ఏవైనా కొత్త వైరస్ లు వచ్చాయంటే వాటికి సంబంధించిన కేసులు మొదటగా కేరళలోని బయట పడతాయి. తాజాగా కేరళలో మరొక వైరస్ కి సంబంధించి మరణాలు నమోదయ్యాయి. కోజికోడ్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణించినట్టు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అక్కడి వైద్యుల సమాచారం ప్రకారం నిఫా వైరస్ వల్లే వాళ్ళు మరణించినట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేరళలో 2018 లో మొదటి సరిగా నిఫా వైరస్ కి సంబంధించి తొలి కేసు నమోదైంది. మళ్ళీ 2021 లో ఈ వైరస్ కి సంబంధించిన కేసులు బయట పడ్డాయి. మరోసారి ఈ వైరస్ కేరళలో ప్రవేశించి భయాందోళనలు కలిగిస్తుంది.
నిఫా వైరస్ అంటే ఏంటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం నిఫా ఇన్ఫెక్షన్ జంతువుల నుంచి ప్రజలకి సంక్రమాయించే జునోటిక్ వ్యాధిగా పరిగణిస్తారు. కలుషితమైన ఆహారం లేదా నేరుగా వ్యక్తి నుంచి వ్యక్తికి ఇది వ్యాపిస్తుంది. మలేషియాలో మొదటి సారిగా నిఫా వ్యాప్తి చెందింది. జబ్బుపడిన పందులు లేదా వాటి కలుషితమైన కణజాలాలతో ప్రత్యక్ష సంబంధం కార్ణాంగాయి అంటువ్యాధులు సంభవించాయి. బంగ్లాదేశ్, భారత్ లో గబ్బిలాల మూత్రం లేదా లాలాజలంతో కలుషితమైన పండ్లు లేదా వాటి ఉత్పత్తుల నుంచి వ్యాధి వ్యాప్తి జరిగిందని WHO పేర్కొంది.
ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు
వ్యాధి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, వాంతులు, గొంతు నొప్పి ఉంటాయి. మైకం, మగత, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన ఎన్సెఫాలిటీస్ ను సూచించే నరాల సంకేతాలు కూడా కనిపించాయి. ఈ వైరస్ సోకిన 4 నుంచి 14 రోజుల్లో లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
చాలా మంది వ్యక్తులు దీని నుంచి పూర్తిగా కోలుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం ఎన్సెఫాలిటిస్ వస్తే నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సార్లు తగ్గినా మళ్ళీ వైరస్ సోకినట్టుగా వచ్చిన కేసులు నివేదించబడ్డాయి. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం వీటి మరణాల రేటు 40-75 శాతంగా ఉంది. తీవ్రమైన సందర్భాల్లో ప్రజలు న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు అనుభవిస్తారు. ఎన్సెఫాలిటిస్ వస్తే మాత్రం 24 గంటల నుంచి 48 గంటల్లో రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
ఎలా వ్యాపిస్తుంది?
గబ్బిలాలు, పందులు, వైరస్ వల్ల కలుషితమైన ఆహారం తీసుకుంటే మానవులకు ఇది వ్యాపిస్తుంది. నేరుగా మనిషి నుంచి మనిషికి కూడా సంక్రమిస్తుంది. భారత్ లో ఈ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపించింది. ఇప్పటి వరకు నిఫా వైరస్ కు ఎలాంటి మందులు అందుబాటులో లేవు. దీన్ని నివారించాలంటే భద్రతా చర్యలు అనుసరించాలి. వైరస్ సోకిన జంతువుల అవశేషాలు ముట్టుకోకుండా వాటిని తగులబెట్టాలి. వాటి మృతదేహాలు కాల్చడం చేయాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శుభ్రమైన పండ్లు తీసుకోవాలి. గబ్బిలాల కాటుకు గురయిన పండ్లు తీసుకోవడం తప్పనిసరిగా విస్మరించాలి. అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలము. జంతువులని తాకే ముందు చేతికి గ్లౌజులు ధరించడం తప్పనిసరి. వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండాలి. వ్యాధి వాప్తి అరికట్టేందుకు చేతులని క్రమం తప్పకుండా సబ్బు లేదా శానిటైజర్ తో వాష్ చేసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ బ్రేక్ ఫాస్ట్‌తో మీ రోజుని అసలు స్టార్ట్ చేయొద్దు