Chandrababu custody Completed : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ విచారణ రెండో రోజు ముగిసింది. తొలి రోజు చంద్రబాబును దాదాపు 50 ప్రశ్నలు అడగగా, రెండో రోజు సైతం అదే స్థాయిలో సీఐడీ అధికారులు టీడీపీ అధినేతపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు నేటితో చంద్రబాబుకు సీఐడీ కస్టడీ ముగియనుంది. దాంతో చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచి వర్చువల్ గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచింది సీఐడీ. చంద్రబాబు కస్టడీ, రిమాండ్ పొడిగించాలని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరారు. సీఐడీ కస్టడీ ముగిసినందున చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సీఐడీ కస్టడీ పొడిగించాలని కోర్టును సీఐడీ అధికారులు కోరగా.. పిటిషన్ దాఖలు చేస్తే పరిశీలిస్తామని కోర్టు చెప్పింది.
మొత్తం 30 అంశాలపై 120 వరకు ప్రశ్నలు సంధించి చంద్రబాబు నుంచి సీఐడీ కొన్ని వివరాలు రాబట్టారు. డాక్యుమెంట్స్ చూపించి నిధులు ఎలా కేటాయించారని సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారులు ప్రశ్నించారు. షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపుపై సీఐడీ తమ అనుమానాలను విచారణలో ప్రస్తావించింది. మొత్తంగా రెండు రోజుల్లో 12 గంటలపాటు చంద్రబాబును సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ పై ప్రశ్నించారు.
స్కిల్ ప్రాజెక్టు విలువ, ఒప్పందాలపై చంద్రబాబుకు కీలక వ్యాఖ్యలు
సీఐడీ కస్టడీలో భాగంగా అధికారులు చంద్రబాబును.. ప్రాజెక్టు విలువను ఎలా నిర్ణయించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు. జీవోకి విరుద్ధంగా ఒప్పందం ఎలా చేశారు. 13 చోట్ల నోట్ ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు లాంటి పలు అంశాలపై ప్రశ్నించారు. కోర్టు తీర్పు ప్రకారం చంద్రబాబు చెప్పిన సమాధానాలు వీడియో, ఆడియో రికార్డు చేసి ధర్మాసనానికి సమర్పించనున్నారు. 5 రోజుల కస్టడీ కోరగా.. కోర్టు కేవలం రెండు రోజుల సీఐడీ (శని, ఆదివారం ) కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఐడీ కస్టడీ ముగిసింది. రిమాండ్ విషయంపై ఏసీబీ న్యాయమూర్తి మరికాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు.
సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు లాయర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తెలిపింది. సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగమని హైకోర్టు పేర్కొంది. ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో చంద్రబాబు తరపు లాయర్లు పేర్కొన్నారు.