ప్రొబయోటిక్స్ తో నిండి ఉండే పెరుగు భారతీయుల ఆహారంలో ఒక భాగంగా ఉంటుంది. ఎంతో రుచికరమైన దీన్ని తినేందుకు ఇష్టంగా ఉంటారు. కానీ కొన్ని సంప్రాదాయ విశ్వాసాల ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల పిత్త, కఫా, వాత దోషాలని ఒకేసారి ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి ఈ సీజన్ లో వాత, పిత్త దోషాలు తీవ్రతరం అవుతాయి. ఇది శరీరాన్ని హాని చేస్తుంది. అనేక కాలానుగుణ వ్యాధులకు దారి తీస్తుంది. మాన్ సూన్ సీజన్ లో పెరుగు తింటే వచ్చే సమస్యలు ఇవే..
జీర్ణ సమస్యలు
ఆయుర్వేదం ప్రకారం పెరుగు చల్లటి శక్తిని కలిగి ఉంటుంది. ఇది జీర్ణాశయ మంటని బలహీన పరుస్తుంది. ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. పెరుగులో చిటికెడు ఎండు మిర్చి, వేయించిన జీలకర్ర లేదా తేనె కలపడం వల్ల ఇది శరీరానికి హాని చేయకుండా ఉంటుంది. పెరుగులో ఏమి కలపకుండా తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది.
శ్వాసకోశ సమస్యలు
వర్షాకాలంలో రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో శ్లేష్మం అభివృద్ధి చెందుతుంది. ఇది జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది. వాతావరణంలో తేమ కారణంగా అలర్జీ ప్రమాదాన్ని పెంచుతుంది.
రోగనిరోధక శక్తి ప్రభావితం
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు వంటి చల్లని శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చల్లని ఆహారాలు అధికంగా తీసుకుంటే శ్లేష్మం ఏర్పడుతుంది. పేగు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. శరీరాన్ని కాలానుగుణ రుగ్మతలు, అలర్జీలకు గురి చేస్తుంది.
ఎప్పుడు తినాలి?
పెరుగుతో భోజనం ముగించనది కొంతమందికి అన్నం తిన్న తృప్తి ఉండదు. వర్షాకాలంలో పెరుగు తినాలనుకుంటే ఈ పద్ధతి పాటించారంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. చిటికెడు వేయించిన్ జీలకర్ర పొడి, నల్ల మిరియాలు, నల్ల ఉప్పు లేదా తేనె జోడించుకుని తింటే మంచిది. ఇది శక్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మెరుగైన జీర్ణక్రియ, గట్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు పెరుగు చక్కగా పని చేస్తుంది.
బరువు తగ్గించుకునేందుకు పెరుగు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియాని ప్రేరేపిస్తుంది. ఇందులోని ఈస్ట్ లు జీర్ణక్రియని పెంచుతాయి. తరచూ దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి స్థాయిలు పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మలబద్ధకం, గుండెల్లో మంట, అనేక జీర్ణ సమస్యల్ని నయం చేయడంలో పెరుగు సహాయకారిగా ఉంటుంది. అయితే అతిగా తింటే మాత్రం అనార్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగు తలలో నొప్పి, మైగ్రేన్ ని ప్రేరేపించే ఆహారం. బయోజెనిక్ అమైన్ వల్ల ఇలా జరుగుతుంది. ఈ అమైన్ లు నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి రక్తప్రసరణ తగ్గిస్తాయి లేదంటే పెంచుతాయి. దీని వల్ల తలనొప్పి వస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: నిద్రలేవగానే తలనొప్పిగా అనిపిస్తుందా? అందుకు కారణాలు ఇవి కావచ్చు
Join Us on Telegram:https://t.me/abpdesamofficial