Anant Amabani Weight Gain Reasons : ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతుంది. ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కుర్రాడు నిశ్చితార్థం సమయంలో సూపర్ ఫిట్​గా కనిపించాడు. 18 నెలల్లో 108 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఎంత వేగంగా బరువు తగ్గాడో.. అంతే వేగంగా బరువు పెరిగి మళ్లీ వార్తల్లో నిలిచాడు. తీసుకునే ఆహారం, వ్యాయామాలు, రోటీన్ దినచర్యలలో ఎన్నో మార్పు చేసి.. ఎంతో శ్రమించి బరువు తగ్గిన అనంత్.. మళ్లీ బరువు పెరిగిపోవడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


రీసెంట్​గా అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్​ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వీటిలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏమిటంటే.. ఎంగేజ్​మెంట్ సమయంలో ఫిట్​గా కనిపించిన ఇతను.. మళ్లీ లావుగా ఎలా అయిపోయాడు అని. అతను బరువు పెరగడానికి అనారోగ్యకరమైన జీవనశైలినే కారణమా? ఇంతకు అనంత్ బరువు పెరగడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.


బరువు పెరగడం ఇదేమి తొలిసారి కాదు..


ఊబకాయంతో కనిపించడం అనంత్​కు ఇదేమి తొలిసారి కాదు. మొదటినుంచి పలు ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆయన లావుగానే ఉండేవారు. అనంతరం సన్నగా మారేందుకు అతను చేసిన శ్రమ అంతా ఇంతా కాదు. సమతుల్యమైన డైట్, రెగ్యూలర్ వ్యాయామాలు.. అతని బరువులో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయి. అతని రూపాన్ని పూర్తిగా మార్చేశాయి. బరువు సమస్యలతో పోరాడుతున్న ఎందరికో మార్గదర్శకంగా నిలిచాయి. 2023లో జరిగిన నిశ్చితార్థ ఫోటోలు చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 


అనంత్ అంబానీ ఆరోగ్యకారణాలే అతనిని మళ్లీ బరువు పెరిగేలా చేశాయి అంటున్నారు నిపుణులు. ఎలాంటి శస్త్ర చికిత్సలు లేకుండా బరువు తగ్గిన అనంత్.. ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారు. అది అతని బరువుపైచాలా ప్రభావం చూపిస్తుందని నీతా అంబానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అతనికి ఉబ్బసం ఉండడం వల్ల స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చిందని.. అవి స్థూలకాయానికి దారితీశాయని తెలిపారు. 


స్టెరాయిడ్స్ బరువు పెరగడానికి ఎలా కారణమవుతాయంటే..


ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేస్తున్న సమస్యలలో ఆస్తమా ఒకటి. ఇది దీర్ఘకాలిక శ్వాసకోశ రుగ్మత. వాయుమార్గాల వాపు, సంకుచితం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. దగ్గు, గురక వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి పూర్తి చికిత్స లేనప్పటికీ.. ఇన్​హేలర్స్, స్టెరాయిడ్స్ వంటి వివిధ చికిత్సల ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. అయితే ఆస్తమా లక్షణాలు ఉన్న వ్యక్తికి వ్యాయామం చేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి అంటున్నారు నిపుణులు. 


సమస్యను కంట్రోల్ చేయడం కోసం స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల సాధారణం కంటే ఎక్కువ ఆకలి వేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది. నోటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ద్రవం నిలుపుకోవడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టెరాయిడ్స్ శరీరంలో నీటి నిలుపుదలకు కారణం అవుతాయి. దీనివల్ల ఎక్కువగా బరువు పెరుగుతారు. ఆకలి కోరికలు పెరిగి.. ఎక్కువ కేలరీలు కలిగిన ఫుడ్స్ తీసుకుంటారు. ఇవి మందులు, జీవక్రియను ప్రభావితం చేస్తాయి. శరీరంలో కొవ్వు నిల్వలను ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ అదనంగా కొవ్వు ఏర్పడుతుంది. ఇవన్నీ.. బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. అనంత్ అంబానీ కూడా ప్రస్తుతం ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read : వ్యాయామం చేసేప్పుడు ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. గుండెపోటు కావొచ్చు