కరోనా కొత్త వేరియంట్లు ఒకదాని తరువాత ఒకటి దాడి చేస్తూనే ఉన్నాయి. దీంతో రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ మాస్కులు కూడా తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి. ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. అయితే ఒమిక్రాన్ నుంచి అన్ని మాస్కులు రక్షణ కల్పిస్తాయా? కాదంటున్నారు అంతర్జాతీయ వైద్యులు. ఒమిక్రాన్ నుంచే కాదు, ఏ వైరస్ నుంచి కూడా కాటన్ మాస్కులు రక్షణ కల్పించలేవని చెబుతున్నారు. 


అమెరికాలోని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో మాస్కులపై ఓ కార్యక్రమం జరిగింది. దీనికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వైద్యులు హాజరయ్యారు. వారిలో డాక్టర్ లియాని వెన్ ఒకరు. ఆయన మాట్లాడుతూ చాలా మంది డ్రెస్‌లకు మ్యాచింగ్‌గా కాటన్, ఇతర ఫ్యాబ్రిక్‌తో చేసిన మాస్కులు వస్తున్నాయని, వాటిని వాడడం వల్ల ఉపయోగం లేదని హెచ్చరించారు. అన్నింటికన్నా ప్రభావవంతంగా పనిచేసేవి  N95 లాంటి మాస్కులేనని తెలిపారు. నోటినుంచి వచ్చే తుంపరలని, తుమ్మినప్పుడు వచ్చే తుంపరలని కాటన్ మాస్కులు పీల్చేసుకుంటాయి, దీని వల్ల వైరస్ మాస్కుకే అంటుకుని ఉండే ప్రమాదం ఉంది. అందుకే  KN95, N95, KF94 లాంటి మాస్కులు వాడమని చెబుతున్నారు వైద్యులు. ఇవి పెద్ద తుంపరల్లోని వైరస్ ను కూడా బయటే ఆపగలవు. ఈ మాస్కులు దాదాపు 95 శాతం వరకు కరోనా వ్యాప్తిని అడ్డుకుంటాయి. అయితే ఏ మాస్కు నైనా రోజూ ఉతకడం మాత్రం చాలా ముఖ్యం. 


KN95, N95, KF94... ఈ మాస్కులు ఒకే లేయర్‌తో కాకుండా మూడు లేయర్లతో తయారవుతాయి. కాబట్టి రక్షణ అధికంగా అందిస్తాయి. మిగతా సింగిల్ లేయర్ మాస్క్ లు కేవలం 50 శాతం మాత్రమే రక్షణ కల్పిస్తాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటూ, ఇలాంటి మాస్కులు వాడడం ద్వారా ఒమిక్రాన్ వంటి వైరస్‌ల నుంచి రక్షణ పొందవచ్చు. 















ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.