Wrong Blood Group Transfusion Complications : మనిషి రక్తం వారి ఆరోగ్యానికి, మనుగడకు అత్యంత ముఖ్యమైనది. అయితే అదే రక్తం వేరొకరిదైతే.. అది వారి శరీరానికి సరిపోకపోతే.. రెండు బ్లడ్ గ్రూప్స్ కలిస్తే ఏమి జరుగుతుంది? వివిధ సందర్భాల్లో, ప్రమాదాల్లో, సర్జరీలు చేసేందుకు ఒక రోగికి రక్తం అవసరమైతే.. వారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు రక్తం ఎక్కించేందుకు చూస్తారు. ఇది చాలా సాధారణమైన వైద్య ప్రక్రియ. కానీ చాలా సున్నితమైనది కూడా. ఎందుకంటే రోగికి బ్లడ్ గ్రూప్, ఎక్కించే బ్లడ్ గ్రూప్ వేరు అయితే.. అది వారికి ఎక్కిస్తే.. తర్వాత ఏమవుతుంది?
సాధారణంగా ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులలో రక్తం ఎక్కించే ముందు బ్లడ్ టైపింగ్ వంటి ప్రక్రియలు చేస్తారు. ఆ సమయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి.. లేబులింగ్‌లో తప్పు జరగడం లేదా అత్యవసర పరిస్థితుల్లో పరీక్షించకుండా రక్తం ఎక్కిస్తే.. అది ప్రాణాంతకం కావచ్చు.
రక్తం మారితే
డాక్టర్ మోహిత్ చౌదరి మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి అతని రక్త సమూహానికి సరిపోని రక్తం ఎక్కిస్తే.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆ రక్తాన్ని విదేశీ దాడిగా భావిస్తుంది. ఈ పరిస్థితిని వైద్య భాషలో అక్యూట్ హెమోలిటిక్ ట్రాన్స్‌ఫ్యూషన్ రియాక్షన్ (AHTR) అంటారు. ఈ సమయంలో శరీరం కొత్త రక్తాన్ని నాశనం చేసేందుకు ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన రక్త కణాలు పగిలిపోయి.. శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
రక్తమార్పిడితో కనిపించే లక్షణాలు
- తీవ్రమైన జ్వరం, వణుకు
- ఛాతీ లేదా నడుము నొప్పి
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
- మూత్రం రంగు ఎరుపు లేదా ముదురు రంగులోకి మారడం
- రక్తపోటు తగ్గడం
- శరీరంలో వాపు లేదా అలెర్జీ వంటి లక్షణాలు
ఈ లక్షణాలు సకాలంలో గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. లేదంటే పరిస్థితి విషమించి మూత్రపిండాల వైఫల్యమై.. షాక్, మరణానికి కూడా దారి తీస్తుంది.
అలా జరగకూడదంటే..
- బ్లడ్ టెస్ట్ నివేదిక : రక్తం ఎక్కించే ముందు రోగి రక్త సమూహాన్ని కచ్చితంగా గుర్తించాలి.
- క్రాస్-మ్యాచ్ చేయడం అవసరం : దాత, రోగి రక్తాన్ని కలిపి పరీక్షించడం తప్పనిసరి. బ్లడ్ ఎక్కించే ముందు కచ్చితంగా తెలుసుకోవాలి.
- జాగ్రత్తగా ఉండాలి : ఏ రక్తం ఎక్కిస్తున్నారో రోగి బంధువులకు కచ్చితంగా చెప్పాలి.
తప్పు బ్లడ్ గ్రూప్ఎక్కించడం అనేది చిన్న నిర్లక్ష్యమే అయినా ఫలితాలు చాలా పెద్దగా ఉంటాయి. ఈ పరిస్థితి కేవలం నిమిషాల్లోనే శరీరంలో ఇబ్బందులు కలిగింస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాపాయం కూడా జరగవచ్చు. కాబట్టి రక్తం ఎక్కించుకునేప్పుడు జాగ్రత్తగా అలెర్ట్‌గా ఉండాలి. పేషెంట్ స్పృహలో వైద్యులను అడిగి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. స్పృహలో లేకుంటే వారి బంధువులకు కచ్చితంగా చెప్పాలి. అలాగే వైద్యులు కూడా పేషెంట్ బ్లడ్, దాత బ్లడ్ గ్రూప్ ఒక్కటేనో కాదో చెక్ చేసుకోవడం వల్ల ఇబ్బంది రాకుండా ఉంటుంది.