అబ్బా, రోజూ బ్రష్ చెయ్యాలా ఏంటీ? ఒక్క రోజు పళ్లు తోముకోపోతే ఏముందిలే.. అని బద్దకిస్తున్నారా? అలా అస్సలు చేయొద్దు. మీరు ఎంత బిజీగా ఉన్నా.. లేజీగా ఉన్నా.. బ్రష్ చేయాల్సిందే. ఎందుకంటే.. దానివల్ల చాలా నష్టాలున్నాయి. అవేంటో చూడండి.
బ్రష్ చేసుకోవటం మనందరి దినచర్యలో భాగం. కానీ, ఎంత మంది బ్రష్ చేసుకోకుండా ఉంటున్నారనే విషయాన్ని ఓ కొత్త పరిశోధన బయటపెట్టింది. బ్రష్ చేయకపోవటం వల్ల కలిగే నష్టాలు మనం ఊహించిన దాని కంటే ఘోరంగా ఉంటాయని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.
రెండు పూటలా బ్రష్ చేయాలట..
సాధారణంగా చాలామంది ఒక పూట మాత్రమే బ్రష్ చేస్తారు. కానీ, డాక్టర్లు మాత్రం రోజూ తప్పకుండా రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం కేవలం 2/3 వంతు మహిళలే రెండు పూటలా బ్రష్ చేసుకుంటున్నారని తెలిసింది. సగం మంది పురుషులు బ్రష్ చేసుకోవటానికి బద్దకిస్తున్నారని తేలింది. అలా చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదట. 24 గంటలు దాటి బ్రష్ చేయకుండా అస్సలు ఉండకూడదని సూచిస్తున్నారు.
రాత్రంతా మేల్కొని ఉన్నపుడు కొంతమంది బ్రష్ చేయటం మర్చిపోతారు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పొద్దున బ్రష్ చేసుకోకపోవటం వల్ల కంటే రాత్రి బ్రష్ చేసుకోకపోవటం వల్లే దంతాలకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందట. నిద్రలో ఉన్నపుడు, నోటిలో లాలాజలం తగ్గుతుంది. అలాగే, బ్యాక్టీరియా చాలా తొందరగా పెరుగుతుంది. రాత్రిపూట బ్రష్ చేయటం వల్ల దంతాల్లో ఇరుక్కుపోయిన ఆహారం తొలగిపోతుంది. తద్వారా, రాత్రిపూట బాక్టీరియా తక్కువ పెరిగే అవకాశం ఉంటుంది.
బ్రష్ తో ఒక్కసారి కూడా పళ్ళు తోమని వారికి, లేదా సరిగా బ్రష్ చేసుకోని వారికి క్యావిటీ, చిగుర్ల సమస్యలు, పళ్లు ఊడిపోవడం, నోటి దుర్వాసన, తీవ్రమైన పంటినొప్పులు వస్తుంటాయి. దంత సమస్యలు చాలా కాలం పరిష్కరించకపోతే, అది పూర్తి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.
సరిగ్గా బ్రష్ చేయకపోతే వచ్చే సమస్యలివే
1. దంతాల మీద పాచి పెరుగుతుంది
ప్లాక్ అంటే, దంతాల్లో ఇరుక్కున్న ఆహారం మీద బతికే బాక్టీరియా. దీని వల్ల క్యావిటీ పెరిగి, అది దంతాల మీద అతుక్కుపోతుంటుంది. దీని వల్ల చిగుర్ల సమస్యలు వస్తాయి. బ్రష్ చేయటం ఆలస్యమైతే అతుక్కుపోతున్నట్లు ఉంటుంది. పాచివల్లే ఇలా జరుగుతుంది.
2. నోటి దుర్వాసన
నోటిలో ఉండే బాక్టీరియా దుర్వాసనకు కారణం అవుతుంది. సరైన టూత్ పేస్ట్‌ను వాడితే దుర్వాసన కలిగించే బాక్టీరియా చచ్చిపోతుంది. ఇందుకు డాక్టర్ సలహా తీసుకోండి.
3. దంతాల రంగు మారవచ్చు
టీ, కాఫీ, తీపి పానీయాలు, స్వీట్ల వల్ల దంతాలు తొందరగా రంగు మారుతాయి. రోజూ బ్రష్ చేయటం వల్ల ఈ సమస్య ఉండధు.
ఆరోగ్యకరమైన దంతాల కోసం ఈ సూత్రాలు పాటించండి.
1. సున్నితమైన బ్రష్‌తో మృదువుగా దంతాలను తోమాలి.
2. మూడు నెలలకోసారి బ్రష్ మార్చాలి.
3. రోజూ రాత్రి ఫ్లాసింగ్ చేయాలి.
4. రెండు పూటలా బ్రష్ చేయాలి.
5. నాలుకను టంగ్ క్లీనర్‌తోనే శుభ్రం చేయాలి.
Also Read: నిశ్చితార్థానికి, పెళ్లికి ఇంత మార్పా? అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరగడానికి కారణం అదేనట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.