు ఎంజాయ్ చేసిన పిల్లలంతా ఉదయం నుంచి బడిబాట పడతారు. ఈ నెల 16న జు యర్ కాలేజీలు తెరుచుకొన్నాయి.