ప్రపంచంలో అత్యంత విలువైనవి వజ్రాలు. డైమండ్స్ పొదిగిన నగలను ధరించాలని ప్రతి మహిళ ఆశ పడుతుంది. ధనవంతులు కొనగలరు. సాధారణ ప్రజలకు చాలా కష్టంతో కూడిన వ్యవహారం. తాజాగా యురోపియన్ శాస్త్రవేత్తలు చెప్పిన విషయం వింటే మున్ముందు మధ్య తరగతి ప్రజలు కూడా డైమండ్ నగలు ధరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, ఐరోపా పరిశోధకులు ఏం చేశారో తెలుసుకోవల్సిందే.
అత్యంత చౌకగా లభించే ప్లాస్టిక్ నుంచి వ్రజాలు తయారు చేయవచ్చని నిరూపించారు ఐరోపాకు చెందిన పరిశోధకులు. లేజర్ ల ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని వెల్లడించారు. అత్యంత శక్తి కలిగిన లేజర్ కిరణాలు ప్లాస్టిక్ షీట్ల మీద పడినప్పుడు నానో డైమండ్స్ తయారు అవుతాయని వెల్లడించారు. వీటి ద్వారా అత్యంత చౌక ధరలకే నగలను తయారు చేసి అమ్మే అవకాశం ఉంటుందన్నారు.
జర్మన్ భౌతిక శాస్త్రవేత్త డొమినిక్ క్రాస్ ప్లాస్టిక్ నుంచి తయారయ్యే నానో వజ్రాల తయారీ గురించి పలు విషయాలు వెల్లడించారు. " అల్ట్రాస్మాల్ క్వాంటం సెన్సార్‌లు, ఉష్ణోగ్రత, అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి నానోడైమండ్స్ తయారు చేసే అవకాశం ఉంటుందన్నారు. వీటి ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉందంటున్నారు. మహా సముద్రాలను పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నానో డైమండ్స్ ను ఉపయోగించి తక్కువ ధరకే ఎన్నో ఆభరణాలు తయారు చేసుకునే అవకాశం ఉందన్నారు.
నానోడైమండ్ రీసెర్చ్ లో భాగంగా.. భౌతిక శాస్త్రవేత్తలు పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, PET ప్లాస్టిక్ షీట్‌ను ఉపయోగించారు. సోడా, వాటర్ బాటిళ్లు వీటితోనే తయారు అవుతాయి. ఈ ప్లాస్టిక్ పదార్థాన్ని సూపర్-హీట్ అంటే 10,000 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉష్ణోగ్రత పెంచి.. లేజర్లు పంపించడం ద్వారా సెకెనులో బిలియన్ వంతులో పెద్ద మార్పులు జరిగినట్లు గుర్తించారు. ప్లాస్టిక్ ను హైపర్-కంప్రెస్ చేసి, దాని పరమాణు నిర్మాణాన్ని మారుస్తుందన్నారు. ప్లాస్టిక్‌లో కనిపించే కార్బన్ స్ఫటికీకరించబడుతున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో ఆక్సిజన్, హైడ్రోజన్ అందులో నుంచి బయటకు వెళ్తుంది. వెంటనే క్రిస్టలైజ్డ్ కార్బన్ నానోడైమండ్స్ ను సృష్టించింది అని డొమినిక్ క్రాస్ తెలిపారు. చూశారుగా.. దీన్ని బట్టి చూస్తుంటే భవిష్యత్తులో.. రోల్డ్ గోల్డ్ తరహాలోనే నకిలీ డైమండ్ల ఆభరణాలు కూడా ఆకట్టుకొనే అవకాశాలు లేకపోలేదు. ఇలాగైతే.. డైమండ్ విలువ కూడా తగ్గిపోవచ్చు. మరి దీనిపై మీరు ఏమంటారు? మీ ఓటు దేనికి ప్లాస్టిక్ తయారయ్యే డైమండ్‌కా? లేదా సహజ సిద్ధంగా ఏర్పడే వజ్రాలకా?
Also read: యాభై శాతం భారతీయ ఉద్యోగులు ఇందుకే రాజీనామా చేస్తున్నారు, సర్వేలో షాకింగ్ విషయాలు
Also read: ఈ ఎర్రని పండ్ల రసం సహజంగా నిద్రలేమిని అంతం చేస్తుంది, మందులు అవసరమే ఉండదు