Diabetic Retinopathy: డయాబెటిస్.. శరీరంలోని అనేక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు డయాబెటిస్ కారణంగా అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు రక్తనాళాలు దెబ్బ తినడం వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు దెబ్బతింటే రక్తం చిక్కబడి పలు అవయవాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కంటి నాళాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే కంటి నరాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. డయాబెటిస్ అధికంగా ఉన్న వారికి రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ సూక్ష్మ రక్తనాళాలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపుపై ప్రభావం పడుతుంది. డయాబెటిస్ గుర్తించిన వెంటనే కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


ఇండియాలో డయాబెటిస్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్నాయి. దీనికి మారుతున్న జీవనశైలి కారణమని చెప్పవచ్చని వైద్యులు అంటున్నారు. సాధారణంగా టైప్ 2 డయాబెటిస్ 30 సంవత్సరాల తర్వాత నిర్ధారణ చేయబడుతుంది, జీవనశైలి మార్పులు, నోటి మందులు లేదా ఇన్సులిన్‌తో దీన్ని తగ్గించుకోవచ్చు. డయాబెటిక్ రెటినోపతి, ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌లో, భారతదేశంలో అంధత్వానికి ప్రధాన కారణం అవుతోందని వైద్యులు చెబుతున్నారు.


డయాబెటిస్ వల్ల ఏర్పడే ముఖ్యమైన సమస్యలలో ఒకటి డయాబెటిక్ రెటినోపతి (Diabetic Retinopathy - VTDR). ఇది డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో మూడింట ఒక వంతు మందిని ప్రభావితం చేస్తుంది. ఇండియాలో 3 నుంచి 4.5 మిలియన్ల మంది రోగులు VTDRతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌లో క్యాటరాక్ట్ సర్జరీ ఒక మార్గమని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి కేసులలో సమస్యలను నివారించడానికి క్యాటరాక్ట్ సర్జరీకి ముందు డయాబెటిస్‌ను నియంత్రించడం చాలా అవసరమని చెబుతున్నారు.


డయాబెటిక్ రెటినోపతి రోగులు మల్టీఫోకల్ ఇంట్రాకోక్యులర్ లెన్స్‌లు పెట్టుకోమని డాక్లర్లు సూచిస్తున్నారు. ఎందుకుంటే వారి కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత  సున్నితంగా మారుతుంది. కంటిశుక్లం శస్త్రచికిత్సకు ముందు, యాంటీ-విఇజిఎఫ్, స్టెరాయిడ్స్ లేదా లేజర్ వంటివి మీ చూపును మెరుగుపరుస్తాయి. ఫలితంగా దృష్టి నష్టాన్ని నిరోధించవచ్చు. సుదీర్ఘమైన ఇంటెన్సివ్ పోస్ట్-ఆపరేటివ్ కేర్ దీనికి అవసరం. డయాబెటిక్ రెటినోపతిని ఆలస్యంగా గుర్తిస్తే, శాశ్వత దృష్టి లోపం లేదా అంధత్వానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


ఇక డయాబెటిక్ రెటీనోపతి బారిన పడి మీరు చూపు కోల్పోకుండా జాగ్రత్తపడాలి అంటే ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.  అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆహారంలో కార్బోహైడ్రేట్ శాతం తగ్గించి ప్రోటీన్ శాతం కూడా సమపాళ్లల్లో తీసుకోవాల్సి ఉంటుంది.  అప్పుడే డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.  డయాబెటిస్ ను కంట్రోల్ చేసే ఔషధాలను సైతం తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read : ఉప్పుతో ఆరోగ్యానికి ముప్పే, కానీ ఈ జబ్బును తగ్గిస్తోందట!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.