యోగాలోని ఒక్కొక్క ఆసనానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. వృక్షాసనం నిద్రలేమిని దూరం చేసి కాళ్ళ కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది. ఇక పశ్చిమ నమస్కారాసనం ఛాతీ, చేతులు, పొత్తి కడుపు చురుకుగా ఉండేలా చేస్తుంది. ఈ ఆసనాన్ని రివర్స్ ప్రేయర్ పోజ్ అని కూడా పిలుస్తారు. నమస్కారం భారతీయుల సంస్కారం. ఇది రివర్స్ లో చేయడమే ఈ ఆసనం. రెండు చేతులు వీపు వెనుకకు పెట్టి నమస్కారం చేయడాన్ని పశ్చిమ నమస్కార ఆసనం అంటారు. ఈ ఆసనం భుజాలు, మణికట్టు, వెన్నెముక మీద చక్కని ప్రభావం చూపిస్తుంది. నేలపై కూర్చుని కాళ్ళు ముందు చాచి ఈ ఆసనం వేస్తారు. అరచేతులు రెండూ కలిపి నమస్కారం చేయలేకపోతే వేళ్ళని అయినా కలపాలి. ఇది చేస్తున్నప్పుడు గట్టిగా శ్వాస తీసుకోవాలి.
ఎన్నో ప్రయోజనాలు అందించే ఈ ఆసనం చేయడం కాస్త కష్టమైన పనే. కానీ తరచూ వేస్తూ ఉంటే సాధించగలుగుతారు. 30 సెకన్ల నుంచి ఒక నిమిషం పాటు ఈ భంగిమలో ఉండాలి. భుజాలు రిలాక్స్ గా ఉంచి వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
పశ్చిమ నమస్కారసనం అనేక రకాల శారీరక, మానసిక ప్రయోజనాలు అందిస్తుంది. ఇది వెన్నుముకని సాగదీసి బలంగా మారుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రశాంతతని ఇస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుస్తుంది. ఉదర అవయవాలు సున్నితంగా మసాజ్ చేసినట్టుగా అవుతాయి. జీర్ణక్రియకి కూడా సహాయపడుతుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. మణికట్టు సమస్యలు పరిష్కరించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడిని జయించేందుకు సహాయపడుతుంది. ఉదర అవయవాలని ఉత్తేజపరుస్తుంది. ప్రకోప పేగు సిండ్రోమ్ వంటి దీర్ఘకాలిక జీర్ణ రుగ్మతలు నయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
ఈ తప్పులు చేయొద్దు
పశ్చిమ నమస్కార ఆసనం చాలా ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ దీన్ని చేసేటప్పుడు కొన్ని తప్పులు నివారించాల్సి ఉంటుంది. చేతులు వీపు వెనకకు నమస్కారం చేసేందుకు రాకపోతే బలవంతంగా వాటిని తీసుకు వచ్చేందుకు ప్రయత్నించకూడదు. అలా చేస్తే చేతులు పట్టుకుపోతాయి. వీపుపై ఒత్తిడిని నివారించేందుకు వెన్నెముకని వీలైనంత వరకు నిటారుగా ఉంచాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు లోతైన శ్వాస తీసుకోవాలి. ఊపిరి బిగపట్టడం వంటివి చేస్తే మాత్రం అసౌకర్యం పెరిగిపోతుంది.
ఎవరు ఈ ఆసనం వేయకూడదు
పశ్చిమ నమస్కార ఆసనం మంచిది. కానీ ఈ ఆసనం కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు వేయకపోవడమే మంచిది. భుజాల నొప్పులు, బిగుతుగా ఉండే భుజాలు, కండరాల నొప్పులు ఉన్న వ్యక్తులు ఈ భంగిమ ప్రయత్నించే ముందు కొన్ని సున్నితమైన స్ట్రెచ్ చేయడం మంచిది. ఈ ఆసనం నెమ్మదిగా ప్రారంభించాలి. తప్పనిసరిగా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. దీనిపై ఎటువంటి అవగాహన లేని కొత్త వ్యక్తులు ఈ ఆసనం వేసే ముందు అన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. దీని గురించి అవగాహన లేకపోతే ఛాతీ, మణికట్టు, భుజాలు, మోచేతులకి హాని కలగవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ ఆసనం వేయకుండా ఉంటేనే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: భుజం నొప్పి ఎక్కువగా ఉంటుందా? ఒత్తిడి తగ్గించుకుంటే నొప్పి తగ్గుతుంది