మహిళలకు బాధ్యతలెక్కువ. అదే వర్కింగ్ ఉమెన్స్‌కు అయితే మరీ ఎక్కువ. ఓ వైపు కుటుంబాన్ని మరో వైపు ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో మహిళలకు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూంటారు. ఉద్యోగాలను వదిలేయాలనుకుంటారు. కానీ ఎలాంటి సమస్య వచ్చినా ప్రశాంతంగా ఆలోచించి.. అడుగు ముందుకు వేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ తమ ఫ్యామిలీ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ? పని ప్రదేశంలో సవాళ్లను ఎలా అధిగమించాలి ? 


సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం ! 


జీవితం అనే పరుగు పందెం ఎవరిది వారిదే. పెళ్లి అనేది బంధం అనుకుంటే బంధం.. బంధనం అనుకుంటే బంధనం. కానీ గెలవాలంటే పరుగెత్తాలి. శ్రమ పడాలి. అందు కోసం మొదటగా చేయాల్సింది సొంత ఆలోచనలు. ఎవరి ఆధారం లేకుండా నిలబడే ప్రయత్నం చేయాలి. ఎవరినో బతిమాలాల్సిన పనిలేకుండా నీ నిర్ణయాలను నువ్వే తీసుకునేంత ధైర్యాన్ని తెచ్చుకోవాలి.   వర్కింగ్ ఉమెన్స్‌కు పురుషులకు ఉండని సమస్యల ుఉంటాయి.  అందుకు కార‌ణాలు అనేకం. కుటుంబ ఒత్తిళ్లు, ఆరోగ్యం, ప‌నిచేసే చోట ప‌రిస్థితులు.. ఇలా స‌వాల‌క్ష కార‌ణాలు. భార‌తీయ స‌మాజంలో వ‌ర్కింగ్ మెన్‌తో పోల్చితే వ‌ర్కింగ్‌ విమెన్‌కు బాధ్య‌త‌లు ఎక్కువ. ఆఫీసు త‌ర్వాత ఇంటికి వెళ్లి గృహిణిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాలి. పిల్లలు, వారి చదువులు, అత్తామామ, వారి ఆలనాపాలనా, ఇలా చాలామంది మహిళలు కెరీర్ వ‌దులుకుంటున్నారు.   మ‌హిళ‌లు ఎక్కువ‌గా ప‌నిలో ఒత్త‌డికి గుర‌వుతుండ‌డంతో కెరీర్ల‌ను ఆపేస్తున్నారు.  దీన్ని అధిగమించాలంటే ముందుగా చేయాల్సింది ప్రశాంతంగా ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకోవడమే. 


మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి ! 


చాలామంది, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే అనుకుంటారు. మనసును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు.  కానీ మహిళలు మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు మొదలైన రుగ్మతలకు గురి అవుతున్నవారిలో మహిళలే ఎక్కువని రిపోర్టులు వెల్లడవుతున్నాయి. కుటుంబ సమస్యలు, ఆఫీసులో పనుల కారణంగా మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మానసిక దృఢత్వం తక్కువగా ఉన్న స్త్రీలలో ఇలాంటి ఇబ్బందులు మరీ అధికం. అందుకే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి.  రోజూ కొంత సమయమైనా మన కోసం మనం కేటాయించుకోవాలి.  సానుకూల దృక్పథాన్ని అందించే స్నేహితులు, ఆత్మీయులతో సమయాన్ని గడపాలి. శారీరక, మానసిక, లైంగిక వేధింపులకు ఆస్కారం ఇవ్వకూడదు.   రోజూ ఓ పది నిమిషాలు ధ్యానం చేయాలి. దీనివల్ల ఆలోచనల మీద పట్టు వస్తుంది. మానసిక సమస్యలు ఇబ్బంది పెడుతుంటే కౌన్సెలర్‌ లేదా థెరపిస్ట్‌ సలహా తీసుకోవాలి.
 
ఒత్తిడి తగ్గించే కార్యక్రమాల్లో పాల్గొనండి !


