Chandrababu Arrest: టీడపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తదనంతర పరిణానాలపై నారా లోకేష్ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈక్రమంలోనే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలు, పార్టీల నేతలకు నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని టీడీపీ నేతలు అభిప్రాయ పడ్డారు. ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని ఖండించారు. అలాగే ఈ టెలీకాన్ఫరెన్స్ లో లోకేష్ యువగళం పున: ప్రారంభంపై కూడా చర్చించారు. వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. 


ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడి నుంచే ప్రారంభం


చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అలాగే నారా లోకేష్ చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు న్యాయ వాదులతో చర్చిస్తున్నారు. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూనే.. ఇటు యువగళంతో మళ్లీ రోడ్డెక్కాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింత గా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని టెలీకాన్ఫరెన్సులో నేతలంతా నిర్ణయించుకున్నారు.


వైసీపీ సర్కారుపై యనమల ఫైర్..


రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో హాహాకారాలు చేస్తుంటే.. ఆధారాలు లేని స్కాముల పేరుతో చంద్రబాబును అరెస్టు చేయించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అన్నిరంగాలు నేలమట్టం అయ్యాయని. వ్యవసాయ సంక్షోభంలో పడిందని, రైతు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, పన్నులు భారం, యువతను చుట్టుముట్టిన నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, బీసి,ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటి సబ్ కాంపోనెంట్ నిధుల మళ్లింపు, విద్యుత్తు చార్జీల పెంపు, తీవ్ర ఆర్ధిక సంక్షోభం వంటి అంశాలన్నింటిపై సమగ్ర చర్చ జరగాల్సి ఉందన్నారు. 


ప్రభుత్వం ఈ సమస్యలన్నింటిని వదిలేసి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి అసెంబ్లీలో సంబరాలు చేసుకుంటోందని విమర్శించారు. ఏనాడూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరిగిన ధాఖలాలు లేవు. సభలో సమస్యలు  వదిలేసి స్కోత్కర్శకాలు వినిపిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొన్నట్లే అసెంబ్లీలో కూడా  తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆధారాలు లేని స్కిల్ డెవలప్ మెంట్  కేసులో తన వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా అరెస్ట్ చేసి కోర్టుల ముందు అబద్దాలు పెట్టి నిర్భందాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ పోకడ ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాష్ట్ర భవిష్యత్ కు ప్రమాదంగా మారుతుందన్నారు.


Read Also: TDP on Jagan: ర్యాలీకి భయపడుతూ తాడేపల్లి పిల్లి ప్యాలెస్‌లో పడుకుంది - సీఎంపై టీడీపీ సెటైర్లు