Balakrishna in TDP Political Action Committee:


తెలుగు దేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిమాయకమైంది. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ సహా మొత్తం 14 మందితో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ పక్ష ఉపనేత, కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించామని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. జుడీషియల్ కస్టడి ముగియడం, అనంతరం సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు రోజులపాటు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో చంద్రబాబును విచారిస్తున్నారు. శనివారం తొలి రోజు విచారణలో భాగంగా 50 ప్రశ్నలు చంద్రబాబును అడిగినట్లు సమాచారం. మొత్తం 120 ప్రశ్నలతో అధికారులు విచారణకు వచ్చారని.. తొలి రోజు కీలక ప్రశ్నలు అడిగారు. నేడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. 


చంద్రబాబు జైల్లో ఉండటంతో పార్టీ నేతలతో కలిసి టీడీపీని నందమూరి బాలకృష్ణ ముందుకు నడిపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలోనూ చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ సభ్యులతో కలిసి బాలకృష్ణ నిరసన తెలిపారు. రెండోరోజు సమావేశాలలో అయితే విజిల్ తీసుకొచ్చి పదే పదే ఊదుతూ నిరసన తెలిపారు బాలయ్య. స్పీకర్ సైతం బాలయ్యను మందలించడం తెలిసిందే. మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ నుంచి వస్తే లోకేష్ ను ఏ క్షణంలోనైనా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం సైతం జరుగుతోంది.  


పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులు:
1. యనమల రామకృష్ణుడు
2. కింజరాపు అచ్చెన్నాయుడు
3. చింతకాయల అయ్యన్నపాత్రుడు
4. ఎం.ఏ.షరీఫ్
5. పయ్యావుల కేశవ్
6. నందమూరి బాలకృష్ణ
7. నిమ్మల రామానాయుడు
8. నక్కా ఆనందబాబు
9. కాలువ శ్రీనివాసులు
10. కొల్లు రవీంద్ర
11. బీసీ జనార్ధనరెడ్డి
12. వంగలపూడి అనిత
13. బీద రవిచంద్రయాదవ్
14. నారా లోకేష్


ఏపీ సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై రెండో రోజు విచారణ చేస్తున్నారు. నేడు దాదాపు 70 ప్రశ్నలను చంద్రబాబుకు సంధించేందుకు ఏపీ సీఐడీ ప్రయత్నిస్తోంది. తొలుత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి, రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాలులో రెండోరోజు విచారణ చేపట్టారు. నేటి సాయంత్రం 5 గంటలకు ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఇచ్చిన రెండు రోజుల కస్టడీ ముగియనుంది. రిమాండ్ పొడిగింపు ముగియనుండడంతో ఆదివారం సాయంత్రం సీఐడీ అధికారులు చంద్రబాబును ఏసీబీ కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరు పర్చనున్నారు. 


సీఐడీ అధికారులు నిన్న (సెప్టెంబరు 23) రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు?, సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు?, అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది?, 13 చోట్ల నోట్ ఫైళ్లపై సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు, జీవోకి విరుద్ధంగా ఒప్పందం ఎలా చేశారని ప్రశ్నించారు.