Mohan Bhagwat On Food: 


ఆ కార్యక్రమంలో...


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)చీఫ్ మోహన్ భగవత్ ఆహారపు అలవాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. "తప్పుడు ఆహారం తీసుకుంటే తప్పుడు ఆలోచనలే వస్తాయి" అని వ్యాఖ్యానించారు. మాంసాహారం తీసుకునే వాళ్ల గురించి ఇలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు భగవత్. హింసతో కూడుకున్న ఆహారాన్ని తీసుకోవటం మంచిది కాదని హితవు పలికారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థైన భారత్ వికాస్ మార్చ్ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన భగవత్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఈ కామెంట్స్ చేశారు. "తప్పుడు ఆహారం తింటే తప్పుడు మార్గంలోనే వెళ్తాం. తామసాన్ని కలిగించే ఆహారాన్ని తినకపోవటమే మంచిది. విపరీతమైన హింసతో కూడుకున్న ఆహారం తినకూడదు" అని అన్నారు. ఇక్కడ తామసంతో కూడుకున్న ఆహారం అంటే మాంసం అనే అర్థమే వస్తుంది. పాశ్చాత్య దేశాల్లో, భారత్‌లో మాంసాహారులను పోల్చుతూ మరి కొన్ని కామెంట్స్ చేశారు. "భారత్‌లోనూ కొందరు మాంసాహారం తింటారు. కానీ...పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మాంసాహారం తీసుకునే వాళ్లు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. శ్రావణ మాసంలో కొందరు మాంసం తినకుండా నిష్ఠగా ఉంటారు. కొందరు సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం..ఇలా కొన్ని రోజుల్లో మాంసం ముట్టుకోరు. తమకు తాముగా ఈ నియమాలు పెట్టుకుంటారు" అని భగవత్ చెప్పారు. 






భారత్‌ గొప్పదనం అదే..


దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నవరాత్రుల సమయంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. ఇంకొందరు మాంసం తినకుండా మానేస్తారు. ఇది దృష్టిలో పెట్టుకునే ఆయన అలా అన్నారు. ఈ సమయంలోనే భారత్ సేవాగుణాన్ని కూడా ప్రస్తావించారు. "ఆధ్యాత్మికతలోనే భారత్‌ ఆత్మ దాగుంది" అని వ్యాఖ్యానించారు. "శ్రీలంక, మాల్దీవులు కష్టకాలంలో ఉంటే ఆదుకున్న ఒకే ఒక దేశం భారత్ అని గుర్తు చేశారు. మిగతా దేశాలన్నీ తమతమ వ్యాపార లాభాల కోసం చూసుకున్నాయని అన్నారు. "ఆధ్యాత్మికతతో ఎలా జీవించాలో ప్రపంచ దేశాలకు చెప్పాల్సిన బాధ్యత భారత్‌కు ఉంది"అని చెప్పారు. ఎలాంటి ఇగో లేకుండా జీవించడం భారతీయులకు మాత్రమే తెలుసని అన్నారు. శ్రీలంకలో వ్యాపార అవకాశాలున్నాయని గుర్తించాకే...చైనా, పాకిస్థాన్, అమెరికా ఆ దేశం వైపు చూశాయని స్పష్టం చేశారు.