హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ సంఘీభావంగా రాజమండ్రికి భారీగా కార్లలో ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని అడ్డుకునేందుకు ర్యాలీపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఏపీ సరిహద్దు గరికపాడు వద్ద శనివారం (సెప్టెంబర్ 23) రాత్రి నుంచే భారీగా పోలీసులను ఏపీ ప్రభుత్వం మోహరించింది. దీనిపై టీడీపీ స్పందించింది. ఇది ఇండియా - పాకిస్థాన్ మధ్య సరిహద్దు కాదని, అంత భద్రత అవసరం లేదని సెటైర్లు వేసింది. పిల్లి తాడేపల్లి ప్యాలెస్ లో భయపడుతూ పడుకుందని ఎద్దేవా చేసింది. 


‘‘ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు. చంద్రబాబు గారికి మద్దతుగా, ఛలో రాజమహేంద్రవరం అంటున్న ఐటీ ఉద్యోగులకి ఏపిలోకి అడుగు పెట్టే అర్హత లేదంట. వందలాది మంది పోలీసులని దింపి, ప్యాలెస్ లో భయపడుతూ పడుకున్నాడు తాడేపల్లి పిల్లి’’ అంటూ గరికపాడు వద్ద భారీగా ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు వీడియోను టీడీపీ ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది. అలాగే చంద్రబాబుకి సంఘీభావంగా రాజమండ్రికి కార్ల ర్యాలీ చేస్తున్న వీడియోలను, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగుల ర్యాలీ వీడియోలను కూడా పోస్ట్ చేసింది.



ఏపీ ఇండియాలో లేదా?


హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి వెళ్తున్న ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడాన్ని టీడీపీ ప్రొఫెషనల్‌ వింగ్‌ విభాగం అధ్యక్షురాలు తేజస్విని ఖండించారు. తాము దేశంలో స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నామని, కానీ ఆంధ్రాకి రాలేకపోతున్నామని అన్నారు. ఏపీ భారతదేశంలో భాగం కాదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సాధారణ వాహనదారుల అసహనం


గరికపాడు చెక్‌ పోస్టు వద్ద పోలీసులు వాహనాలను ఆపి చెక్ చేస్తుండడం పట్ల సాధారణ వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్ల ర్యాలీ వల్ల చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండడం వల్ల రద్దీ ఏర్పడుతోంది. దీంతో తనిఖీల్లో భాగంగా అత్యవసర పనుల మీద వెళ్లేవారిని కూడా పోలీసులు ఆపుతున్నారు. తనిఖీల పేరిట టైం వేస్ట్ చేస్తున్నారని కొందరు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.