2021 ముగిసిపోవడానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. ఈ ఏడాది మనకెన్నో తీపి గురుతులను, చేదు అనుభవాలను మిగిల్చింది. అలాగే ఆహారపరంగాను ఎన్నో అద్భుతమైన రుచులను పరిచయం చేసిన 2021 కొన్ని విచిత్రమైన వంటకాలను కూడా మనముందుంచింది. వాటిల్లో చాలా వింత ప్రయోగాలు సోషల్ మీడియాలో ట్రెండయ్యాయి. వీటిల్లో వికారంగా అనిపించిన టాప్ వంటకాలు ఇవే...


1. మ్యాగీ మిర్చి కా తడ్కా



పెద్ద పచ్చి మిరపకాయలు, మ్యాగీ కలిపి చేసిన ఒక విచిత్రమైన వంటకం ఇది. ఈ అసాధారణమైన మ్యాగీ ప్రయోగం చాలా మందికి వికారం కలిగించే ఉంటుంది. ఫేస్ బుక్, ట్విట్టర్లో తెగ ట్రెండయిన ఈ వంటకాన్ని చూసి చాలా మంది ‘యాక్’అంటూ ఎమోజీలు పెట్టారు. దీనికి ‘స్టఫ్డ్ చిల్లీ మ్యాగీ’అని పేరు పెట్టారు కొంతమంది. పచ్చిమిర్చిని మధ్యలో నిలువుగా కట్ చేసి మధ్యలో మ్యాగీని నింపుతారు ఇందులో. తింటే ఎలా ఉంటుందో తెలియదు కానీ, కాంబినేషన్ మాత్రం పరమచెత్తగా ఉంది. 


2. రసగుల్లా చాట్



బెంగాలీ రసగుల్లాకు ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. దానికి చాట్‌ను జతచేసి కొత్త వంటకాన్ని సృష్టించారు. అంజలి ధింగ్రా అనే ఫుడ్ బ్లాగర్ ఈ రసగుల్లా చాట్ గురించి తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. రసగుల్లాలో సేవ్, పెరుగు, చాట్ వేసి ఇవ్వగా, దాన్ని చట్నీతో రుచి చూసిన వీడియోను పోస్టు చేసింది. అది వైరల్ గా మారింది. ఈ ఫుడ్ కాంబో చాలా మందికి అసహ్యాన్ని కలిగించింది. 


3. మ్యాగీ మిల్క్ షేక్



ఈ ఏడాది ఎక్కువ మంది అసహ్యించుకున్న ఫుడ్ కాంబో ఇదే. మిల్క్ షేక్ పై మ్యాగీని పోసి ఇస్తారు. ఇది వినడానికే కాదు, చూడటానికి కూడా చాలా వికారంగా ఉంది. ఇక తిన్నవారికి ఎలా ఉందో వారే చెప్పాలి. సోషల్ మీడియాలో మ్యాగీ మిల్క్ షేక్ చాలా వైరల్ అయ్యింది. ‘ఇంతకన్నా ఛండాలమైన ఆహారపు కలయిక ఉంటుందా’ అంటూ చాలా మంది కామెంట్లు పెట్టారు. 


4. ఫాంటా ఆమ్లెట్



మీరు చదివింది నిజమే. ఫాంటా పానీయాన్ని ఆమ్లెట్ పై పోసి మీకు అందిస్తారు. గుజరాత్ లో ఒక రోడ్డు సైడున ఫుడ్ స్టాల్ పెట్టుకున్న వ్యక్తి దీన్ని తయారుచేసి అమ్ముతున్నాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ వ్లాగర్ ఈ ఫాంటా ఆమ్లెట్ గురించి వీడియో చేసి పెట్టారు. అది వైరల్‌గా మారింది. కేవలం ఫాంటా ఆమ్లెట్ మాత్రమే కాదు, లిమ్కా ఫ్రైడ్ రైస్, థమ్స్ అప్ ఫ్రై వంటివి కూడా ఈ ఫుడ్ స్టాల్ లో లభిస్తాయి. 


5. బటర్ చికెన్ గోల్‌గప్పా



డెవ్లీనా అనే ట్విట్టర్ యూజర్ ఈ బటర్ చికెన్ గోల్‌గప్పా గురించి రాశారు. మనం గోల్‌గప్పాను పానీపూరీ అని పిలుచుకుంటాం. పానీపూరీలో చికెన్ వేసుకుని తింటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. అందుకే ఆమె దీనికి ‘ఈ చెత్త జీవితంలో ఎవరికీ అవసరం లేదు’ అని క్యాప్షన్ పెట్టింది.   
















ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.