కేవలం మ‌హిళ‌ల‌ను మాత్ర‌మే భాగ‌స్వాముల‌ను చేసి టెక్ ఈవెంట్లు, కాన్ఫ‌రెన్స్‌లు జరుగుతూ ఉంటాయి. అలాగే వ్య‌క్తిత్వ వికాస నిపుణులతో ఉద్యోగాన్ని, కుటుంబ బాధ్య‌త‌ల‌ను బాలెన్స్ చేసేలా కౌన్సెలింగ్ క్లాసులు నిర్వ‌హిస్తూ ఉంటాయి. అలాంటి వాటికి అటెండ్ అవ్వొచ్చు.  ప్ర‌పంచస్థాయి మార్కెట్ లో పేరొందిన మ‌హిళా సీఈవోలు, కంపెనీ డైర‌క్ట‌ర్లు, ఇత‌ర కీల‌క స్థానాల్లో ప‌నిచేసే వారంతా వర్కింగ్ ఉమెన్‌కు సాయపడేందుకు కొన్ని ప్రత్యేకమైన ఫ్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేసారు. వీటిలో సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు.  వీటిలో పాల్గొని ... ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు. 


ఆర్థిక స్వాతంత్రాన్ని వదులుకోవద్దు ! 


ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు నిర్వహిస్తున్నా చాలామంది మహిళలు ఆర్థిక విషయాల్లో పురుషులపైనే ఆధారపడుతున్నారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రయత్నం చేసినా.. భర్త, పిల్లలు నిరుత్సాహపరుస్తున్నారు. మరోవైపు ఖర్చు తప్ప, పొదుపు తెలియని మహిళలూ ఉన్నారు. వీళ్లంతా కొత్త సంవత్సరం నుంచి అయినా ఆర్థిక ప్రణాళిక, దీర్ఘకాలిక లక్ష్యం వైపు అడుగులు వేయాలి. ఆర్ధిక విషయాలు పురుషులకు మాత్రమే సొంతం అనే భావనను పక్కన పెడితే మహిళలు కూడా ఆర్ధిక విషయాల్లో విజయం సాధించగలరు. బాగా చదువుకొని ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఆర్థిక విషయాలి అనేసరికి వెనక్కి పోతారు. అలా భయపడే అవసరమే లేదు ఎప్పటికప్పుడు అప్ డేట్అవుతూ ఉండాలి.సామాజికంగా ఉండే పరిమితుల్ని దాటి తమ ఆలోచనలు మార్చుకోవాలి. ముఖ్యంగా తమ పట్ల తాము నమ్మకం కలిగి ఉండాలి. మహిళలు ఈ విధంగా ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉన్నప్పుఫు జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. స్థిరమైన వ్యక్తిత్వాన్ని కలిగి సమాజంలో ధైర్యంగా ఉండగలరు. సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించగలరు. ఇంటర్నెట్‌ పుణ్యమా అని ఉపాధి అవకాశాలు విస్తృతం అయ్యాయి. పెయింటింగ్స్‌, కుట్లు, అల్లికలు, హోమ్‌ చెఫ్‌, ట్యూషన్స్‌.. ద్వారా ఎంతోకొంత ఆర్జించే అవకాశం ఉంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కూడా ఓ వరమే. సంపాదన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సమాజంలో ఓ గుర్తింపును తెస్తుంది. జీవన నాణ్యతను పెంచుతుంది. వృద్ధాప్యంలో ఆసరాగా నిలబడుతుంది.


ఆహారం విషయంలో జాగ్రత్తలు ! 


ఇల్లు, పిల్లలు, ఉద్యోగం.. ఇలా రకరకాల బాధ్యతలలో పడిపోయి మహిళలు తిండి గురించి పట్టించుకోవడం మానేశారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలన్న ఆలోచనే రాదు. మహిళల శ్రమకు, వాళ్లు తీసుకునే ఆహారానికి ఏమాత్రం పొంతన ఉండదు. అందుకే, చిన్న వయసులోనే రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.  పురుషులతో పోలిస్తే మహిళలకు క్యాలరీలు తక్కువగా; విటమిన్స్‌, మినరల్స్‌ ఎక్కువగా అవసరం అవుతాయి.   మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. దేశమూ ఆరోగ్యంగా ఉంటుంది.ఆమె మాత్రం తన గురించి పట్టించుకోవడం లేదు. హారతి కర్పూరంలా, కుటుంబ సేవలోతనను తాను కరిగించుకుంటున్నది.  ఆహారాన్ని మించిన ఔషధం లేదు. వర్కింగ్ ఉమెన్‌కు ఇది మరీ ముఖ్యం. 
 "  ఐ యామ్ నాట్ ఏ డిఫికల్ట్ ఉమన్ ఎట్ ఆల్ . ఐ యామ్‌ ఏ సింప్లి ఏ స్ట్రాంగ్ ఉమన్ అండ్ నో మై వర్త్ " అని మనసులో అనుకుని ఆచరిస్తే ఎలాంటి సవాళ్లనైనా ఇట్టే ఎదుర్కోవచ్చు.